స్థానికసంస్థల ఎన్నికల సందర్భంగా అధికార పక్షపు హింసాయుత దాడులు మితిమీరిపోతున్నాయి. బుధవారం ఇద్దరు టిడిపి నేతలపై మాచర్లలో వైసిపి కార్యకర్తలు దారుణంగా దాడి చేశారు. తమపై హత్యాయత్నం జరిపారని టిడిపి నేతలు బోండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్నలు ఆరోపించారు.
వారు ప్రయాణం చేస్తున్న కార్లపై మారణాయుధాలతో దాడి జరిపి, అద్దాలు పగులగొట్టి, వారిని బైటకు లాగి దాడి చేసే ప్రయత్నం చేశారు. ఒక్క చోటనే కాకుండా వారు ఎక్కడికి వెడితే అక్కడకు వెంటాడి దాడి జరిపారు. కనీసం నాలుగు చోట్ల దాడులు జరిపారు. ఇంతలో మాచర్ల డిఎస్పీ వారిని ఇతర మార్గాల ద్వారా ఆ ప్రాంతం నుండి పంపివేశారు. డ్రైవర్ అప్రమత్తంగా ఉంటూ, జనం నుండి తప్పించుకొంటూ తమను తీసుకు వెళ్లడం వల్లననే తామిద్దరం బతికి బైట పడ్డామని బోండా ఉమా చెప్పారు.
మంగళవారం టిడిపి అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా దాడులు జరపడంతో, ఫిర్యాదు చేయడానికి ముందు రోజు రాత్రి మాచర్ల పోలీసులకు ఫోన్ చేసి వెడితే, పోలీసులు ఇచ్చిన సమాచారంతోనే తమను కారంపూడి నుండి వెంటాడుతూ దాడికి పాల్పడరని బోండా ఉమా విమర్శించారు. తమను ముక్కలు, ముక్కలుగా నరకడం కోసం విఫలయత్నం చేసారని ఆరోపించారు. తాము వస్తున్నట్లు పోలీసులకు తప్ప మరెవ్వరికీ తెలియదని, అలాంటప్పుడు ఏ విధంగా పధకం ప్రకారం తమను వెంబడించి, దాడులు జరిపారని ప్రశ్నించారు.
వైసీపీ నేతలు రాక్షసులను మరిపిస్తున్నారని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు మండిపడ్డారు. మాచర్లలో బోండా ఉమ కారుపై దాడులకు తెగబడ్డారనిమండిపడ్డారు. మనుషులు ఉన్నా కారుపై దాడి చేశారని పేర్కొన్నారు. వైసీపీ నేతలు రాక్షసులను మరిపిస్తున్నారని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. మాచర్లలో బోండా ఉమ కారుపై దాడులకు తెగబడ్డారన్నారు. మనుషులు ఉన్నా కారుపై దాడి చేశారని పేర్కొన్నారు.
మాచర్ల ఘటనపై డీజీపీ, ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. బోండా ఉమ, బుద్దా వెంకన్నపై హత్యాయత్నం జరిగిందని పేర్కొన్నారు. శాంతిభద్రతలు సరిగా లేనందువల్లే ఈ ఘటన జరిగిందని లేఖలో పేర్కొన్నారు. పోలీసుల్లో ఓ వర్గం అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తోందని తెలిపారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది బలవంతుడిదే రాజ్యం అన్న చందాలు అయింది ప్రతిపక్ష నేతల పై అధికార పార్టీకి చెందిన వారు దాడులకు తెగబడుతున్నట్లు ఆందోళన వ్యక్తం అవుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతిపక్షాలకు చెందిన వారు నామినేషన్లు వేయడానికి భయపడుతున్నారు నామినేషన్లు వేసే వారిపై కూడా దాడులు చేస్తున్నట్లు ప్రసారమాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ బీహార్ రాష్ట్రాన్ని మించిపోయిందని ప్రతిపక్షాల విమర్శలు గుప్పిస్తున్నాయి.
కాగా, అనంతపూర్ జిల్లా బత్తులపల్లి మండలం ఓబులాపురంలో వైసీపీ శ్రేణుల దాడికి పాల్పడ్డాయి. టీడీపీ అభ్యర్థి చెన్నకేశవులుపై దాడి చేసి నామినేషన్ పత్రాలు చించివేశారు. చిన్నమండెంలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిని వైసీపీ అడ్డుకుంది. టీడీపీ అభ్యర్థి నామినేషన్ పత్రాలను వైసీపీ వర్గీయులు చించివేశారు.
మరోవైపు నెల్లూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆత్మకూరు మండలం పడకండ్లలో టీడీపీ అభ్యర్థిని వైసీపీ నేతలు భయబ్రాంతులకు గురి చేశారు. టీడీపీ అభ్యర్థి రాజేశ్వరిని నామినేషన్ వేయనీకుండా ప్రయత్నాలు చేశారు. గుట్కా అమ్ముతున్నారన్న అనుమానంతో రాజేశ్వరి కుమారుడిని అరెస్ట్ చేశారు.