YS Jagan vs ABN Radhakrishna : “వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వీరాభిమానులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి అంతకుమించి ఉన్నారు. ఆయన ఏం చెప్పినా చేసేందుకు సిద్ధంగా ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మాహుతి దళాలు మాదిరిగా.. “.. ఈ మాట అన్నది ఎవరో తెలుసా? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే దానికి కౌంటర్ ఇచ్చింది ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. రాధాకృష్ణ వీకెండ్ కామెంట్ లో చెప్పింది కూడా అదే కదా అని సమర్థించుకుంది. కొన్ని ఉపమానాలు చెబుతూ.. జగన్ ఏది చెబితే అది వైసీపీ నేతలు నమ్మేస్తారని వీకెండ్ కామెంట్లో రాసుకోవచ్చారు రాధాకృష్ణ. చివరకు ఇంట్లో భార్యలను సైతం చెల్లెలుగా చెబితే.. వారికి వివాహాలు చేసేందుకు కూడా వెనుకడుగు వేయని వెన్నుముక లేని బ్యాచ్ అంటూ రాధాకృష్ణ రాయడంతో వైసీపీ నేతలు ఆగ్రహంతో ఊగిపోయారు. కానీ ఇప్పుడు సొంత పార్టీ ఎంపీ ఆత్మహత్య దళాలు అని వ్యాఖ్యానించడం మాత్రం విమర్శలకు తావిస్తోంది.
* తప్పుడు వ్యాఖ్య..
చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అనేది.. పురాణ గాథలను ఉదహరిస్తూ చెబుతుంటారు పెద్దలు. చూసి రమ్మంటే కాల్చి రావడం కూడా చాలా పెద్ద తప్పు. అలాగే ఉగ్రవాదంలో ఆత్మహుతి దళాలు అనే మాట వినిపిస్తుంది. తమ ఆశయం కోసం తమ ఆత్మను బలిదానాలు చేయడాన్ని గొప్పగా చెబుతుంటారు. జగన్మోహన్ రెడ్డికి అటువంటి ఆత్మాహుతి దళాలు ఉన్నాయని అర్థం వచ్చేలా మాట్లాడారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. జగన్ ఆదేశాలను తాము పాటిస్తామని.. ఆయన చెప్పింది చేస్తామంటూ ఒప్పుకున్నారు మిధున్ రెడ్డి. మరి దానినే నేను రాసుకు వచ్చాను అంటూ రాధాకృష్ణ ఈరోజు ఆంధ్రజ్యోతిలో స్పష్టత ఇచ్చారు. మిధున్ రెడ్డి మైండ్ లో ఉన్నది తన అభిప్రాయ రూపంలో చెప్పానని రాధాకృష్ణ చెబుతున్నారు.
* ఆత్మహుతి దళాలు..
సాధారణంగా తమ ఆశయం కోసం, నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఆత్మాహుతి దాడులకు చాలామంది సిద్ధపడతారు. జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి ఆత్మహుతి దళాలు ఉన్నాయని చెప్పడం ద్వారా మిధున్ రెడ్డి ఈ సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? పార్టీ కోసం పని చేస్తాం.. పార్టీ అధినేత కోసం పని చేస్తాం.. పార్టీ ఆదేశాలను పాటిస్తాం అని చెప్పవచ్చు కానీ.. అవసరం అనుకుంటే ఆత్మాహుతి దళాలుగా మారుద్దాం అని చెప్పడం దేనికి సంకేతం. తమ సిద్ధాంతాలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బయటపెడుతున్నారు. ఆ విషయాన్ని వేరొకరు చెబితే తట్టుకోలేకపోతున్నారు. పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో హైలెట్ అవుతోంది. అందులో ప్రధానంగా ఆత్మాహుతి దళాలు అనే మాట ఎక్కువగా వైరల్ అవుతుంది. వైసీపీ నేతలు చేతలతో చూపితే తప్పులేదు కానీ.. రాధాకృష్ణ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని రాయడం తప్పా.. అని ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు.
