‘సమైక్యాంధ్ర,ప్రత్యేక హోదా’ల ఉద్యమాలు లాగా పోలవరం కూడా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఎంతగానో వుంది. పోలవరం మొదలై దాదాపు 16 సంవత్సరాలు అయింది. కనీసం ఇంకో 4 సంవత్సరాల్లో పూర్తి అవుతుందా? అవ్వాలి. అందుకు అవసరమయితే పట్టుదలకు పోకుండా, లౌక్యంతో పనులు చక్కబెట్టుకోవాల్సిన అవసరం ఎంతయినా వుంది. గత దశాబ్దం రెండు ఉద్యమాలతో ఆంధ్ర ప్రజలు అలిసి సొమ్మసిల్లి పోయారు. రాజకీయనాయకులు సమస్యలు పరిష్కారం కన్నా చౌకబారు, రాజకీయ పాపులారిటీకే ప్రాధాన్య మివ్వటం చూసాం. కనీసం ఈ ప్రభుత్వం ఆ ట్రాప్ లో పడకుండా కాలపరిమితిలోపల ప్రాజెక్టు పూర్తిచేయటంపై దృష్టిపెడుతుందని ఆశిద్దాం.
పోలవరం ఆంధ్రుల జీవనాడి
పోలవరంని 2004లో మొదలుపెట్టినా నిజమైన పనిని వైఎస్ ఆర్ టైం లో కుడి,ఎడమ కాల్వల తవ్వకంతోనే మొదలయ్యిందని చెప్పొచ్చు. చివరకు రాష్ట్ర విభజనలో ఏదైనా ప్రయోజనం జరిగిందంటే అది పోలవరంపై చట్టపరమైన హామీని సాధించటం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పోలవరం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించటంతో ఆంధ్ర ప్రజలకి హైదరాబాద్ దక్కకపోయినా,1956కి పూర్వమున్న భద్రాచలం దక్కకపోయినా పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించటం కొంతలో కొంత ఊరట కలిగించింది. దీనితోపాటు రాజధానికి నిధుల హామీ ఇచ్చినా,దీనితో పోలిస్తే స్పష్టమైన ప్రయోజనం అందులో తక్కువే. రాజధానికి ఇచ్చే నిధులు ఎన్ని అనేది ఎక్కడా స్పష్టత లేకపోవటంతో అదో ఎండమావిలాగా అయింది. ఇప్పుడసలు రాజధాని ఎక్కడనేదానిపైనే కొట్టుకు చస్తూ ఉండటంతో ఆ అంశాన్ని పక్కకు పెట్టి ప్రస్తుత పోలవరం అంశాన్ని చర్చించుకుందాం.
ఒకసారి జాతీయ ప్రాజెక్టుగా చట్టంలో పొందుపరచిన తర్వాత అది పూర్తి చేసే బాధ్యత పూర్తిగా కేంద్రానిదే. అందుకోసం కేంద్రం పోలవరం ప్రాజెక్టు అధారిటీని కూడా ఏర్పరిచింది. ముంపు ప్రాంతాలు తెలంగాణాలో వుంటే పేచీ వస్తుందనే వాటిని ఆంధ్రలో చేర్చటంతో ఆ అవరోధం కూడా తొలగిపోయింది. అన్నీ శుభారంభమే అనుకున్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పిపిఎ) వరుసగా సమావేశాలు నిర్వహించటం కూడా అందరిలో ఆశలు చిగురించాయి. కాకపోతే ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇప్పుడు ఆలోచిస్తే సమస్యలు వుత్పన్నమవటానికి కారణమయ్యాయని అర్ధమవుతుంది. ప్రాజెక్టు కట్టాల్సింది పిపిఎ కానీ కట్టటానికి ముందుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. దానికి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన కారణం మాములుగా అయితే కేంద్ర ప్రాజెక్టులు అనుకున్న సమయానికి పూర్తి కావు కాబట్టి మేమే ఆ కట్టే బాధ్యత తీసుకున్నామని చెప్పింది. 2016 సెప్టెంబర్ లో స్పెషల్ ప్యాకేజిలో భాగంగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పారు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఒప్పందంతోనే జరిగింది. దీనికి పర్యవసానంగా 2017 మార్చ్ లో కేంద్ర క్యాబినెట్ ఈ ప్రాజెక్టు అంచనాని ఆమోదించింది. దానిప్రకారం మొత్తం ఖర్చు 29వేల కోట్లుగా పేర్కొంది. అందులో కేంద్రం ఇవ్వాల్సింది 20 వేల కోట్ల రూపాయలు మాత్రమే. ఎందుకంటే విద్యుత్తు ప్రాజెక్టు ఖర్చు రాష్ట్ర ప్రభుత్వానిదే. ఈ అంచనాలు 2013-14 అంచనాల ప్రకారం రూపొందించారు. అదే భూసేకరణ,పునరావాసం ఖర్చు అంతకన్నా ముందు సంవత్సరాలదిగా ప్రకటించారు. అలాగే 2014కి ముందు ఖర్చయిన 4730 కోట్ల రూపాయలు ఇవ్వమని కూడా చెప్పారు. ఇదేదో రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులాగా ఇంతకన్నా ఒక్క పైసా ఎక్కువ ఇవ్వమని కూడా చెప్పారు. 2018 లోపల పూర్తి కాకపోతే ఈ వ్యయాన్ని గ్రాంటుగా కాకుండా రుణంగా కూడా పరిగణిస్తామని చెప్పారు. అసలు ఇన్ని షరతులతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని ఎందుకు చేపట్టాలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ నాయకులు వివరించాలి. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ఒకే ఒక కారణం త్వరగా పూర్తి చేయాలనేది. ఎందుకనో అది అంత నమ్మశక్యంగా లేదు. షరతులు లేని ఒప్పందం అయితే వాళ్ళు చెప్పిన కారణాలు సహేతుకమని అనుకోవచ్చు. కాని ఇది అలా కాదుకదా.
