Devineni Uma: బాబుకు షాక్.. కాంగ్రెస్ లోకి దేవినేని ఉమా

ప్రస్తుతం ఏపీలో షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అయింది. తాజా రాజకీయ పరిణామాలతో ఇతర పార్టీల నేతలను కాంగ్రెస్ లోకి రప్పించాలని షర్మిల భావిస్తున్నారు.ఇప్పటివరకు కాంగ్రెస్ లో చేరిన వారిలో వైసీపీ నేతలే అధికం.

Written By: Dharma, Updated On : March 27, 2024 6:54 pm

Devineni Uma

Follow us on

Devineni Uma: తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుకు అత్యంత సన్నిహిత నేతల్లో దేవినేని ఉమా ఒకరు. కృష్ణాజిల్లాలో చంద్రబాబు ఎక్కువగా ప్రాధాన్యమిచ్చిన నేత కూడా ఆయనే. కానీ ఈ ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. అసలు దక్కే సూచనలు కూడా కనిపించడం లేదు. ఆయన ఇంచార్జిగా ఉన్న మైలవరం సీటును.. వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ కు చంద్రబాబు ఖరారు చేశారు. దీంతో ఉమాకు సీటు లేకుండా పోయింది. కనీసం ప్రత్యామ్నాయం కూడా చంద్రబాబు చూపలేదు. దీంతో దేవినేని ఉమా తీవ్ర నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ కీలక నేతలు ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఏపీలో షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అయింది. తాజా రాజకీయ పరిణామాలతో ఇతర పార్టీల నేతలను కాంగ్రెస్ లోకి రప్పించాలని షర్మిల భావిస్తున్నారు.ఇప్పటివరకు కాంగ్రెస్ లో చేరిన వారిలో వైసీపీ నేతలే అధికం. వైసీపీలో టిక్కెట్లు దక్కని ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. కానీ విపక్షాలైన టిడిపి, జనసేనల నుంచి ఎవరు చేరడం లేదు. అయితే ఇటీవల పొత్తులో భాగంగా ఆ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి.దీంతో చాలామంది సీనియర్లకు టికెట్లు దక్కలేదు. వారంతా అసంతృప్తితో ఉన్నారు. వారిని కాంగ్రెస్ వైపు తీసుకొచ్చేలా షర్మిల పావులు కదుపుతున్నారు. విపక్షాల్లో అసంతృప్త నాయకులను కాంగ్రెస్ లో చేర్చుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా దేవినేని ఉమా తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

2014లో మైలవరం నుంచి పోటీ చేసిన దేవినేని ఉమా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చంద్రబాబు ఆయన్ను క్యాబినెట్లో తీసుకున్నారు. కీలక పోర్టు పోలియో అప్పగించారు. 2019 వరకు ఆయన హవా నడిచింది. గత ఐదేళ్లుగా వైసీపీ సర్కార్ పై గట్టిగానే వాయిస్ వినిపిస్తూ వచ్చారు. కానీ చంద్రబాబు మాత్రం ఆయనకు టికెట్ ఇవ్వలేదు. గత ఐదేళ్లుగా ఎవరితో ఉమా ఫైట్ చేశారో.. అదే వసంత కృష్ణ ప్రసాద్ కు పిలిచి మరి చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారు. దీనిని దేవినేని ఉమా జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగని వేరే పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేయడం లేదు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ దేవినేని ఉమా కోసం ప్రయత్నించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే టిడిపి పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న దేవినేని ఉమా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.