Hardik Pandya Injury : కపిల్ దేవ్ లాగా సీమ్ బౌలింగ్ వేస్తుంటాడు.. బ్యాటింగ్ కూడా అదే విధంగా చేస్తుంటాడు. ఫీల్డింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇది హార్దిక్ పాండ్యా గురించి విశ్లేషకులు చెప్పే మాట. తనను తాను అనేక సందర్భాలలో నిరూపించుకున్నాడు. కీలకమైన దశలో.. క్లిష్టమైన సందర్భాలలో జట్టుకు ఆపద్బాంధవుడుగా నిలిచాడు. ఐపీఎల్ లో గుజరాత్ జట్టుకు ట్రోఫీని కూడా అందించాడు. ఈ స్థాయి ఖ్యాతిని సొంతం చేసుకున్న హార్దిక్ పాండ్యా ఇప్పుడు అవమానాలు ఎదుర్కొంటున్నాడు. విమర్శలు ఎదుర్కొంటున్నాడు. చివరికి జట్టులో కూడా స్థానాన్ని కోల్పోయి.. అనామక ఆటగాడిగా మిగులుతున్నాడు.
ఇంగ్లాండ్ జట్టుతో జరిగే వన్డే సిరీస్ కోసం మేనేజ్మెంట్ భారత జట్టును ఎంపిక చేసింది. ఇందులో హార్థిక్ పాండ్యాకు చోటు లభించలేదు. ఏమైందని విలేకరులు ప్రశ్నిస్తే సెలెక్టర్లు ఆశించిన స్థాయిలో సమాధానం చెప్పలేదు.. అతడికి గాయమైందా.. లేక కావాలని జటనుంచి తొలగించారా.. ఒక వన్డేలో అతడు కనీసం 10 ఓవర్లు కూడా బౌలింగ్ చేసే స్థితిలో లేడా.. అందువల్లే మేనేజ్మెంట్ పక్కన పెట్టిందా.. అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి..
హార్దిక్ పాండ్యా ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో చికిత్స పొందుతూనే ఉన్నాడు. ఐపీఎల్ తర్వాత జూన్ 2న అతడు బెంగళూరు వెళ్ళిపోయాడు. అప్పటినుంచి అతడు అక్కడే ఉంటున్నాడు. పెర్ఫార్మెన్స్ బ్లాక్ ప్రోగ్రాం లో అతడు శిక్షణ పొందుతున్నాడు. అతడి సొంత అభ్యర్థన మేరకే బీసీసీఐ శిక్షణ ఇస్తోందని తెలుస్తోంది. పెర్ఫామెన్స్ బ్లాక్ అనేది ఒక కేంద్రీకృత శిక్షణ. ఇందులో ఆటగాళ్లకు అత్యంత పకడ్బందీగా శిక్షణ ఇస్తుంటారు. ఎప్పటికప్పుడు కనిపెట్టుకొని ఉంటారు. బంతి వేసే విధానం.. బంతిని ఆపడానికి పరుగులు పెట్టే తీరు.. బంతిని కొట్టడానికి బ్యాట్ ఉపయోగించే పద్ధతి.. ఇవన్నీ అత్యంత సూక్ష్మంగా పరిశీలిస్తూ ఉంటారు.
హార్దిక్ పాండ్యాకు మొదట్లో వెన్ను నొప్పి ఉందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అతడు క్యాడ్రీ సెప్స్ కండరాల నొప్పితో బాధపడుతున్నాడని తెలియ వచ్చింది. దీంతో అతడు పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని పొందడానికి సమయం పడుతుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.. అయితే వీటిపై హార్దిక్ పాండ్యా ఇప్పటివరకు కూడా అధికారికంగా ప్రకటించలేదు.. అయితే జూన్ 9న హార్దిక్ పాండ్యా కాలులో స్వల్పకాలిక నొప్పి ఏర్పడింది. అప్పుడు అతడు దానిని స్కాన్ చేయించుకున్నాడు. పరీక్షించిన వైద్యులు అతడు పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని పొందడానికి నాలుగు నుంచి ఐదు రోజుల సమయం పడుతుంది అని అన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు మూడు వారాల పాటు చికిత్స పొందాలని సూచించారు.
మరోవైపు జూలై నెలాఖరు నాటికి పాండ్యా పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని సొంతం చేసుకుంటాడని వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో విరాట్ కోహ్లీని ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేయడం పట్ల అతని అభిమానులు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కోహ్లీని ఏ ప్రమాణాల ప్రకారమైతే జట్టులోకి తీసుకున్నారో .. అవే ప్రమాణాలను హార్థిక్ పాండ్యా విషయంలో పాటించగలుగుతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ హార్థిక్ పాండ్యా ఇప్పుడు ఒక రకమైన సంధి దశను ఎదుర్కొంటున్నాడు. దీనిని దాటి అతడు 2027 వన్డే వరల్డ్ కప్ లో చోటు సంపాదించగలడా.. సత్తా సాధించగలడా.. మునుపటి ఆల్రౌండర్ లాగా అతడు కనిపించగలడా.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.