ఇకపోతే అన్నింటికన్నా అర్ధంకానిది భూసేకరణ, పునరావాసం గురించి. దీనిపై ఇటీవల ఎన్నో కోర్టులు కూడా స్పష్టత ఇచ్చాయి. అసలు భూసేకరణ, పునరావాసం పూర్తికాకుండా ప్రాజెక్టు ఎలా కడతారు. నిజంగా ప్రాజెక్టు పూర్తయితే వీళ్ళందరూ ఎక్కడి కెళతారు? ఇది పాతకాలంలో జరిగేది. ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చింది. ముందు భూసేకరణ, పునరావాసం ఆ తర్వాతే ప్రాజెక్టు. మరి అటువంటప్పుడు గత ఆరు సంవత్సరాల్లో దీనిపై పురోగతి ఎందుకు లేదు? 2013 భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత భూసేకరణ నష్ట పరిహారం కొన్ని రెట్లు పెరిగిందని అందరికి తెలిసిన విషయమే. అలాగే పునరావాసానికి కూడా ఖర్చులు పెరిగాయని తెలుసు. అయినా అపరిష్కారంగా ఇన్నాళ్ళు నాన్చటం ఏవిధంగానూ సమర్ధనీయం కాదు. ఇంతకుముందు సమైక్యాంధ్ర విషయంలో, ప్రత్యేక హోదా అంశంలో కేంద్రంతో తలెత్తిన సమస్యలు తెలిసీ అత్యంత ముఖ్యమైన ఈ సమస్యపై మిన్నకుండటం క్షంతవ్యం కాదు. రాష్ట్ర ప్రభుత్వం మేము 2018లో కేంద్రానికి లేఖ రాసామని చెప్పటం చూస్తుంటే సమస్యపై ఎందుకింత దాచివేతో అర్ధంకావటంలేదు. అప్పటి జలవనరుల శాఖామంత్రి మాట్లాడుతూ పిపిఎ సాంకేతిక కమిటీ కొత్త ప్రతిపాదనలు ఆమోదముద్ర వేసిందని చెబుతున్నారు. మంచిదే, అంటే ఏమిటి ఈ ప్రక్రియ ఇంకా నడూస్తూనే వుందనేగా. ఆర్ధికమంత్రి సిఫారుసుతో తిరిగి కాబినెట్ ఆమోద్రవేసినప్పుడే ఇది ఒక కొలిక్కి వచ్చినట్లు కదా. అప్పటిదాకా ఈ సవరించిన అంచనాలు ప్రతిపాదిత దశలో ఉన్నట్లే కదా.
సరే తెలుగుదేశం ఘనకార్యం ఇలావుందనుకుంటే వైఎస్ ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు అయ్యింది. ఇప్పటివరకు ఏం చేసారు? ఇప్పుడే ఈ విషయం కొత్తగా ఎందుకు బయటకు వచ్చింది. ఆంధ్ర ప్రజలకి పోలవరం జీవన్మరణ సమస్య అయినప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఎందుకు కేంద్రంతో చర్చించలేదు. ఒకటిన్నర సంవత్సరం తర్వాత కేంద్ర ఇలా అంటుంది, అప్పటి ప్రభుత్వం ఇలా షరతులు ఒప్పుకుంది అని రాజకీయం చేసేబదులు రాగానే మాట్లాడాల్సి ఉందికదా. ఎవరికివారు అవతలి వాళ్ళమీద పైచేయి సాధించాలనే తపన తప్పిస్తే ఎలా పరిష్కరించాలి అనేదానిపై దృష్టి పెడితే బాగుంటుంది.
