Jagan’s Districts Tour: పోయిన చోటే వెతుక్కోవాలనుకుంటున్నారు వైయస్ జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ). మొన్నటి ఎన్నికల్లో ఎక్కడెక్కడ భారీ డ్యామేజ్ జరిగిందో గుర్తిస్తున్నారు. పైగా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బలమైన నేతలు మారిన చోట ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేయడం, అరెస్టులు చేస్తున్న నేతల నియోజకవర్గాల విషయంలో కూడా సరికొత్త ఆలోచనతో ముందుకెళ్తున్నారు. సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటన మొదలుపెట్టనున్నారు. అయితే వైసీపీ నుంచి వెళ్లిపోయిన నేతలు, అరెస్టులకు గురైన నాయకుల నియోజకవర్గాల్లో విస్తృత పర్యటన చేయాలన్నది జగన్మోహన్ రెడ్డి ఆలోచనగా తెలుస్తోంది. తద్వారా అక్కడ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నది ఆయన వ్యూహంగా పెట్టుకున్నట్లు సమాచారం.
సామినేని ఉదయభాను నియోజకవర్గం లో..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత సామినేని ఉదయభాను( Udaya Bhanu) పార్టీకి గుడ్ బై చెప్పారు తొలిసారిగా. ఆయన జగ్గయ్యపేటకు వైసీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించేవారు. అందుకే అక్కడ నుంచి జిల్లాల పర్యటనకు జగన్ శ్రీకారం చుడతారని తెలుస్తోంది. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నందిగామ సురేష్, వల్లభనేని వంశీ మోహన్, కాకాని గోవర్ధన్ రెడ్డి, పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జోగి రమేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి నేతలంతా అరెస్టయ్యారు. ఇటువంటి వారి సొంత నియోజకవర్గాల్లో పర్యటించాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ నియోజకవర్గాలకు వెళ్తే ప్రజల నుంచి సానుభూతి లభించడమే కాదు.. టిడిపి కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచవచ్చు అన్నది జగన్ ఆలోచనగా తెలుస్తోంది.
సంక్రాంతి తర్వాత..
సంక్రాంతి( Pongal) తర్వాత 25 పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో పర్యటనలు మొదలు పెడతారు జగన్మోహన్ రెడ్డి. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో నాలుగు రోజులపాటు పర్యటన ఉండనుంది. అయితే ఆ నియోజకవర్గంలో అరెస్ట్ అయిన నేత అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఈ పర్యటనలు కొనసాగేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలుతా శ్రీకాకుళం పార్లమెంటరీ స్థానం నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రచారం మొదలు పెడతారని అంతా భావించారు. కానీ ఇప్పుడు జగ్గయ్యపేట నుంచి మొదలు పెడతారని తెలుస్తోంది. అయితే ఈ జిల్లాల పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారు చేసే పనిలో ఉన్నారు వైయస్సార్ కాంగ్రెస్ నేతలు. ప్రతి పార్లమెంటరీ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటాయి. ఈ లెక్కన ఆ నియోజకవర్గాలను లెక్క కట్టి.. ఎక్కడెక్కడ పర్యటనలు చేయాలి? అక్కడ ఏయే విషయాలను ప్రస్తావించాలి? అనే వాటిపై ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ షెడ్యూల్ తయారీ పూర్తయిన వెంటనే ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.