హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. లక్షలాది మంది శోభాయాత్రలో పాల్గొంటారని, సుమారు 320 కిలోమీటర్లు మేర గణేష్ శోభాయాత్ర జరుగుతుందని, ఆయా రహదారులలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పాడకుండా చర్యలు తీసుకోవాలని ఆధికారులను ఆదేశించారు. రహదారుల మరమ్మతులు చేపట్టవలసిన ప్రాంతాలను గుర్తించి వెంటనే చేయాలని, విగ్రహాలకు అడ్డంగా ఉండే విద్యుత్ తీగలు, చెట్ల కొమ్మలు తొలగించాలని సూచించారు.
ట్యాంక్ బండ్ కు తరలి వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా లింగంపల్లి-సికింద్రాబాద్,ఫలక్ నమా, సికంద్రాబాద్, లింగంపల్లి-నాంపల్లి రూట్లో ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. నిమజ్జనం సందర్భంగా భారీగా తరలి రానున్న భక్తజనం కోసం గ్రేటర్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాటు చేపట్టింది. ఆదివారం ఉదయం నుంచి నిమజ్జన వేడుకలు పూర్తయ్యే వరకు 565 ప్రత్యేక బస్సులను నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
బహీరాబాగ్- కాచిగూడ, బషీర్ బాగ్-రాంనగర్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్- దిల్ సుఖ్ నగర్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్- ఎల్బీనగర్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్- వనస్థలిపురం, మిధాని రూట్లలో బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. పాత బస్తీ నుంచి హుస్సేన్ సాగర్ వరకు కొనసాగనున్న నిమజ్జన శోభాయాత్ర దృష్ట్యా పాతబస్తీ మీదుగా రాకపోకలు సాగించే అఫ్టల్ గంజ్ వరకు పరిమితం చేస్తారు. సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ మీదుగా వెళ్లే బస్సులు ఇందిరాపార్కు వరకు పరిమితమవుతాయి. ఉప్పల్ నుంచి మెదీపట్నం వైపు వెళ్లే బస్సులు కూడా ఇందిరాపార్కుకు పరిమితమవుతాయి.