ఏపీ ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల. ఇప్పుడు అందరి దృష్టి ఆ నియోజకవర్గం మీదనే పడింది. ఎందుకంటారా..! నిన్నటివరకు రాష్ట్రంలో నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. దీంతో వాటి రిజల్ట్స్ పైనే అందరికీ ఆసక్తి ఉంది. ఆఖరి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కడప జిల్లాలోని జమ్మలమడుగు, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ జరిగింది.
Also Read: పంచాయతీ పోరులో తేలిన పార్టీ బలాబలాలు..: తిరుపతి సీటును బీజేపీ త్యాగం చేసేనా..!
ఈ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నిన్న 108 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. కాగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. 108 స్థానాల్లోనూ వైసీపీ సపోర్టర్లే విజయం సాధించి రికార్డు సృష్టించారు. అందుకే.. పులివెందులపై జగన్ పట్టేమిటో వేరే చెప్పనక్కర్లేదు. అలాంటి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గడం కూడా వింత కాదు. అయితే.. ఒక్క పంచాయతీలోనూ తెలుగుదేశం పార్టీ ఉనికి చాటుకోలేకపోవడం గమనార్హం. పులివెందుల నియోజకవర్గం టీడీపీ నేత బీటెక్ రవి సొంతూర్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది. ఇక ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి టీడీపీకి దూరం అయినట్టుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పులివెందుల్లో టీడీపీకి దిక్కెవరనే ప్రశ్న తలెత్తింది.
మరోవైపు.. రెండు మండలాల్లో పూర్తిగా ఏకగ్రీవాలే జరిగాయి. వేంపల్లి, చక్రాయపేట మండలాల్లో అన్ని పంచాయతీలూ ఏకగ్రీవం అయ్యాయి. ఈ మండలాల్లో పోలింగ్ అవసరం లేకుండా పోయింది. ఏకగ్రీవం అయిన పంచాయతీలకు ప్రత్యేక నిధులు కూడా అందనున్నాయి. సత్తిరెడ్డి దూరం అయ్యాక.. వేంపల్లి మండలంలో టీడీపీ మరింత బలహీనపడింది. పల్లెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఏర్పడే అవకాశం ఉన్నా, చివరకు రాజీకి వచ్చి ఏకగ్రీవం చేసుకున్నారు.
Also Read: ఏపీలో పంచాయతీ పోరు సక్సెస్..‘నిమ్మగడ్డ’ గెలిచినట్లేనా..?
అవి పోను.. మిగిలిన మండలాల్లోనూ వైసీపీ హవానే కనిపించింది. స్థూలంగా 108 పంచాయతీలకు గానూ 90 పంచాయతీల వరకూ ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. మిగిలిన 18 పంచాయతీల్లో టీడీపీ మద్దతుదార్లు నామినేషన్లు దాఖలు చేశారు. అక్కడ కూడా అంతటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే గెలుపొందారు. అంటే పులివెందుల నియోజకవర్గంలో వందకు వందశాతం సీట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. మరోసారి సొంత నియోజకవర్గంలో జగన్ అంటే ఏంటో నిరూపణ అయింది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్