Tamil Nadu politics 2026 : 2019లో భారీ మెజారిటీ ఏపీలో జగన్ గెలిచాడు కదా.. అమరావతిని పక్కనపెట్టాడు. మూడు రాజధానులు అంటూ సరికొత్త పల్లవి అందుకున్నాడు. ఇదేందయ్యా అని అంటే.. సౌత్ ఆఫ్రికా కు మూడు రాజధానులు లేవా అంటూ ఉల్టా ప్రశ్నించాడు. కానీ, ఆ మూడు రాజధానుల మాట మీద జగన్ నిలబడలేదు. చివరికి వైజాగ్ ను క్యాపిటల్ చేస్తామని, రుషి కొండ మీద విలాసవంతమైన ప్యాలెస్ కూడా కట్టుకున్నాడు జగన్. కానీ ఏం జరిగింది? వైనాట్ 175 నుంచి 11కు పడిపోయాడు.
జగన్ బొక్కాబోర్లా పడ్డప్పటికీ కూడా కొంతమంది రాజకీయ నాయకులకు సోయి ఉండటం లేదు. సరికదా..మల్టీ క్యాపిటల్ పాలసీ బెంచ్ మార్క్ అయినట్టు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెడుతున్నారు. ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికల హడావుడి ఉంది. ఈసారి అక్కడ పాగా వేయాలని అన్ని పార్టీలు విపరీతమైన ఉత్సాహంతో ఉన్నాయి. అధికార డీఎంకే పార్టీ ఓటర్లకు తాయిలాలతో పాటు, వరాలు ప్రకటించేందుకు సిద్ధంగా ఉంది. అన్నా డీఎంకే, బీజేపీ పొత్తు లు ఏర్పాటు చేసుకుని పోటీ చేస్తాయి కాబట్టి.. ఆ పార్టీలు కూడా ప్రజలపై వరాలు కురిపించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక విజయ్ టీవీకే పార్టీ కూడా ఇటీవల మేనిఫెస్టోను ప్రకటించింది. అందులో డెవలప్మెంట్ కంటే సంక్షేమ పథకాలే అధికంగా ఉన్నాయి.
ఈ పార్టీల వ్యవహారాన్ని కాస్త పక్కన పెడితే.. తమిళనాడులో నామ్ తమిళర్ కట్చీ అధినేత సీమాన్ తెరపైకి తీసుకొచ్చిన ఓ అంశం సంచలనం కలిగిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఆయన ఏకంగా 426 పేజీల మేనిఫెస్టో విడుదల చేశారు. అందులో ప్రతీ అంశం వెరైటీగానే ఉంది. ఇందులో ఐదు రాజధానుల అంశం అసక్తిని కలిగిస్తోంది.
చైన్నై పై ప్రస్తుతం విపరీతమైన ఒత్తిడి ఉన్న నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రానికి ఐదు రాజధానులు ఏర్పాటు చేయాలట. తిరుచ్చి నగరాన్ని పరిపాలనా కేంద్రంగా.. చైన్నైని సాంకేతిక రాజధానిగా.. కోయంబత్తూరును వాణిజ్య రాజధానిగా.. మధురైని సాంస్క్రతిక రాజధానిగా..కన్యాకుమారిని నాలెడ్జ్ క్యాపిటల్ గా మార్చాలట. ఇదే కాదూ.. ప్రభుత్వపాఠశాలల్లోనే అందరి పిల్లలూ చదవాలట. సీఎం నుంచి ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల వరకూ సర్కారీబడుల్లోనే విద్యను అభ్యసించాలట. వ్యవసాయాన్నిప్రభుత్వ ఉద్యోగంలాగా మారుస్తారట. నీటివ్యాపారం మొత్తం రద్దు చేస్తారట.
మేనిఫెస్టోలో ఇన్ని అంశాలు రూపొందించిన తమిళర్ కట్చీ అధినేత సీమాన్.. తమిళనాడులో 2010లో పార్టీని స్థాపించారు. ఇప్పటి వరకూ ఆయన ఒంటరి పోరు చేస్తున్నారు. 2026లో కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదు. 234 నియోజకవర్గాలలో తమపార్టీ అభ్యర్థులు ఒంటరిగా పోటీ చేస్తారని ఆయన చెబుతున్నారు. 16 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆయన పార్టీ ప్రతీ సారీ ఓట్ల శాతాన్ని పెంచుకుంటూ పోతోంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు శాతం ఓట్లను సాధించింది సీమాన్ పార్టీ. మొత్తంగా 31 లక్షల ఓట్లను సాధించి డీఎంకే, అన్నా డీఎంకే, తర్వాతి స్థానాలలో నిలిచింది.