ఎవరు ఎలా అనుకున్నా సరే.. టెక్నాలజీ అనేది మనిషిని పూర్తిగా శాసిస్తోంది. టెక్నాలజీ లేకుండా బతికే పరిస్థితి లేదు. ఉదయం లేచిన దగ్గర్నుంచి మొదలు పెడితే రాత్రి పడుకునే వరకు ప్రతి విషయంలోనూ టెక్నాలజీ మనిషితో అడుగులు వేస్తోంది. మనిషితో పరుగులు పెడుతోంది. మనిషి ఆలోచనలో భాగమవుతుంది. మనిషి జీవక్రియలో పాలుపంచుకుంటున్నది. ఒక రకంగా చెప్పాలంటే మనిషి మనుగడ మొత్తాన్ని టెక్నాలజీ శాసిస్తోంది.
అంతగా బానిసలుగా మారిపోయాం మనం. టెక్నాలజీ అనేది శక్తి నిత్యత్వ నియమం లాంటిది. అంటే టెక్నాలజీ దశలు మార్చుకుంటూ ఉంటుంది. దీనివల్ల కొత్త కొత్త వ్యవస్థలు అందుబాటులోకి వస్తాయి. ఇదే సమయంలో పాత వ్యవస్థలు కాలగర్భంలో కలిసిపోతాయి. కొత్త వ్యవస్థ మనకు ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. దానితో సాగిస్తున్న ప్రయాణం మనకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఆ తర్వాత మరొక వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఈ లోగానే పాత వ్యవస్థ మరుగున పడిపోతుంది. మరుగున పడిన వ్యవస్థను మర్చిపోతాం. కొత్త వ్యవస్థకు అలవాటు పడిపోతాం. కొత్త మనకు వింతగా ఉంటుంది కాబట్టి దానితో స్వేచ్ఛగా ప్రయాణం సాగించగలుగుతాం.
గతంలో డబ్బా ఫోన్ ఉండేది. ఇప్పుడు అత్యంత ఆధునిక ఫోన్ అందుబాటులోకి వచ్చింది. దానిలో రకరకాల సౌకర్యాలు.. అనితర సాధ్యమైన సదుపాయాలు.. టెక్నాలజీని సరికొత్తగా పరిచయం చేస్తున్న వ్యవస్థలు.. ఇందులో భాగంగానే తెరపైకి వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది మనల్ని పూర్తిగా అధిగమించి దూసుకుపోతోంది. వచ్చే ఒకటి లేదా రెండు సంవత్సరాల కాలంలో ఇది పూర్తిగా మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. 2030 నాటికి ప్రారంభ స్థాయి వైట్ కాలర్ ఉద్యోగాలలో 50% వరకు కాలగర్భంలో కలిసిపోతాయి. ఉదాహరణకు ఆంత్రోపిక్ సంస్థను తీసుకుంటే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఈ సంస్థ సరికొత్త ప్రయోగాలు చేస్తోంది. ఈ సంస్థలో పనిచేస్తున్న ప్రధానమైన క్లాడ్ కోడ్ ఇంజనీర్ గడచిన 2 నెలలుగా ఒక్క లైన్ కోడ్ కూడా రాయలేదు. అంటే ఆ విభాగాన్ని మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో భర్తీ చేశారు. ఆ విభాగంలో పనిచేసేవారు లేరు. ఆ విభాగంలో పనిచేయాల్సిన అవసరం కూడా లేదు.
ఇది కేవలం ఉదాహరణ మాత్రమే.. ఇలా చెప్పుకుంటూ పోతే కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి. ఆ విన్యాసాల వల్ల మ్యాన్ పవర్ అవసరం లేకుండా పోతోంది. టెక్నాలజీ విస్ఫోటనం వల్ల ఉద్యోగాలు మాయమైపోతున్నాయి. ఒకరకంగా విఠలాచార్య సినిమాలో మాదిరిగా మనుషుల అవసరం లేకుండానే మనుషుల అవసరాలు తీరిపోతున్నాయి. భవిష్యత్తు కాలంలో ఇంకా రకరకాల మార్పులు చోటుచేసుకుంటాయి. ఇంకా కొత్త కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వస్తాయి. అవన్నీ కూడా మనిషి జీవితాన్ని మరో దిశ వైపు తీసుకెళ్తాయి. కాకపోతే కొత్త ఎప్పటికీ వింతగానే ఉంటుంది కాబట్టి దానితోనే మనుషులు ప్రయాణం సాగిస్తారు. ఎందుకంటే ప్రత్యామ్నాయం లేదు.
