YS Sharmila: వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ చేపట్టిన ప్రజా ప్రస్థానం మహాపాదయాత్ర నేటిలో ఐదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆమె తన పాదయాత్రను కొనసాగిస్తూ ప్రజలను పలకరిస్తూ ముందుకు వెళుతున్నారు. ప్రజాసమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే వచ్చిన వినతులపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. తల్లి విజయమ్మ జెండా ఊపి ప్రారంభించారు. దీంతో నిరాటకంగా పాదయాత్ర కొనసాగిస్తున్నారు.

ఐదో రోజు మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని నాగారం నుంచి మహా పాదయాత్ర 9.30 గంటలకు ప్రారంభించి 9.45 నిమిషాలకు కొత్తగూడ క్రాస్ కు చేరుకుని ప్రజలను కలుసుకున్నారు. మధ్యాహ్నం భోజన విరామం తరువాత మళ్లీ 3 గంటలకు పాదయాత్ర మొదలైంది. మన్సాన్ పల్లి నుంచి కొత్వాల్ చెరువు తండాకు చేరుకుని సాయంత్రం 4.30 గంటలకు మహేశ్వరం టౌన్ కు చేరుకున్నారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.
పాదయాత్రకు వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హాజరై షర్మిలతో భేటీ అయ్యారు. సుమారు గంట పాటు వారిద్దరి మధ్య సమావేశం కొనసాగింది. వైఎస్ జగన్ సూచన మేరకే సుబ్బారెడ్డి పాదయాత్ర గురించి తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తన సోదరి పాదయాత్రపై జగన్ వివరాలు తెలుసుకుని ఏదైనా సహాయం అందించేందుకే ఆయనను పంపించినట్లు సమాచారం.
వైవీ సుబ్బారెడ్డి లోటస్ పాండ్ కు వెళ్లి విజయమ్మను కలిసి పార్టీ పరిస్థితిపై చర్చిస్తారు. జగన్ ఇచ్చిన సమాచారంతోనే సుబ్బారెడ్డి విజయమ్మతో పార్టీ భవిష్యత్ పై సమాలోచనలు చేసే అవకాశం ఉంది. దీంతో తెలంగాణలో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. షర్మిల పాదయాత్రతో తన తండ్రి ఆశయ సాధనకు చర్యలు తీసుకుంటారనే వాదన వినిపిస్తోంది.