YCP: వైసీపీలో ఎక్కడికక్కడే తిరుగుబాట్లు ప్రారంభమవుతున్నాయి. ఎన్నికల ముంగిట అభ్యర్థుల మార్పు వివాదాలకు దారితీస్తోంది. అయితే ఈ మార్పు ప్రక్రియలో సొంత మీడియా ఉద్యోగుల సేవలను వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. మరో మీడియా ప్రతినిధిని సైతం తాడేపల్లికి పిలిపించుకొని జగన్ సలహాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. అసలు రాజకీయాలతో, వ్యూహాలతో సంబంధం లేని వారిని నమ్మి అభ్యర్థులను మార్చుతున్నారని.. ఇది వికటించడం ఖాయమని పార్టీలో సీనియర్లు చెబుతున్నారు. కానీ అధినేతకు చెప్పి సాహసం చేయడం లేదు. ఒకవేళ సలహా ఇచ్చినా.. పెడచెవిన పెట్టడమే కాదు.. తామే బాధితులుగా మిగులుతామన్న బెంగ వారిని వెంటాడుతోంది. అందుకే వారు వ్యూహాత్మకంగా సైలెంట్ అవుతున్నారు.
సీఎం కార్యాలయం నుంచి ఫోన్ అంటేనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు టెన్షన్ పడుతున్నారు. ఇలా పిలుపు వచ్చిందంటే చాలు తమకు రాజకీయంగా కష్టాలు ప్రారంభమయ్యాయి అన్న ఆందోళన చెందుతున్నారు. భయంతోనే తాడేపల్లి చేరుతున్నారు. అయితే అక్కడే మొదలవుతాయి మార్కెటింగ్ తరహాలో పలకరింపులు, ప్రశ్నలు. సీఎం కార్యాలయం లోకి వెళ్లే ఎమ్మెల్యేలకు సజ్జల రామకృష్ణారెడ్డి, మిధున్ రెడ్డి స్వాగతం పలుకుతున్నారు. కుశల ప్రశ్నలు వేస్తున్నారు. తరువాత మార్పు గురించి చెబుతున్నారు. అనంతరం జగన్ వద్దకు పంపిస్తున్నారు. అచ్చం కార్పొరేట్ సంస్థల ఇంటర్వ్యూ మాదిరిగా.. నేతల భవితవ్యాన్ని తేల్చేస్తున్నారు.
మంత్రి విశ్వరూప్ కు జగన్ గట్టి జలక్ ఇచ్చారు. ఈసారి అమలాపురం టికెట్ ను మీ కుమారుడు శ్రీకాంత్ ఇస్తానని జగన్ తేల్చి చెప్పినట్లు సమాచారం. అయితే తానే పోటీ చేస్తానని.. ప్రజల్లోకి బలంగానే వెళ్తున్నానని.. వారి మద్దతు తనకే ఉందని విశ్వరూప్ చెబుతున్న జగన్ ఒప్పుకోలేదట. అధికారంలోకి వచ్చాక రాజ్యసభ సీటు ఇస్తాను.. తప్పుకోండి అంటూ తేల్చి చెప్పడంతో విశ్వరూప్ అయిష్టతగానే బయటకు వచ్చారు. అయితే ప్రతిరోజు తాడేపల్లి ప్యాలెస్ లో ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయని.. టికెట్లతో కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
సీఎం ప్రభుత్వ పాలనను తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. నియోజకవర్గ ఇన్చార్జిల మార్పుపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. వరుసగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను పిలిచి జగన్ మాటామంతి కొనసాగిస్తున్నారు. సామాజిక సమీకరణలు, స్థానిక పరిస్థితులు వంటి అంశాలను వివరిస్తూ వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆందోళనతో వస్తున్న ఎమ్మెల్యేలు.. తాడేపల్లి ప్యాలెస్ నుంచి నిరాశగా వెనుదిరుగుతున్నారు. తెలంగాణలో సిట్టింగులను మార్చకపోవడం వల్లే కేసీఆర్ ఓడిపోవాల్సి వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దానిని ఆసరాగా తీసుకుని జగన్ ఏకంగా 70 నుంచి 80 మంది సిట్టింగులను మార్చేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రయత్నాన్ని వైసిపి సీనియర్లు తప్పుపడుతున్నారు. ఎక్కడ ఏదో జరిగిందని.. ఇలా మార్పులు చేసుకుంటూ పోతే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. కానీ అధినేతకు చెప్పే సాహసం మాత్రం చేయలేకపోతున్నారు.