YCP- Ram Gopal Varma: ఆర్జీవీ… పరిచయం లేని పేరు.. ఒకప్పుడు టాలీవుడ్, బాలీవుడ్‌లో సెన్షేషనల్ డైరెక్టర్. ఆయన డేట్స్ కోసం నిర్మాతలు, హీరోలు నిరీక్షించేవారు. చాన్స్ కోసం హీరోయిన్లు వెయిట్ చేసేవారు. కానీ, కొన్నేళ్లుగా ఆర్జీవీ తన చేష్టలతో తన ఇమేజ్‌ను తానే దిగజార్చుకుంటూ వస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాజకీయాల్లో ఆర్జీవీ జోక్యం పెరిగింది. టీడీపీ వ్యతిరేక భావనతో ఆయన తరచూ సోషల్ మీడియాల్లో కామెంట్లు పెడుతూ ప్రచారం పొందారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ దగ్గరయ్యారు.

చంద్రబాబు వ్యతిరేక సినిమాలు..
ఏపీలో రాజకీయాలు, రక్త చరిత్రలపై 2014 నుంచి 2018 వరకు సినిమాలు తీశారు. వంగవీటి రంగ జీవితాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలు చంద్రబాబుకు నెగెటివ్‌గా మారడంతో వైసీపీ 2019 ఎన్నికల సమయంలో ఆర్జీవీని ఉపయోగించుకోవాలనుకుంది. చంద్రబాబు ఓటమే లక్ష్యంగా లక్షీమస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప రెడ్లు పేరుతో వైసీపీ నేతలే నిర్మాతలుగా సినిమాలు తీసి విడుదల చేశారు. ఈ సినిమాలు 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓటమికి కారణమయ్యాయి. దీంతో అప్పటి నుంచి ఆర్జీవీ అధికార వైసీపీకి దగ్గరగా ఉంటున్నారు. 2024 ఎన్నికల సమయంలోనూ టీడీపీ, చంద్రబాబు, బాలయ్య, జనసేనకు వ్యతిరేకంగా సినిమాలు తీయించాలని జగన్ సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ఆర్జీవీ స్వయంగా జగన్‌ను కలిశారు. మూడు ప్రాజెక్టులపై కూడా చర్చించినట్లు ప్రచారం జరిగింది.
పార్టీ కంటే.. సొంత ప్రచారానికే ప్రాధాన్యం..
ఐదారేళ్లుగా వైసీపీతో స్నేహం కొనసాగిస్తున్న ఆర్జీవీకి పార్టీ బలోపేతం కంటే.. సొంత ప్రచార యావే ఎక్కువ. తరచూ తాను వార్తల్లో ఉండేందుకే ఆర్జీవీ ప్రాధాన్యం ఇస్తున్నారు. జనం, నిర్మాతలు, హీరో హీరోయిన్లు తనను మర్చిపోతున్నారనుకుంటున్న సమయంలో ఏదో ఒక సెన్షేషన్ క్రికేట్ చేస్తారు. తాజాగా బిగ్‌బాస్ బ్యూటీలు అయానా, ఆషురెడ్డితో చేసిన వీడియోలు అందులో భాగమే. గతంలో ఇనయతో కూడా ఇలాంటి వీడియోనే రిలీజ్ చేశారు. వేళ్లు చీకడం, కాళ్లు నాకడం, కింద నుంచి కెమెరాలు పెట్టి ఫొటోలు తీయడం ద్వారా పాజిటివ్ లేదా నెగెటివ్ ఏదో ఒక ప్రచారం తన గురించి జరగాలని ఆర్జీవీ భావిస్తారు.

ఓటర్లపై ప్రభావం చాలా తక్కువ..
ఆర్జీవీ వైసీపీలో ఉన్నా ఆయన వచ్చే ఎన్నికల్లో పెద్దగా ఓట్లు రాల్చే అవకాశం లేదు. ఎందుకంటే తరచూ వివాదాలతోనే ప్రచారంలో ఉండే ఆర్జీవీని జనం పెద్దగా పట్టించుకోరు. ఆ విషయం ఆర్జీవీకి కూడా తెలుసు. కాకపోతే వైసీపీ నేతలు ఆయన ద్వారా సినిమాలు తీయించడానికి మాత్రమే తమ పంచనే ఉంచుకుంటున్నారు. సినిమాల ప్రభావం ప్రజలపై ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎన్నికల నాటికి రెండు మూడు సినిమాలు రిలీజ్ చేయాలన్న ప్లాన్‌లో వైసీపీ అధిష్టానం ఉంది.