Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan Polavaram Tour: 1200 మంది పోలీసులా? ఇంత సెక్యూరిటీ ఏంటి సార్?

CM Jagan Polavaram Tour: 1200 మంది పోలీసులా? ఇంత సెక్యూరిటీ ఏంటి సార్?

CM Jagan Polavaram Tour: ఏపీ జీవనాడి పోలవం ప్రాజెక్టును సీఎం జగన్ ఈ రోజు సందర్శించారు. సుదీర్ఘ విరామం తరువాత ఆయన ప్రాజెక్టు బాట పట్టారు. ప్రోజెక్టు నిర్మాణానికి కేంద్రం రూ.13 వేల కోట్లు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వేళ సీఎం పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. తాడేపల్లి నుంచి ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. అధికారులతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. గత కొంతకాలంగా ప్రాజెక్టు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. సరిగ్గా ఇదే సమయంలో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో సీఎం జగన్ స్పందించారు. అయితే ఇన్నాళ్లూ పట్టించుకోని ప్రాజెక్టును ఇప్పుడు ఉన్నపళంగా ప్రాధాన్యతాంశంగా తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. భారీ పోలీసు భద్రత నడుమ సీఎం పర్యటన సాగించడం విశేషం.

ప్రాజెక్టు స్థితిగతులను పరిశీలించిన సీఎం జగన్… అనంతరం ప్రాజెక్టు సైట్ లోనే అధికారులతో సమీక్ష చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అంశాలపై అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. అనంతరం వారికి కీలక సూచనలు చేశారు. సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తి చేసేలా శ్రమించాలని ఆదేశాలు ఇచ్చారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్ని పూర్తిస్ధాయిలో రాబట్టుకోవడంతో పాటు వేగంగా పనులు పూర్తయ్యేలా చూడాలని కోరారు. అటు నిర్వాసితుల సమస్యలపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు.

సీఎం హోదాలో జగన్ పోలవరం ప్రాజెక్టును సందర్శించడం ఇది ఐదో సారి. సుమారు 1200 మంది పోలీసులను మోహరించారు. పోలవరం ప్రాంతంలో ఎటు చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. గతంలోనూ సీఎం పోలవరం పర్యటనకు వచ్చిన సందర్భాల్లో ఈ తరహాలోనే భారీగా పోలీసులను మోహరించారు. ఆ సమయంలో నిర్వాసితులు తమ గోడు వినిపించేందుకు వెళ్లినా పోలీసుల ఆంక్షలతో వారికి నిరాశే మిగిలింది. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం 2007లో సేకరించిన భూములకి అదనంగా రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తామని ఎన్నికలకు ముందు జగన్‌ చెప్పారు. ప్రతి నిర్వాసిత కుటుంబానికి రూ.10 లక్షల వ్యక్తిగత పునరావాస పరిహారం చెల్లిస్తామని 2016 జూలై 13న కుక్కునూరులో విపక్ష నేతగా ఆయన హామీలు గుప్పించారు. కానీ అవేవీ అమలుకు నోచుకోలేదు. అందుకే పోలీసు బలగాల నడుమ పర్యటించినట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర నుంచి పోలీసులను రప్పించడం విశేషం. సీఎంగా జగన్ ఎప్పుడు పోలవరం పర్యటించినా ఇదే పరిస్థితి. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2019 జూన్‌ 20వ తేదీన, అదే ఏడాది నవంబరు 4న, 2020 డిసెంబరు 12న, 2021 జూలై 19న పోలవరం ప్రాంతంలో జగన్‌ పర్యటించారు. అయితే, ఆయన వచ్చిన ప్రతిసారీ నిర్వాసితులు ఆయనను కలవకుండా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. మంగళవారం నాటి పర్యటనకు 1200 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. దీనికిగాను ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు,పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి పోలీసులను బస్సుల్లో తెచ్చారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular