Pawan Kalyan vs Jagan: జనసేనాని పవన్ పై ఏపీ సర్కారు మరోసారి ఉక్కుపాదం మోపింది. మొన్న విశాఖలో అడుగడుగునా పవన్ ను అడ్డగించిన ప్రభుత్వం.. ఇప్పుడు అమరావతి ప్రాంతంలో అదే పంథాను అనుసరించింది. హౌస్ అరెస్ట్ చేసింది.
+ఇటీవల పవన్ వైసీపీ సర్కారుతో పాటు నేతల వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు.. ఇవి ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి. పవన్ ఆరోపణలు వ్యక్తిగతంగా కాకుండా వ్యవస్థా పరంగా ఉండడంతో ప్రజల్లో కూడా ఆలోచింపజేస్తున్నాయి. అందుకే పవన్ అంటేనే వైసీపీ నేతల్లో ఒక రకమైన భయం ఏర్పడింది. ఆయన పర్యటన అంటేనే ఒక రకమైన ఫీవర్ నెలకొంది. అందుకే ప్రజల్లోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

తాడేపల్లి మునిసిపాల్టీ పరిధిలోని ఇప్పటంలో ఇటీవల ఆక్రమణల పేరిట ప్రభుత్వం నిర్మాణాలను తొలగించింది. కొద్దిరోజుల కిందట జనసేన ప్లీనరీ నిర్వహణకు గ్రామస్థులు స్థలం సమకూర్చారు. అటు పవన్ కూడా గ్రామస్థుల ఔదార్యాన్ని మెచ్చి రూ.50 లక్షలు సాయంగా అందించారు. ఆ మొత్తంతో గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మించారు. అయితే అటు తరువాత ఆక్రమణలను తెరపైకి తెచ్చిన ప్రభుత్వం వారికి ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా పెట్టింది. ఇప్పుడు ఇళ్లతో పాటు ప్రహరీలు, కీలక నిర్మాణాలను ధ్వంసం చేసింది. దీనిపై గ్రామస్థులు కోర్టును ఆశ్రయించారు. అయితే జనసేన ప్లీనరీకి స్థలం ఇవ్వడం వల్లే ఈ పరిస్థితులకు దారితీసిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాధితులను పరామర్శించడానికి పవన్ సిద్ధమయ్యారు. శనివారం ఉదయం పోలీసుల అడ్డగింతలు, ఆంక్షల నడుమ ఇప్పటంలో పర్యటించారు. కానీ పవన్ ప్రజలను కలుసుకోకుండా ఎక్కడికక్కడే ముళ్ల కంచెలు వేశారు.
అటు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై పవన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన ప్లీనరీ నిర్వహణకు స్థలం ఇచ్చినందునే వారి ఇళ్లను ధ్వంసం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో మరెక్కడా ఆక్రమణలులేవా అని ప్రశ్నించారు. వైసీపీ సర్కారు ఇదే విధంగా వ్యవహరిస్తే ఇడుపాలపాయలో హైవే నిర్మిస్తామంటూ పవన్ హెచ్చరించారు. అయితే పవన్ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మాత్రం విమర్శలకు తావిస్తోంది. మొన్న విశాఖలో ప్రజావాణిని అడ్డగించారు. ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా పరామర్శిస్తామంటే అడ్డుకున్నారు. దీనిని అన్ని రాజకీయ పక్షలూ ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. అటు విశ్లేషకులు సైతం ప్రభుత్వ చర్యలను తప్పుపడుతున్నారు.

ఇటీవల జరుగుతున్న పరిణామాలతో పవన్ పై ఏపీ సీఎం జగన్ ఆక్రోషం పెంచుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు బయటకు రావడానికి పవనే కారణమని అనుమానిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనను అధికార పీఠానికి దూరం చేస్తానని పవన్ శపధం చేయడం కూడా జగన్ కు రుచించడం లేదు. పైగా చంద్రబాబుతో కలుస్తుండడం, కేంద్ర పెద్దల సహాయ నిరాకరణకు పవనే కారణంగా భావిస్తున్నారు. అటు కాపు సామాజికవర్గం కూడా వైసీపీకి దూరమవుతుండడం, పవన్ కు దగ్గరవుతుండడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే పవన్ అంటేనే మండిపోతున్నారు. పవన్ ను నిలువరించడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అయితే పవన్ విషయంలో ఇదే అణచివేత ధోరణి మాత్రం కంటిన్యూ అయితే రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.