IT employees good news: గడచిన కొద్ది సంవత్సరాలుగా విపరీతంగా తొలగింపులు జరిగిపోతున్నాయి. ఉద్యోగులకు తెలియకుండానే పింకు స్లిప్పులు జారీ అవుతున్నాయి. ఏం చేయాలో తెలియడం లేదు. ఎలా ఉండాలో అర్థం కావడం లేదు. ఇలాంటి నైపుణ్యాలు పెంపొందించుకుంటే ఉద్యోగం ఉంటుందో అవగతం కావడం లేదు. ఇలాంటి స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు ఐటి ఇండస్ట్రీలో పని చేసే ఉద్యోగులు. అయితే వారికి ఇకపై మంచి రోజులు రాబోతున్నాయి.
మెటా నుంచి మొదలుపెడితే ఒరాకిల్ వరకు ఇష్టానుసారంగా ఉద్యోగుల తొలగింపులు జరిగిపోతున్నాయి. కాస్ట్ కటింగ్ అని మేనేజ్మెంట్లు చెబుతున్నప్పటికీ.. అసలు విషయం వేరే ఉంది. ఏఐ రాక వల్ల ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడానికి అన్ని కంపెనీలు తొలగింపులు చేపడుతున్నాయి. అర్ధాంతరంగా తొలగించడం వల్ల ఉద్యోగులు రోడ్డు మీద పడుతున్నారు. కొత్త ఉద్యోగాలు లభించక.. ఉన్న కంపెనీలు పట్టించుకోక వారు పడుతున్న ఇబ్బందులు మామూలుగా లేవు.
ఐటీ ఇండస్ట్రీలో తీవ్రమైన మందగమనం కొనసాగుతున్న నేపథ్యంలో దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టిఫిషల్ ఇంటెలిజెంట్ కారణంగా ఐటి రంగంలో మార్పులు వస్తున్నప్పటికీ.. తమ కంపెనీలలో ఉద్యోగుల విషయంలో ఎటువంటి తొలగింపులు ఉండవని ఇన్ఫోసిస్ సీఈవో సలీం ఫరెక్ పేర్కొన్నారు. గత ఏడాది తాము ఎటువంటి తొలగింపులు చేపట్టలేదని.. భవిష్యత్తు కాలంలో కూడా తొలగింపులు చేపట్టే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ వల్ల పని పరిధి పెరుగుతుందని.. ఎటువంటి పని తగ్గడానికి అవకాశం ఉండదని ఆయన స్పష్టం చేశారు. అందువల్ల ఈ ఏడాది 20,000 మంది కొత్త ఉద్యోగులను తీసుకుంటామని ఆయన ప్రకటించారు. తొలగింపులకు బదులుగా ఉద్యోగులకు ఏఐ టూల్స్ మీద ట్రైనింగ్ ఇస్తామని ఆయన ప్రకటించారు.
వాస్తవానికి చాలా కంపెనీలు ఏఐ టూల్స్ మీద ఉద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వడం లేదు. అంతేకాదు ఉద్యోగులను పక్కన పెట్టడానికి మాత్రమే ఆలోచిస్తున్నాయి. దీనివల్ల చాలామంది ఉద్యోగులు ఉపాధి కోల్పోతున్నారు.. కొత్త ఉద్యోగాలు లభించే పరిస్థితి లేకపోవడంతో నరకం చూస్తున్నారు.. అయితే ఐటీలో తీవ్రమైన ఒడిదుడుకులు కనిపిస్తున్న క్రమంలో.. ఇన్ఫోసిస్ చేసిన ప్రకటన ఉన్న ఉద్యోగులు, కొత్త ఉద్యోగార్దులలో ఆనందం కలిగిస్తోంది. ఇన్ఫోసిస్ మాదిరిగానే మిగతా కంపెనీలు ఆలోచిస్తే ఉపయుక్తంగా ఉంటుందని ఐటీ ఉద్యోగులు చెబుతున్నారు.