Duvvada Srinivas : త్వరలో ఏపీలో కొత్త పార్టీ రాబోతుందా? బీసీ నినాదంతో అది ముందుకు రానుందా? ఈ వార్తల్లో నిజం ఎంత? ఇప్పటికే చాలా ప్రాంతీయ పార్టీలు ఏపీలో పుట్టుకొచ్చాయి. అందులో నిలబడింది కొన్నే. కానీ ఇప్పుడు కొత్త ప్రయత్నం జరగబోతోందన్న టాక్ మొదలైంది. అది కూడా ఉత్తరాంధ్రకు చెందిన ఓ నేత ఆధ్వర్యంలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సదరు నేత ఇటీవల ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఇంతకీ ఎవరు ఆ నేత అంటే దువ్వాడ శ్రీనివాస్. ఇటీవల శ్రీకాకుళంలో తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని ధర్మాన, కింజరాపు కుటుంబాలపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు దువ్వాడ శ్రీనివాస్. అయితే తిరిగి వైసిపిలోకి వస్తానని భావిస్తున్న ఆయనకు షాక్ ఇచ్చారు జగన్. దీంతో దువ్వాడ శ్రీనివాస్ తన సామాజిక వర్గాన్ని ముందుకు పెట్టి కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారని ప్రచారం మొదలైంది. అందుకు తగ్గట్టుగానే ఆయన సంకేతాలు పంపిస్తున్నారు.
* కుల రాజకీయాలు అధికం..
శ్రీకాకుళం జిల్లాలో కుల రాజకీయాలు అధికం. జిల్లాలో ప్రధాన కులాలుగా కాళింగ, తూర్పు కాపు, వెలమ, యాదవ, మత్స్యకార సామాజిక వర్గాలు ఉన్నాయి. అయితే దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ హయాంలో కాలింగులకు అధిక ప్రాధాన్యం ఉండేది. పార్లమెంటరీ వ్యవస్థ ప్రారంభం నాటి నుంచి 1983 టిడిపి ఆవిర్భావం వరకు శ్రీకాకుళం జిల్లా ఎంపీ గా కాళింగ సామాజిక వర్గానికి చెందిన బొడ్డేపల్లి రాజగోపాల్ రావు ఉండేవారు. ఆపై తూర్పు కాపు సామాజిక వర్గం జిల్లా పరిషత్ చైర్మన్ తో పాటు కొన్ని నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించేది. వెలమ సామాజిక వర్గం కొన్ని నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించేది. అయితే 1996లో కింజరాపు ఎర్రం నాయుడు ఎంపీగా పోటీ చేసిన నాటి నుంచి వెలమ సామాజిక వర్గానికి శ్రీకాకుళం పార్లమెంటు స్థానం చిక్కిపోయింది. ఒకే ఒక్కసారి కాళింగ సామాజిక వర్గానికి చెందిన కిల్లి కృపారాణి ఎంపీ కాగలిగారు. ఇప్పుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ విజయం సాధించారు.
* రెండు పార్టీల్లో వెలమలకు ప్రాధాన్యం..
1989లో తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టి మంత్రి అయ్యారు ధర్మాన ప్రసాదరావు. అలా ప్రభుత్వాలు వచ్చిన ప్రతిసారి ఆయనే మంత్రి అవుతూ వచ్చారు. ఆయన తమ్ముడు ధర్మాన కృష్ణ దాస్ సైతం మంత్రి అయ్యారు. కాలింగ సామాజిక వర్గానికి ఎంపీ పదవి లేదు. మంత్రి పదవి చిక్కలేదు. తెలుగుదేశం పార్టీలో కింజరాపు కుటుంబ హవా ఉంటుంది జిల్లాలో. ఎర్రం నాయుడు తర్వాత తమ్ముడు అచ్చెనాయుడు టిడిపి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మంత్రి అవుతున్నారు. మొన్న అయితే బాబాయ్ కి రాష్ట్ర మంత్రి పదవి.. అబ్బాయికి కేంద్ర మంత్రి పదవి దక్కింది. కాళింగ సామాజిక వర్గానికి ఏ పదవి చిక్కలేదు.
* సామాజిక వర్గాన్ని ముందు పెట్టుకుని..
అయితే శ్రీకాకుళం జిల్లాలో మూడు ప్రధాన సామాజిక వర్గాలు సమానంగా ఉన్నాయి. కానీ వెలమ సామాజిక వర్గానికి పదవులు దక్కుతున్నాయి అని కాళింగ సామాజిక వర్గంలో ఒక రకమైన అసంతృప్తి ఉంది. వైసీపీలో ఉండి దానిని రైజ్ చేశారు దువ్వాడ శ్రీనివాస్. కానీ వర్కౌట్ కాలేదు. దువ్వాడ శ్రీనివాస్ వ్యతిరేకిస్తున్న ధర్మాన ప్రసాదరావుకు ఇప్పుడు కీలక బాధ్యతలు కట్టబెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు కింజరాపు ఫ్యామిలీ ప్రాధాన్యత కూడా పెరుగుతుంది. దీంతో తన సొంత సామాజిక వర్గంతో పాటు బీసీల కోసం దువ్వాడ శ్రీనివాస్ త్వరలో ఒక పార్టీ పెట్టబోతున్నట్లు ప్రచారం నడుస్తోంది. కేవలం శ్రీకాకుళం జిల్లాలోని ఆ రెండు ఫ్యామిలీల హవా కు బ్రేక్ వేసేందుకు.. తన సొంత సామాజిక వర్గం అభ్యర్థులను రంగంలోకి దించేందుకు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. చూడాలి దువ్వాడ శ్రీనివాస్ ప్రయత్నం ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో..