Homeఆంధ్రప్రదేశ్‌Jagan- Sharmila: చెల్లి లొల్లి.. అన్న పరేషాన్‌.. వైఎస్‌ షర్మిలతో అడ్డంగా బుక్కవుతున్న జగన్‌!!

Jagan- Sharmila: చెల్లి లొల్లి.. అన్న పరేషాన్‌.. వైఎస్‌ షర్మిలతో అడ్డంగా బుక్కవుతున్న జగన్‌!!

Jagan- Sharmila: ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు మూకుమ్మడిగా దాడి చేస్తుంటే, వారిని ఎదుర్కోవడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన చెల్లి లొల్లి తలనొప్పిగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్‌ తెలంగాణ పేరుతో పార్టీని పెట్టిన షర్మిల ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేస్తున్నారు. ఆమెను టార్గెట్‌ చేసి టీఆర్‌ఎస్‌ నాయకులు దాడులకు పాల్పడటం, అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరచిన ఘటన తెలంగాణలో చర్చనీయాంశమైంది. ఈ వివాదంతో టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు ఏపీ సీఎం జగన్‌ను టార్గెట్‌ చేసే వరకు వెళ్లింది.

Jagan- Sharmila
Jagan- Sharmila

చెల్లి అరెస్ట్‌పై స్పందించని అన్న..
వైఎస్‌.షర్మిలపై టీఆర్‌ఎస్‌ నేతల దాడి, ఆమె అరెస్ట్‌ మొత్తం ఎపిసోడ్‌ తెలంగాణ రాష్ట్రంలో ఆమెకు సానుభూతి పెంచింది. బీజేపీ, కాంగ్రెసు నాయకులు పార్టీలకతీతంగా షర్మిల అరెస్టును ఖండించారు. ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఆమె సోదరుడు జగన్‌ మోహన్‌రెడ్డి స్పందన కోసం అందరూ ఎదురు చూశారు. షర్మిల ఇంటికి వచ్చే వరకు నిరాహారదీక్ష చేస్తానని మాట్లాడిన విజయమ్మ సైతం జగన్‌ గురించి మాట్లాడడానికి ఇబ్బంది పడ్డారు. ఆ రాష్ట్రంతో.. జగన్‌తో మనకేంటి అంటూ మాట దాటవేసే ప్రయత్నం చేశారు. ఆఖరికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై స్పందించిన తర్వాత కూడా జగన్‌ రెస్పాండ్‌ కాలేదు.

జగన్‌ను టార్గెట్‌ చేస్తున్న టీఆర్‌ఎస్‌..
షర్మిల ఎపిసోడ్‌లో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆమె తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డితోపాటు, ఆమె సోదరుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్‌ చేస్తున్నారు. షర్మిల ఘటనను జగన్‌పై విమర్శలు చేయడానికి అనువుగా మార్చుకుంటున్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అంతబాగా పాలన సాగుతుందా? వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అంత గొప్పగా పరిపాలన చేస్తున్నారా? షర్మిల తెలంగాణలో ఎమ్మెల్యేలను విమర్శలు చేస్తే, తాము ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్‌ చేస్తామం’ అన్నట్లుగా ఇప్పటికే అనేక మంది టీఆర్‌ఎస్‌ నాయకులు జగన్‌పై విమర్శలు గుప్పించారు. ఏపీ సర్కార్‌ వైఫల్యాలను షర్మిల ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీస్తున్నారు. ‘‘తెలంగాణ రాష్ట్రంలో కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువ సమస్యలు ఉన్నాయి.. అక్కడకు వెళ్లి వాటిని పరిష్కరించాలి’’ అంటూ హితవు పలికారు. ‘‘మీ అన్న అక్రమంగా సంపాదించలేదా?’’ అని ప్రశ్నిస్తున్నారు.

జగన్‌ను ఇబ్బంది పెడుతున్న షర్మిల ఎపిసోడ్‌..
తెలంగాణపై షర్మిలకు ప్రేమ ఉంటే.. విభజన సమస్యలను, కృష్ణా నది నీటి వాటా లెక్కలను ఆమె సోదరుడు జగన్‌తో మాట్లాడి తేల్చాలని సవాల్‌ చేస్తున్నారు. షర్మిల ఒంటరిగా తెలంగాణలో పోరాటం చేస్తుంటే, పక్క రాష్ట్ర సీఎం చెల్లెలు అన్న పేరుతో జగన్‌మోహన్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌ నాయకులు ఈ వ్యవహారంలోకి తీసుకువచ్చి రచ్చ చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం ఏపీ సీఎంను ఇబ్బంది పెడుతోంది.

Jagan- Sharmila
Jagan- Sharmila

చిక్కుల్లో జగన్‌..
తెలంగాణలో షర్మిల ఎపిసోడ్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయినా ఆమె అన్న.. ఏపీ సీఎం జగన్‌ పరామర్శకు వస్తారా? దాడి ఘటనపై స్పందిస్తారా? ఒకవేళ స్పందిస్తే తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? స్పందించకపోతే పరిస్థితి ఏంటి? వంటి ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని సమస్యలతో సతమతమవుతున్న జగన్‌కు తెలంగాణ రాష్ట్రంలో షర్మిల, ఆమె పెట్టిన పార్టీ మరో కొత్త సమస్యను తెచ్చిపెట్టిందన్న అభిప్రాయం వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. అనవసరంగా తెలంగాణ నేతలతో జగన్‌ టార్గెట్‌ అయ్యేలా చేస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ నాయకుల విమర్శలకు స్పందిస్తే ఒక తంటా .. స్పందించకుంటే ఎట్లా అన్న తర్జనభర్జనలో వైసీపీ నాయకులు ఉన్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version