EPF Withdra: ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) ఖాతాలో జమ అవుతున్న మొత్తం పదవీ విరమణ కోసం ఉద్దేశించినదే. అయితే అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో చందాదారులు పాక్షికంగా లేదా పూర్తిగా విత్‌డ్రా చేసుకునే అవకాశం సంస్థ కల్పిస్తోంది. వైద్యం, విద్య, వివాహం, ఇంటి నిర్మాణం ఇలా పలు సందర్భాల్లో ఈ ఫండ్ నుంచి కొంత మొత్తంలో నగదును ఉపసంహరించుకోవచ్చు. అయితే దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి. తాజాగా ఇందులో ఈపీఎఫ్‌వో కీలక మార్పులు చేసింది. వైద్య ఖర్చు కోసం చేసుకునే ఆలో క్లెయిమ్ పరిమితిని రెట్టింపు చేసింది.
రూ.లక్ష వరకు విత్‌డ్రా..
ఈపీఎఫ్ చందాదారుడుగానీ, అతని కుటుంబం సభ్యుల్లో ఎవరికైనాగానీ వైద్య ఖర్చుల నిమిత్తం నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. అయితే అది ఇప్పటి వరకు రూ.50 వేలు ఉండగా, దానిని రూ.లక్షకు పెంచుతూ ఈపీఎఫ్‌వో సర్క్యులర్ జారీ చేసింది. నెల లేదా అంతకన్నా ఎక్కువ రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నా.. శస్త్ర చికిత్సలు చేయించుకున్నా ఈ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. టీబీ, క్షయ, పక్షవాతం, క్యాన్సర్, గుండె సంబంధ చికిత్సల కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనూ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది.
సెల్ఫ్ డిక్లరేషన్‌తోనే..
ఇక వైద్య ఖర్చు కోసం విత్‌డ్రా చేసుకునే నగదుకు ఎలాంటి సర్టిఫికెట్లు అవసరం లేదు. కేవలం సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా ఆన్‌లైన్‌లో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఉద్యోగి ఆరు నెలల బేసిక్ ప్లస్ డీఏ లేదా జమ అయిన మొత్తంలో ఉద్యోగి వాటా(వడ్డీ సహా) ఈ రెండింటిలో ఏది తక్కువైతే అంతవరకు మాత్రమే విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది.