Homeజాతీయ వార్తలుTelangana MLAs- Ministers: రాజీనామా చేస్తారా? చస్తారా? ప్రజల నుంచి ఎమ్మెల్యేలకు వెల్లువెత్తుతున్న ఫోన్లు!

Telangana MLAs- Ministers: రాజీనామా చేస్తారా? చస్తారా? ప్రజల నుంచి ఎమ్మెల్యేలకు వెల్లువెత్తుతున్న ఫోన్లు!

Telangana MLAs- Ministers: తెలంగాణలో ప్రజల ఫోన్‌కాల్స్‌ మంత్రులు, ఎమ్మెల్యేలను భయపెడుతున్నాయి. తమ ఊరు, వార్డు, పట్టణం అభివృద్ధి కావాలంటే ఉప ఎన్నిక రావాలని కోరుకునన్నారు. వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా.. ఫోన్‌కాల్స్‌ రికార్డు చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. కొంతమంది తర్వాత మాట్లాడతా అని ఫోన్‌ కట్‌ చేస్తుండగా కొందరు దురుసుగా మాట్లాడి విమర్శలపాలవుతున్నారు. ఫలానా ఎమ్మెల్యే ఇలాంటివాడా.. ప్రజలతో ఇలా మాట్లాడతాడా.. ఇంత బూతులు తిడతాడా.. అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివాడు తమ ఎమ్మెల్యే అయినందుకు మరికొందరు అసహ్యించుకుంటున్నారు.

Telangana MLAs- Ministers
Telangana MLAs- Ministers

ఉప ఎన్నికలు రావాలని..
తెలంగాణలో మరిన్ని ఉపఎన్నికలు రావాలని జనాలు కోరుకుంటున్నారు. తమ నియోజకవర్గంలో ఉపఎన్నిక వస్తే బాగుంటుందని.. అప్పుడైనా అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారు. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాలతో ఉప ఎన్నికలు రాగా.. ఆ నియోజకవర్గాలపై ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. నిధుల వరదలు పారించింది. గత ఎనిమిదేళ్లలో ఎప్పుడూ జరగని అభివృద్ధి ఈటల రాజీనామా చేశాక హుజూరాబాద్‌లో జరిగిందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఇప్పుడు మునుగోడులో కూడా అదే పరిస్థితి. మునుగోడును దత్తత తీసుకుంటానని తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్‌ స్వయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తమ ఎమ్మెల్యే లు రాజీనామా చేసి ఉప ఎన్నిక వస్తేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని.. ఎమ్మెల్యేలకు ప్రజలు ఫోన్లు చేస్తున్నారు.

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లోనూ డిమాండ్‌..
రాష్ట్రంలోని హుజూరాబాద్, మునుగోడు మినహా మిగతా 117 నియోజకవర్గాల్లోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా తమ ఎమ్మెల్యే రాజీనామా చేస్తేనే బాగుండని ఆకాంక్షిస్తున్నారు. ప్రజలు ఎలా అయితే అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారో.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అభివృద్ధితోపాటు ఉత్సవ విగ్రహాల్లా ఉన్న తమకు నిధులు మంజూరవుతాయని, పెండింగ్‌ బిల్లులు క్లియర్‌ అవుతాయని అంటున్నారు. అయితే రాష్ట్రంలో దాదాపు అన్ని స్థానిక సంస్థల్లో మెజారిటీ అధికార పార్టీకి చెందినవారే కావడంతో ఓటర్లు అడుగుతున్నట్లు ఎమ్మెల్యేలను నేరుగా అడగడం లేదు. అడిగితే ఉన్న పదవి ఊడుతుందేమో అని భయపడుతున్నారు. కానీ, మనసులో మాత్రం ఎమ్మెల్యేల రాజీనామాతోనే తమకు మంచి రోజులు వస్తాయని భావిస్తున్నారు.

ఓటరు ఫోన్‌ అంటే జంకుతున్న ఎమ్మెల్యేలు..
హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికలతో అక్కడ జరిగిన అభివృద్ధిని పరిశీలిస్తున్న తెలంగాణ ప్రజలు తమ నియోజకవర్గ అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలకు నేరుగా ఫోన్‌ చేస్తున్నారు. దీంతో ఓటరు ఫోన్‌ అనగానే ఎమ్మెల్యే భయపడే పరిస్థితి నెలకొంది.

ఇటీవల మెదక్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఆ తర్వాత నర్సాపూర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, జహీరాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు, బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు, అందోల్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. ఉమ్మడి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే, మంత్రి కొప్పుల ఈశ్వర్, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వోడితల సతీశ్‌బాబుకి వారి వారి నియోజకవర్గంలోని పలువురు ఫోన్లు చేసి రాజీనామాలు కోరారు. ఈ ఆడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ప్రజాప్రతినిధుల్లో అసహనం..
ప్రజలు, కార్యకర్తల నుంచి తరచూ ఫోన్లు వస్తుండడంతో కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తితోపాటు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది ఎమ్మెల్యేలు తమకు ఫోన్లు చేసిన వారిని అనుచరులతో బెదిరిస్తున్నారు.

