https://oktelugu.com/

Actress Kasthuri : ఇన్నాళ్ళూ లభించని ఆచూకీ.. ఎలా తెలిసింది? నటి కస్తూరి అరెస్టులో ఎన్నో నాటకీయ పరిణామాలు.. తర్వాత పోలీసులు ఏం చేస్తారంటే?

అప్పుడప్పుడో అన్నమయ్య సినిమాలో నటిగా కనిపించిన కస్తూరి.. కొంతకాలంగా సీరియల్స్ గా నటిస్తోంది. మొదటినుంచి వివాదాస్పద వ్యక్తిత్వానికి ప్రతీక అయిన కస్తూరి.. తన నోటికి అదుపు ఉంచదు. అదే ఆమెను ఇప్పుడు ఇబ్బందులకు గురిచేస్తుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : November 17, 2024 10:10 am
Actress Kasthuri

Actress Kasthuri

Follow us on

Actress Kasthuri :  ఇటీవల తమిళనాడులో ఓ కార్యక్రమంలో కస్తూరి మాట్లాడింది. ” తమిళనాడు రాష్ట్రానికి 300 సంవత్సరాల క్రితమే తెలుగు ప్రజలు వలస వచ్చారు.. ఇక్కడి రాజుల రాజుల భార్యలకు సేవలు చేశారు. వాళ్లు ఇప్పుడు ఏకంగా స్థానికులు అయిపోయారని” కస్తూరి వ్యాఖ్యలు చేశారు. కస్తూరి డీఎంకే నేతలను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేస్తున్నట్టు తెలుస్తున్నా.. ఆమె మాటలు మాత్రం తెలుగు వాళ్లకు వర్తిస్తున్నాయి. దీంతో కస్తూరి వ్యాఖ్యలపై తమిళనాడులో తెలుగు సంఘాలు భగ్గుమన్నాయి. తమిళనాడు మాత్రమే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల ఆమెపై కేసులు నమోదయ్యాయి. ఇక నాటి నుంచి పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. అయితే పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో ఆమె పరారీలో ఉన్నారు.. ఇన్ని రోజులు పాటు ఆమె ఆచూకీ లభించక పోవడంతో తమిళనాడు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తమిళనాడు వ్యాప్తంగా జల్లెడ పట్టారు. కస్తూరి కొంతకాలంగా తమిళ సీరియల్స్ లో నటిస్తోంది. తెలుగులోనూ పలు సీరియల్స్ లో కనిపిస్తోంది. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు ప్రాంతంలో వివాదానికి కారణమయ్యాయి. దీంతో ఆమెను అరెస్ట్ చేయడానికి గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందం కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ వచ్చింది. హైదరాబాదులో పలు ప్రాంతాలలో గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత గచ్చిబౌలి ప్రాంతంలో అపార్ట్మెంట్లో ఉండగా తమిళ పోలీసులు అరెస్టు చేశారు.. తెలంగాణ పోలీసుల సహకారంతో ఆమెను హైదరాబాద్ నుంచి చెన్నై తీసుకెళ్లారు.

ఉద్దేశం వేరే.. వ్యాఖ్యలే తప్పు

ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా స్టాలిన్ కొనసాగుతున్నారు. అంతకుముందు కరుణానిధి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. కరుణానిధి పూర్వికులు నెల్లూరు నుంచి తమిళనాడుకు వలస వచ్చారు. నాదస్వరం వాయించే నేపథ్యం కరుణానిధి కుటుంబం సొంతం. అయితే ఇటీవల స్టాలిన్ కుమారుడు ఉదయనిధి సనాతన ధర్మం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాటి నుంచి ఏదో ఒక సందర్భంలో కస్తూరి విమర్శలు చేస్తూనే ఉంది. తాజాగా ఓ వేదికపై కరుణానిధి కుటుంబాన్ని విమర్శించే క్రమంలో అదుపు తప్పింది. ఆమె చేసిన వ్యాఖ్యలు మొత్తం తెలుగుజాతికి వర్తించే విధంగా ఉండటంతో ఒక్కసారిగా వివాదం చెలరేగింది. ఇది క్రమంగా తెలుగు జాతికి ఆపాదించినట్టుగా ఉండడంతో.. కస్తూరి పై విమర్శలు చెలరేగాయి. తెలుగు సంఘాలు భగ్గుమనడంతో కస్తూరిని తమిళ పోలీసులు అరెస్టు చేయక తప్పలేదు. అయితే అంతకుముందే ఆమెను అరెస్ట్ చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ.. ఆమె వ్యూహాత్మకంగా చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయారు. హైదరాబాదులోని గచ్చిబౌలి ప్రాంతంలో కొద్దిరోజులుగా ఉంటున్నారు. మొత్తానికి శనివారం రాత్రి ఆమెను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఆమెను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు. కాగా, ఇటీవల కస్తూరి ముందస్తు బెయిల్ కోసం కోర్టును సంప్రదించగా.. కోర్టు ఆ పిటిషన్ ను కొట్టేసింది.