Sanju Samson : సాధారణంగా క్రికెట్లో ప్రయోగాలు చేయాలి. ప్రయోగాలు చేస్తేనే విజయాలు లభిస్తాయి. కాకపోతే ఆ ప్రయోగాలు విజయవంతం అవ్వాలి. ఆ ప్రయోగాలు జట్టుకు లాభం చేకూర్చాలి. అలాకాకుండా ప్రయోగాలు విఫలమవుతుంటే.. విఫలమవుతున్నా ప్రయోగాలు చేస్తుంటే.. దాన్ని ఏమనుకోవాలి.. కానీ ఇన్ని వైఫల్యాల నుంచి కూడా టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ పాఠాలు నేర్చుకోవడం లేదు. పైగా అవే పనికిమాలిన ప్రయోగాలు చేస్తూ కొంత మంది ప్లేయర్ల జీవితాలతో ఆడుకుంటున్నాడు.
టీమిండియాకు వన్డే, టెస్ట్ ఫార్మాట్లో సారధిగా గిల్ వ్యవహరిస్తున్నాడు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్లో మెప్పించాడు. వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్లో టీమిండియా విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. టెస్ట్ లలో విజయవంతమైన గిల్.. వన్డేలకు వచ్చేసరికి విఫలమయ్యాడు. ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన వన్డే సిరీస్లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఇక టి20 సిరీస్ లోనూ అతడికి గంభీర్ అవకాశం ఇచ్చాడు. ఇచ్చిన అవకాశాలను గిల్ అంతగా వాడుకోవడం లేదు. తొలి టి20 వర్షం వల్ల రద్దయింది. రెండో టి20లో గిల్ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. ఓవైపు అతడి స్నేహితుడు అభిషేక్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ చేస్తుంటే.. గిల్ మాత్రం చూస్తూ ఉండిపోయాడు.. దూకుడుగా ఇన్నింగ్స్ ఆడ లేకపోగా.. ఆస్ట్రేలియా బౌలర్ల ముందు తలవంచాడు. కేవలం సింగిల్ డిజిట్ స్కోర్ కు మాత్రమే పరిమితమయ్యాడు. దీంతో అతడి ఎంపిక పట్ల విమర్శలు వ్యక్తం అయ్యాయి.
ఈ నేపథ్యంలో మూడో మ్యాచ్ లో గిల్ ను తుది జట్టులోకి తీసుకోవడం వల్ల విమర్శలు వ్యక్తం అయ్యాయి. వాస్తవానికి గిల్ కంటే సంజు శాంసన్ ఉత్తమమైన ఆటగాడు. అతడిని రిజర్వు బెంచ్ కు పంపించి.. గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయం పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పైగా మూడో టి20 మ్యాచ్ లో అంత గొప్పగా గిల్ ఆడలేకపోయాడు. 12 బంతులు ఎదుర్కొని కేవలం 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఎల్లిస్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. రెండో టి20 లో సంజు విఫలమైన మాట వాస్తవమే. కానీ గిల్ కంటే అతని బ్యాటింగ్ బాగుంటుంది. ఈ ఏడాది టీ20లలో అతడు సెంచరీల మోత మోగించాడు. దక్షిణాఫ్రికా జట్టు మీద రికార్డు స్థాయిలో పరుగులు చేశాడు. అతడి రికార్డును కూడా పక్కనపెట్టి జట్టులో చోటు కల్పించకపోవడం పట్ల ఇంకా మీరు మీద విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గంభీర్ ఆడుతున్న కుర్చీలాట వల్ల సంజు శాంసన్ కెరియర్ నాశనం అవుతోందని అతని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రయోగాల పేరుతో ప్లేయర్ల జీవితాలతో ఆడుకోవద్దని గంభీర్ కు అభిమానులు సూచిస్తున్నారు. ” గౌతమ్ గంభీర్ ఇష్టానుసారంగా ప్రయోగాలు చేస్తున్నాడు. అతడు అలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కావడం లేదు. దీనివల్ల గొప్ప గొప్ప ప్లేయర్లకు అవకాశాలు రాకుండా పోతున్నాయి. అందులో సంజు కూడా ఒకడు. ఇలా అయితే అతడు గొప్ప ఆటగాడిగా ఎలా పేరు తెచ్చుకుంటాడని” నెటిజన్లు పేర్కొంటున్నారు.