– జనగాం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఫోన్‌ చేసిన ఓ వ్యక్తి రాజీనామా చేయాలని కోరాడు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే.. మునుగోడు నియోజకవర్గం తరహాలో తమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు త్వరగా జరుగుతాయని చెప్పాడు.

– బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు రాజీనామా చేస్తేనే రోడ్డు వేస్తారని ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలానికి చెందిన ఆరు గ్రామాల ప్రజలు రాస్తారోకో చేశారు.

– సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌ రావుకు మనియార్‌ పల్లి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్‌ అక్రమ్‌షా ఫోన్‌ చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని కోరాడు. రాజీనామా చేస్తే మునుగోడు నియోజకవర్గం తరహాలో తమకు లబ్ధి చేకూరుతుందని విజ్ఞప్తి చేశాడు. సీఎం కేసీఆర్‌ను అడిగి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే మాణిక్‌రావు సర్దిచెప్పారు.

– అందోల్‌ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌కు అల్లాదుర్గం మండలం మాందాపూర్‌ గ్రామం నుంచి కృష్ణ అనే వ్యక్తి ఫోన్‌ చేసి రాజీనామా కోరాడు. ఇప్పటికే తన నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు చేపట్టానని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌.. సదరు వ్యక్తికి నచ్చజెప్పాడు.

– నర్సాపూర్‌ఎమ్మెల్యే మదన్‌ రెడ్డికి శనివారం ఫోన్‌ చేసి పదవికి రాజీనామా చేయాలని కోరిన బీజేపీ శివ్వపేట మండలం ఉసిరికపల్లి ప్రధాన కార్యదర్శి అశోక్‌పై టీఆర్‌ఎస్‌ నాయకులు ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Telangana MLAs- Ministers
KCR

– రాజీనామా చేస్తే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందంటూ రెండు రోజుల క్రితం మెదక్‌ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి రామాయంపేటకు చెందిన స్వామి ఫోన్‌ చేశాడు. ఆదివారం ఎమ్మెల్యే అనుచరుడు ఒకరు స్వామికి ఫోన్‌చేసి బెదిరించారు. సారీ అంటూ వాయిస్‌ మెసేజ్‌ పెట్టాలని హెచ్చరించాడు.

– పెద్దపల్లి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి ఎలిగేడు మండలం బుర్హన్‌ మియా పేటకు చెందిన రంజిత్‌ రెడ్డి అనే యువకుడు ఫోన్‌ చేశాడు. పెద్దపల్లి నియోజకవర్గం మరింత అభివృద్ధి కావాలంటే రాజీనామా చేయాలని కోరాడు. ఆ ఆడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

– సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీ‹శ్‌బాబుకు కోహెడ మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన కంది సతీ‹శ్‌రెడ్డి అనే యువకుడు ఫోన్‌ చేసి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని అడిగాడు. తను ఏ పార్టీలో ఉన్నానో అదే పార్టీ గెలుస్తుందని ఎమ్మెల్యే సమాధానం ఇచ్చారు. హుస్నాబాద్‌ నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందాలంటే మీరు కూడా రాజీనామా చేయాలని అతడు కోరడంతో ఎమ్మెల్యే సతీశ్‌ అవాక్కయ్యారు. కోతమ ఊరు వెంకటేశ్వర్లపల్లి కి రోడ్డు సరిగ్గా లేదని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరలేదని విమర్శించారు.

– కరీంనగర్‌కు చెందిన కోట శ్యామ్‌కుమార్‌ కూడా మంత్రి గంగుల కమలాకర్‌ రాజీనామా చేయాలంటూ ప్లకార్డ్స్‌తో కలెక్టరెట్‌ ముందు నిరసన వ్యక్తం చేసాడు.

– జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యేకి ఫోన్‌ చేసి రాజీనామా చెయ్యాలని కోరాడు ఓ యువకుడు. మీరు రాజీనామా చేస్తేనే.. ధర్మపురి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామానికి చెందిన క్యాతం రమే‹శ్‌ కోరారు. ప్రస్తుతం అతను కువైట్‌లో పనిచేస్తున్నాడు. కువైట్‌ నుంచి ఫోన్‌ చేసిన అతడు.. మంత్రి రాజీనామా చేయాలని కోరాడు. వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించాడు. దీంతో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఏమీ మాట్లాడకుండా కాల్‌ కట్‌ చేశారు. చాలా చోట్ల ఇలాంటి అనుభవాలే నేతలకు ఎదురవుతున్నాయి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular