
YCP Sitting MPs and MLAs: 2019 ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని విజయం సాధించింది. మరి 2024 ఎన్నికల్లో ఇదే ఫలితం వస్తుందా? అంటే.. అవును అని ఆ పార్టీ నేతలు ఖచ్చితంగా సమాధానం చెప్పలేని పరిస్థితి. కీలకమైన రాజధాని మార్పు, లోపించిన అభివృద్ధి, సహజ వ్యతిరేకత వంటి అంశాలతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీల వ్యక్తిగత పనితీరు వంటివన్నీ గెలుపును నిర్దేశించే ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఈ విషయం వైసీపీ అధిష్టానికి తెలియనిదేమీ కాదు. అందుకే.. తగిన వ్యూహాలు రచించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పలువురు నేతలకు భారీ షాక్ తగలబోతోందని తెలుస్తోంది.
రాష్ట్రంలో రాజధాని మార్పు అంశం ఎంతటి కీలక నిర్ణయమో అందరికీ తెలిసిందే. ఈ నిర్ణయం గుంటూరులో వైసీపీపై ప్రభావం గట్టిగా చూపొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది కనిపించకపోయినా.. శాసనసభ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో సమీకరణాలు మారబోతున్నాయని తెలుస్తోంది.
గుంటూరులో మొత్తం మూడు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఇందులో రెండు వైసీపీ ఖాతాలో ఉండగా.. ఒకటీ టీడీపీ గెలుచుకుంది. నరసరారావుపేట, బాపట్ల అధికార పార్టీ అకౌంట్లో ఉన్నాయి. అయితే.. ఇవి రెండు స్థానాల టిక్కెట్లు సిట్టింగులకు దక్కుతాయా? అంటే.. లేదు అనే మాటే ఎక్కువగా వినిపిస్తోంది. శ్రీనివాసరెడ్డి, నందిగం సురేష్ కు వచ్చేసారి టికెట్ దక్కకపోవచ్చనే ప్రచారం సాగుతోంది. వీరిలో సురేష్ కు ఎమ్మెల్యే సీటు ఇస్తారని చెబుతున్నారు.
నందిగం సురేష్ కు తాడికొండ నియోజకవర్గం అప్పగిస్తారని కూడా అంటున్నారు. ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఉండవల్లి శ్రీదేవిని పక్కన పెట్టే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇక, ఇదే సీటు కోసం మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక, నరసారావుపేట ఎంపీని కూడా నరసారావుపేట ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొచ్చంటున్నారు.
ఇలా ఖాళీ చేస్తున్న సీట్లన్నీ ఎవరికి ఇస్తారు అన్నదేగా ప్రశ్న? విపక్షంలో బలంగా ఉన్నవారిని లాగేసి, వారికి టిక్కెట్లు ఇస్తారని చెబుతున్నారు. ఎవరైతే.. వైసీపిని ప్రభావితం చేయగలరో.. అలాంటి బలమైన టీడీపీ నేతలకు వైసీపీ కండువా కప్పేయాలని అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చిందని ప్రచారం సాగుతోంది. ఆ విధంగా.. రాజధాని ప్రాంతంలోని వ్యతిరేకతను కవర్ చేయాలని చూస్తోందట. ఇదే.. జరిగితే ఎంతో కాలంగా వైసీపీలో ఉండి, వచ్చే ఎన్నికల్లోనైనా సీటు దక్కుతుందని ఆశ పడుతున్నవారికీ.. సిట్టింగ్ సీటు నిలబెట్టుకోవాలని చూస్తున్నవారికీ.. భారీ షాక్ తగిలే అవకాశం ఉందని అంటున్నారు. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.