డ్రాగన్ దేశానికి చెందిన ఫేమస్ యాప్ టిక్ టాక్ కు వరుస షాకులు తగులుతున్నాయి. భారత్ లో టిక్ టాక్ యాప్ పై నిషేధం విధించడంతో వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. ఆ తరువాత అమెరికాలో కూడా టిక్ టాక్ నిషేధం దిశగా అడుగులు పడ్డాయి. తాజాగా పాకిస్తాన్ సైతం టిక్ టాక్ యాప్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. కొందరు టిక్ టాక్ యాప్ లో అభ్యంతర కంటెంట్ కనిపిస్తోందని ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదులను విచారించగా టిక్ టాక్ యాప్ లో నిజంగానే అభ్యంతర కంటెంట్ దర్శనమిస్తోందని తేలింది. దీంతో పాకిస్తాన్ టెలీకమ్యునికేషన్ అథారిటీ తాత్కాలికంగా యాప్ పై నిషేధం విధించింది. టిక్ టాక్ ప్రతినిధులు ఇచ్చే వివరణను బట్టి నిషేధం విషయంలో ముందుకెళ్లాలని భావిస్తున్నారు. గతంలో పాక్ ప్రభుత్వం టిక్ టాక్ కు కంటెంట్ విషయంలో కీలక సూచనలు చేసింది. అయితే ఎన్ని సూచనలు చేసినా టిక్ టాక్ తీరులో మాత్రం మార్పు రాలేదు.
టిక్ టాక్ నుంచి సంతృప్తికర స్పందన రాకపోతే మాత్రం తాత్కాలిక నిషేధం కాస్తా శాశ్వత నిషేధంగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. టిక్ టాక్ కంటెంట్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎన్నిసార్లు సూచించినా ప్రభుత్వం మాటలను కూడా యాప్ ప్రతినిధులు లెక్క చేయలేదని సమాచారం. భవిష్యత్తులో మరికొని దేశాలు కూడా టిక్ టాక్ యాప్ పై బ్యాన్ విధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
మన దేశం టిక్ టాక్ వల్ల జాతి భద్రతకు ప్రమాదం పొంచి ఉందని భావించి ఆ యాప్ పై నిషేధం విధించింది. మరోవైపు చైనా భారర్ తో వ్యవహరించిన తీరు యాప్ పై నిషేధం అమలు కావడానికి కారణమైంది. టిక్ టాక్, వుయ్ చాట్‌లపై అమెరికా సైతం నిషేధం విధిస్తోంది. పలు దేశాలు తీసుకుంటున్న నిర్ణయాలు చైనాకు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి.