Site icon OkTelugu

Peddapalli student story: ఆ ఒక్కడి కోసం టీచర్లంతా ఏకమయ్యారు.. పట్టుబట్టి టెన్త్ పాస్ చేయించారు.. ఇంట్రెస్టింగ్ స్టోరీ

Peddapalli student story

Peddapalli student story

Peddapalli student story: గొప్పగా సౌకర్యాలు కల్పించినప్పటికీ.. ఉచితంగానే అన్ని ఇస్తున్నప్పటికీ చాలామంది ప్రభుత్వ పాఠశాలలో చదవడానికి ఆసక్తిని చూపించడం లేదు.. వేలకు వేలు పెట్టి ప్రైవేట్ పాఠశాలల్లో చదవడానికి మాత్రమే ఇష్టపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో సక్రమంగా బోధించరని.. ఉపాధ్యాయులలో జవాబుదారితనం ఉండదని.. దీనివల్ల తమ పిల్లల భవిష్యత్తు ఆగమవుతుందని చాలామంది తల్లిదండ్రులు ఆలోచిస్తారు. అందువల్లే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు కాకుండా.. ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తుంటారు.

కొంతకాలంగా ప్రభుత్వం పాఠశాలల మీద ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఫలితాలు, డ్రాప్ అవుట్ల మీద ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నది. ఫలితాలు సరిగ్గా రాకపోతే ఉపాధ్యాయులకు నోటీసులు పంపిస్తున్నది. వారి నుంచి వివరణ కూడా కోరుతున్నది. డ్రాప్ అవుట్లు అధికంగా ఉంటే ఆ పాఠశాలలను తొలగించి.. అక్కడ విద్యార్థులను సమీప పాఠశాలల్లో చేర్పిస్తున్నది. ఇది ఒక రకంగా ఉపాధ్యాయులకు ఇబ్బందికరమైన పరిణామం.. విధులు నిర్వహిస్తున్న పాఠశాల మూసివేతకు గురైతే.. ఉపాధ్యాయులకు దూరం వెళ్లాల్సి ఉంటుంది. అది ఒక రకంగా వారికి ప్రయాస. అందువల్లే డ్రాప్ అవుట్లను తగ్గించడానికి.. ఫలితాలను పెంచడానికి ఉపాధ్యాయులు కష్టపడుతున్నారు. కాకపోతే ఈ స్టోరీలో ఉపాధ్యాయులు చూపించిన ప్రయత్నం పూర్తి విభిన్నం.. పైగా గురువారం 10 ఫలితాలు విడుదలైన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

అది ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి పరిధిలోని ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామం. ఇక్కడ ప్రభుత్వ పాఠశాల ఉంది. టెన్త్ వరకు ఉన్నప్పటికీ.. విద్యార్థులు అంతగా చేరలేదు. ఒకే ఒక విద్యార్థి ఇక్కడ టెన్త్ చదువుతున్నాడు. అతడు కూడా సక్రమంగా పాఠశాలకు రావడం లేదు. ఆ విద్యార్థి పేరు గుంటి మధు. అతడు ఎంతకీ పాఠశాలకు రాకపోవడంతో ఉపాధ్యాయుల్లో భయం పట్టుకుంది. ఒకవేళ అతడు గనక ఫెయిల్ అయితే పరిస్థితి తారు మారవుతుంది.. అందువల్లే ఉపాధ్యాయులే నడుం బిగించారు. విద్యార్థికి బదులుగా వారే పాఠశాల నుంచి అతని ఇంటికి వెళ్లారు. ప్రతిరోజు పాటలు చెప్పడం మొదలుపెట్టారు.. పట్టువదలని విక్రమార్కుల మాదిరిగా అతడిని పాస్ చేయించారు.. మధు 429 మార్కులతో పదో తరగతి పాస్ అయ్యాడు. అతడు పాస్ కావడంతో జీరో పర్సెంట్ రాలేదని ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు.

10 ఫలితాలను ఈసారి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రముఖంగా తీసుకుంది.. ఫలితాల సాధనలో విఫలమైన ప్రభుత్వ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అందువల్లే మల్లాపూర్ పాఠశాలలో ఉపాధ్యాయులు నేరుగా విద్యార్థికి ఇంటికి వెళ్లారు. అతనికి పాఠాలు చెప్పి పాస్ చేయించారు.. అతడు పదవ తరగతి పాస్ కావడంతో ఉపాధ్యాయులకు ఉపశమనం లభించింది. లేకుంటే పరిస్థితి మరో విధంగా ఉండేది.

Exit mobile version