Amanchi Swamulu Joined JanaSena: వారాహి యాత్రతో పవన్ ఊపు మీద ఉన్నారు. రెండో విడత వారాహి యాత్ర ముగించారు. దాదాపు నెల రోజుల పాటు ప్రజల మధ్యలోనే గడిపారు. అన్నివర్గాల వారితో సమావేశమై అభిప్రాయాలను సేకరించారు. అటు అధికార వైసీపీ ప్రభుత్వ పాలనలో లోపాలను ఎత్తిచూపారు. ఒక విధంగా చెప్పాలంటే ఏపీలో పొలిటికల్ హీట్ ను పెంచారు. దానికి కొనసాగింపుగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎన్నికలకు పట్టుమని పది నెలల వ్యవధి లేదు. అందుకే పార్టీలోకి రావాలనుకుంటున్న వారి గుణగణాలను స్టడీ చేస్తున్నారు. మంచివారు, పార్టీకి పనికొస్తారన్న వారిని మాత్రమే తీసుకోనున్నారు.
తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ నేత ఆమంచి స్వాములు పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. ఈయన చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు స్వయాన సోదరుడు. ప్రస్తుతం కృష్ణమోహన్ వైసీపీలో ఉన్నారు. ఆయన అధికార పార్టీలో ఉండగా సోదరుడు జనసేనలో చేరడం హాట్ టాపిక్ గా మారింది. స్వాములు సోదరుడు చాటున ఉండేవారు. తెర వెనుక రాజకీయాలను చూసేవారు. కృష్ణమోహన్ అనుమతి లేకుండా అడుగు కూడా బయటకు వేయరన్న టాక్ ఉంది. అటువంటి స్వాములు జనసేనలో చేరడంతో రకరకాల ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. త్వరలో ఆమంచి కృష్ణ మోహన్ సైతం జనసేన వైపు చేరే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ప్రస్తుతం ఆమంచి కృష్ణమోహన్ పర్చూరు నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్నారు. ఆయన ఆ పదవిలో ఇష్టం లేకుండా కొనసాగుతున్నారన్న టాక్ ఉంది. కృష్ణమోహన్ గెలుపోటములు వెనుక స్వాములు ఉంటారు. అటువంటి స్వాములు జనసేలో చేరుతుండడంపై కృష్ణ మోహన్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చీరాలలో కృష్ణ మోహన్ కు ప్రత్యేకమైన పట్టు ఉంది. 2000లో వేటపాలెం మండలం జెడ్పీటీసీగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆమంచి కృష్ణమోహన్.. మాజీ సీఎం కొణిజేటి రోశయ్యకు ప్రధాన శిష్యుడిగా ఎదిగారు. ఆయన ఆశీస్సులతో 2009లో తొలిసారి చీరాల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఆమంచి విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీలో చేరి 2019 ఎన్నికల ముందు తన తమ్ముడు ఆమంచి స్వాములుతో కలిసి జగన్ సమక్షంలో వైసీపీలోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున చీరాల నుంచి పోటీ చేసి కృష్ణమోహన్ ఓటమి పాలయ్యారు.
ప్రస్తుతం చీరాల నుంచి కృష్ణ మోహన్ ను తప్పించారు. కృష్ణమోహన్ పై గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలుపొందిన కరణం బలరాం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా చీరాల నుంచి పోటీకి మొగ్గు చూపుతూ వచ్చారు. ఇలా ముగ్గురు నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుండటంతో జగన్.. కరణం బలరాంకే చీరాల నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే చాన్స్ ఇచ్చారు. ఆమంచి కృష్ణమోహన్ ను పర్చూరు నియోజకవర్గ ఇన్ చార్జిగా పంపారు. కానీ ఇది కృష్ణ మోహన్ కు మింగుడుపడడం లేదు. ఎన్నికల ముందు ఆయన వైసీపీని వీడడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే ముందుగా ఆయన సోదరుడ్ని జనసేనలోకి పంపించి కర్చీఫ్ వేసుకున్నారని టాక్ నడుస్తోంది.