TDP Janasena Manifesto: ఏపీలోనూ మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం.. చంద్రబాబు హామీ

20 లక్షల మందికి ఉపాధి కల్పన బాధ్యతలను తీసుకుంటామని.. అగ్రవర్ణాల పేదలను ఆర్థికంగా ఆదుకుంటామని.. బీసీల రక్షణ కోసం చట్టం తీసుకొస్తామని.. ఇంకా ఏ కార్యక్రమాలు చేయాలనే దానిపై అధ్యయనం చేస్తున్నామని ఇరువురు పార్టీ నేతలు ప్రకటించారు.

Written By: Dharma, Updated On : December 21, 2023 8:57 am

TDP Janasena Manifesto

Follow us on

TDP Janasena Manifesto: ఇటీవల ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అన్న హామీ బాగానే వర్కౌట్ అవుతోంది. తొలుత కర్ణాటకలో ఇది హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. తెలంగాణలో సైతం ఇదే హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ కూడా విజయం సాధించగలిగింది. ఇప్పుడు ఏపీలో ఈ హామీ తెరపైకి వచ్చింది. చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా పోలిపల్లిలో టిడిపి నిర్వహించిన ‘యువగళం- నవ శకం’ సభ ద్వారా టిడిపి, జనసేన ఎన్నికల శంఖారావాన్ని పూరించాయి. చాలా విషయాలపై ఇద్దరు అధినేతలు స్పష్టతనిచ్చారు.

20 లక్షల మందికి ఉపాధి కల్పన బాధ్యతలను తీసుకుంటామని.. అగ్రవర్ణాల పేదలను ఆర్థికంగా ఆదుకుంటామని.. బీసీల రక్షణ కోసం చట్టం తీసుకొస్తామని.. ఇంకా ఏ కార్యక్రమాలు చేయాలనే దానిపై అధ్యయనం చేస్తున్నామని ఇరువురు పార్టీ నేతలు ప్రకటించారు. త్వరలో టిడిపి, జనసేన ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తామని తెలిపారు.అమరావతి, తిరుపతిలో నిర్వహించే బహిరంగ సభల్లో మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు.

మహిళలకు రక్షణ ఉండాలంటే ఏపీలో వైసీపీ ప్రభుత్వం పోవాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అసలు వైసీపీ ఒక రాజకీయ పార్టీ కాదని.. జగన్ రాజకీయాలకు అనర్హుడని… ఒక్క ఓటు ఆ పార్టీకి వేసినా అది రాష్ట్రానికి శాపంగా మారుతుందని చంద్రబాబు కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారని.. ప్రత్యర్థుల ఓట్లను తొలగిస్తున్నారని… అందుకే టిడిపి, జనసేన శ్రేణులు ఒక్కసారి మీ ఓటు ఉందో లేదో చూసుకోవాలన్నారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామనిప్రకటించారు. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1500, తల్లికి వందనం కింద రూ. 15000 ఇవ్వనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. పేదవారికి ఖర్చులు తగ్గించేందుకు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని… రైతుకు ఏడాదికి పెట్టుబడి సాయం కింద రూ. 20000 సాయం చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఉమ్మడి మేనిఫెస్టోలో అన్ని విషయాలు చెబుతామని చెప్పుకొచ్చారు. మొత్తానికైతే ఆర్టీసీ బస్సులు మహిళల ఉచిత ప్రయాణం హామీ ఏపీలో కూడా బలంగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది.