Viral Video : మనదేశంలో పచ్చని రామచిలుకలు లక్షల్లో ఉంటాయి. అడవుల్లో అయితే అనేక ఉంటాయి. కానీ తెల్లని రామచిలకలను ఎప్పుడైనా మీరు చూశారా? మనదేశంలో తెల్లని రామచిలుకలు ఆగర్భ శ్రీమంతుల ఇంట్లో మాత్రమే ఉంటాయి. వాటికి దక్కే మర్యాదలు మామూలుగా ఉండవు. తాగే నీరు నుంచి తినే ఆహారం వరకు వాటికి ప్రతి విషయంలోనూ రాచ మర్యాదలు లభిస్తాయి. అయితే ఇలాంటి తెల్లని రామచిలుకలు ఆస్ట్రేలియాలో కోకొల్లలుగా ఉంటాయి. వాటిని అక్కడ పెద్దగా పట్టించుకోరు. అక్కడ చెత్త కుప్పల్లో ఆహారాన్ని తింటూ ఆ రామచిలుకలు బతుకుతుంటాయి. అక్కడి ప్రజలు వాటిని పెద్దగా పట్టించుకోరు. సిడ్ని, కాన్ బెర్రా, మెల్బోర్న్, పెర్త్ ప్రాంతాలలో తెల్లని రామచిలుకలు విస్తారంగా ఉంటాయి. ఆ మధ్య అక్కడి రైతుల పంటలను విపరీతంగా తింటుండడంతో వారు తెల్లని రామచిలకలపై ఏకంగా యుద్ధమే ప్రకటించారు. ఇక ఆస్ట్రేలియాలో తెల్లని రామచిలుకలు చెత్తకుప్పలపై ఆహార పదార్థాలు తింటున్న దృశ్యాలను ఓ నెటిజన్ వీడియో తీశాడు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ” నువ్వు ఉన్నచోట మాత్రమే నీ విలువ తెలుస్తుంది. అంతేతప్ప నీకు సరిపడని చోటుకు వెళ్లి విలువ కావాలని కోరుకోకు” అని ఆ వ్యక్తి రాసుకొచ్చాడు..
విలువైన జీవిత పాఠం
ఆ వ్యక్తి పోస్ట్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ సందడి చేస్తోంది. ఇప్పటికే ఆ వీడియో వేలల్లో వీక్షణలు సొంతం చేసుకుంది. ” జీవిత సారం చెప్పాలంటే గంటల గంటల ప్రసంగం అవసరం లేదు. గొప్ప గొప్ప ఉదాహరణలు ప్రస్తావించాల్సిన అవసరం లేదు. జస్ట్ స్వల్పకాలిక వీడియో చాలు. జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ఎలా బతకాలో అర్థమవుతుంది. ఎలా బతకకూడదో అవగత మవుతుంది. అందు గురించే గొప్ప గొప్ప మేధావులు జీవితం గురించి సులువుగానే చెప్పారు. కాకపోతే నేటి కంప్యూటర్ కాలంలో.. స్మార్ట్ ఫోన్ యుగంలో జనాలకు అర్థం కావడం లేదు. అప్పుడప్పుడు మీలాంటి వాళ్ళు ఇలాంటి వీడియోలు పెడితే కాస్త మెదడుకు ఎక్కుతుంది. ఎలా బతకాలో తెలుస్తుంది. ఎలా బతకకూడదో అర్థమవుతుందని” నెటిజన్లు పేర్కొంటున్నారు.. అయితే ఆస్ట్రేలియాలో తెల్లని రామచిలుకలు మాత్రమే కాదు.. మనం జాతీయ పక్షిగా పిలుచుకునే నెమళ్లు కూడా విస్తారంగా కనిపిస్తాయట. వాటిని ఆస్ట్రేలియా ప్రజలు పెద్దగా పట్టించుకోరట. అరుదైన సందర్భంగా మాత్రమే వాటితో ఫోటోలు దిగి సంబరపడతారట. చివరికి కంగారులను కూడా వారు లైట్ తీసుకుంటారట. స్థూలంగా చెప్పాలంటే అనువు గాని చోట అధికులమనరాదు. అనువైన చోట మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. ఇదే అసలు సిసలైన జీవిత పరమార్ధం.