Homeఎంటర్టైన్మెంట్Yuvagalam Navasakam: 'యువగళం-నవశకం' సభ గ్రాండ్ సక్సెస్.. రాజకీయ మార్పులకు నాంది

Yuvagalam Navasakam: ‘యువగళం-నవశకం’ సభ గ్రాండ్ సక్సెస్.. రాజకీయ మార్పులకు నాంది

Yuvagalam Navasakam: వచ్చే ఎన్నికల్లో కథనరంగానికి ఉత్తరాంధ్ర ప్రారంభ వేదికగా మారింది. ‘యువగళం- నవశకం’ ఇందుకు నాంది పలికింది. టిడిపి, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ వైసిపి విముక్త ఏపీ సాధనకు యుద్ధం ప్రకటించారు. ఇరు పార్టీల శ్రేణులు సమన్వయం చేసుకొని వైసీపీని గద్దె దించాలని పిలుపునిచ్చారు. లక్షలాదిగా తరలివచ్చిన టిడిపి శ్రేణులు, భారీగా హాజరైన జనసేన శ్రేణులకు సభా ప్రాంగణం జన సముద్రంలా మారింది. ప్రత్యర్థి పార్టీ వెనుల్లో వణుకు పుట్టించింది. రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. రాజకీయ మార్పులకు కారణం కానుంది. టిడిపి, జనసేన కలిస్తే ఆ పవర్ ఎలా ఉంటుందో ఈ సభ నిరూపించింది.

ఈనెల 18న లోకేష్ పాదయాత్ర గ్రేటర్ విశాఖలోని శివాజీ నగర్ లో ముగిసింది. వాస్తవానికి విశాఖలో ఈ సభ ఏర్పాటు చేయాల్సి ఉంది. తొలుత ఆంధ్రా యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో సభ ఏర్పాటుకు ప్లాన్ చేశారు. కానీ కొందరు ప్రభుత్వ పెద్దలు ఒత్తిడితో యూనివర్సిటీ అధికారులు గ్రౌండ్ ఇచ్చేందుకు అనుమతించలేదు. దీంతో అప్పటికప్పుడు విజయనగరం జిల్లా పోలిపల్లిలో సభ ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదు. ప్రైవేటు విద్యాసంస్థల బస్సులు ఇవ్వకుండా రవాణాశాఖ అధికారులు ఒత్తిడి చేశారు. దీంతో రైళ్లలో వచ్చారు. ప్రైవేటు బస్సులు మాట్లాడుకుని వచ్చారు. సొంత వాహనాల్లో స్వచ్ఛందంగా వచ్చి సభను సక్సెస్ చేశారు. టిడిపి నేతలు ఎంత సమీకరణ చేశారో.. దానికి రెండింతలు స్వచ్ఛందంగా తరలి వచ్చిన వారు ఉన్నారు.

కొన్ని శకునాలు బాగుంటాయని చెబుతారు. ఇప్పుడు ఎన్నికల ముంగిట టిడిపి, జనసేనలకు శకునం బాగున్నట్టు కనిపిస్తోంది. ఈ సభతో జగన్ పాలనకు చరమగీతం ఖాయమని టిడిపి, జనసేన నేతలు అభిప్రాయపడ్డారు. సభలో ప్రసంగించిన నేతలు.. ఎక్కడా సుత్తి లేకుండా.. శృతి తప్పకుండా ప్రజలకు బలమైన సందేశాలు పంపారు. ప్రజలు పడుతున్న కష్టాలను వారికి గుర్తు చేసే ప్రయత్నం చేయలేదు. మీకోసం మేమున్నామని మాత్రం గుర్తు చేయగలిగారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం, భావితరాల కోసం మేమున్నామని.. కలిసి వస్తున్నామని భరోసా ఇవ్వగలిగారు. అన్నింటికీ మించి ప్రజలకు భద్రత, భరోసా, వారి ఆస్తులకు రక్షణ, భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తామని మాత్రం హామీ ఇవ్వడం ప్రజలను ఆకట్టుకుంది.

తన సహజ శైలికి భిన్నంగా పవన్ ప్రసంగించారు. భావోద్వేగ ప్రకటనలు చేశారు. రాష్ట్ర నిర్మాణం కోసం చేయాల్సిన పనులను వెల్లడించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కర్షక, కార్మిక.. ఇలా అన్ని వర్గాల గురించి మాట్లాడారు. వారందరి భద్రతకు భరోసా ఇస్తామని.. గత ఐదు సంవత్సరాలుగా బాధిత వర్గాలుగా మిగిలిన వారికి అండగా ఉంటామని పవన్ హామీ ఇవ్వడం.. ఆ వర్గాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. చివరిగా మాట్లాడిన చంద్రబాబు పవన్ తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని గాడిలో పెడతామని చెప్పడంతో ప్రజల్లో ఒక రకమైన ఆలోచన ప్రారంభమైంది. అయితే ఇది పేరుకే లోకేష్ పాదయాత్ర విజయోత్సవ సభ కానీ.. టిడిపి, జనసేన తొలి బహిరంగ సభగానే రాష్ట్ర ప్రజలు భావించారు. ఈ సభతో ఒక రకమైన రాజకీయ మార్పు ప్రారంభమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version