కిం కర్తవ్యం ?
2017లో కేంద్ర కాబినెట్ ఆమోదించిన దానికి,ఇప్పటి సవరించిన అంచనాలకి దాదాపు 27వేలకోట్ల రూపాయలు తేడా వుంది. ఇదేమి తిరిగి కాబినెట్లో ఆమోదింప చేసుకోవటం ఆషామాషి కాదు. అదీ షరతులతో ఒకసారి ఆమోదించిన తర్వాత. ఇది కేంద్ర ప్రభుత్వం, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం స్థూల అంగీకారంతో జరిగిన ప్రక్రియ. ఇక్కడ సాంకేతిక అంశాలతో కేంద్రాన్ని ఒప్పించటం అంత తేలిక కాదు. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానంతో రాష్ట్ర విభజన ప్రక్రియని ఆపాలని చూస్తే ఏమయ్యిందో తెలుసు. పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి ఇచ్చిన ప్రత్యేకహోదా హామీ ఏమయిందో తెలుసు. కాబట్టి తిరిగి అదే తప్పు చేయొద్దు. కేంద్ర ప్రాజెక్టు కాబట్టి చచ్చినట్టు కేంద్రం ఇవ్వాలి అనే వాదన వినటానికి బాగున్నా రాబట్టుకోవటానికి అదొక్కటే సరిపోదు. చాకచక్యంగా పావులు కదపాల్సివుంటుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి అన్ని అంశాలతో మరలా ప్రధానమంత్రిని కలుస్తానని చెప్పటం స్వాగతించదగ్గదే. కానీ కేంద్రం నానిస్తే ఏమిచేయాలో ప్లాన్ బి కూడా రెడీగా వుంచుకోవాలి. కేంద్రం నుంచి తక్షణం వచ్చే సమాధానం అప్పటి కేంద్ర,రాష్ట్ర ఒప్పందం, కేంద్ర కేబినేట్ తీర్మానం. వీటికి సమాధానం కూడా ఎలావుండాలో నిర్ణయించుకోవాలి. అప్పటి ముఖ్యమంత్రితో కుదుర్చుకున్న ఒప్పందంతో మాకు సంబంధం లేదని అనటానికి వీలులేదు. సమస్యల్లా ప్రాజెక్టు అంచనాల కన్నా భూసేకరణ, పునరావాస అంశం దగ్గరే రావచ్చు. అంచనాలలో బాగా వ్యత్యాసం వుంది కూడా ఈ అంశంలోనే.
జగన్ మోహన రెడ్డి కి ఉన్నంత ప్రాధాన్యత కేంద్రానికి ఉండక పోవచ్చు. వచ్చే ఎన్నికల లోపల పోలవరం పూర్తి కాకపోతే తనకు ఇబ్బందే. కేంద్రంలో వున్న బిజెపికి అంత ఇబ్బంది ఉండకపోవచ్చు. కొంతమంది అనొచ్చు. దీన్ని రాజకీయకోణంలో ఎందుకు చూస్తున్నారని. ముందే చెప్పాం. రెండుసార్లు తలకు కట్లుకట్టుకున్న తర్వాత కూడా లౌక్యం లేకపోతే నష్టపోయేది ఆంధ్ర ప్రజలే. అందుకే అవసరమయితే భూసేకరణ,పునరావాసం అంశంలో పట్టువిడుపులతో కేంద్రంతో సంప్రదింపులు జరపాల్సి వస్తే అందుకు కూడా వెనకాడకుండా ఆచరణాత్మక వైఖరితో ముందు కెల్లినప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది. మన వాదనలో ఎంతపస ఉందనే దానికన్నా ఎలా అయితే కేంద్రాన్ని ఒప్పించగలమో, ఎంతవరకయితే ఒప్పించగలమో అనేదే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నాము. ఈరోజు కేంద్రం ఎందుకివ్వదు,మన హక్కు అని మాట్లాడే వాళ్ళే రేపు ఎన్నికల్లోపు పోలవరం పూర్తి కాకపోతే గొంతెత్తి అరుస్తారని మరిచిపోవద్దు. ఒక నాయకుడిగా జగన్ కి ఇది అగ్ని పరీక్షే. చూద్దాం ఎలా పరిష్కరిస్తాడో.
An Independent Editor, Trend Stetting Analyst.
Read MoreWeb Title: Is polavaram another promise like special status
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com