YSRCP legislative council support: ఏపీ అసెంబ్లీ సమావేశాలు( AP assembly session ) ముగిశాయి. సుదీర్ఘ సమావేశాలు తర్వాత నిన్ననే నిరవధికంగా వాయిదా పడ్డాయి. అయితే శాసనసభ తో పోల్చుకుంటే మండలిలో వాడీ వేడీ చర్చ నడిచింది. మండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉండడంతో గట్టి వాదనలే వినిపించింది. ఆ పార్టీకి మెజారిటీ ఉండడం.. మండలి చైర్మన్ మోసేన్ రాజు అదే పార్టీ నేత కావడం.. ఇలా అన్నీ కలిసి వచ్చాయి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి. అయితే కూటమి ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గలేదు. మండలి వేదికగా చేసుకొని గట్టి వాయిస్ వినిపించ గలిగింది కూటమి ప్రభుత్వం. అయితే గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ పార్టీకి ఇదే పరిస్థితి ఎదురయింది. కానీ దానిని ఎదుర్కోలేక అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే అది అమలు కాలేదు కానీ.. జగన్ కోరుకున్న విధంగా జరిగి ఉంటే ఏపీలో శాసనమండలి అనేది కనుమరుగు అయ్యేది.
మండలిలో టిడిపి హవా..
2014లో రాష్ట్ర విభజన జరిగింది. నవ్యాంధ్రప్రదేశ్ కు తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) అధికారంలోకి వచ్చింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం 67 సీట్లతో గౌరవమైన స్థానాలను దక్కించుకుంది.. అధికార పార్టీతో ధీటుగా ముందుకెళ్లింది. అయితే అప్పుడే శాసనమండలి ఏర్పాటు కావడంతో.. మెజారిటీ ఎమ్మెల్సీ స్థానాలను టిడిపి సొంతం చేసుకుంది. అలా శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ పటిష్టమైన స్థితిలో ఉండేది. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో ఓడిపోయింది తెలుగుదేశం. కానీ శాసనమండలిలో మాత్రం ఆ పార్టీ బలం అలానే కొనసాగింది.
మండలి రద్దుకు యోచన..
2019లో అధికారంలోకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముందుకు సాగింది. అయితే కొన్ని రకాల నిర్ణయాలతో పాటు తీర్మానాలకు శాసనమండలిలో బ్రేక్ కలిగేది. ఎందుకంటే అప్పట్లో టిడిపికి చెందిన శాసనమండలి చైర్మన్ ఉండేవారు. పైగా టిడిపి ఎమ్మెల్సీలు అంతా గరుడుగట్టిన పార్టీ వాదులే. అప్పట్లో శాసనమండలిని తన చేతుల్లోకి తెచ్చుకునేందుకు జగన్మోహన్ రెడ్డి చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే తెలుగుదేశం సభ్యులు ప్రలోభాలకు లొంగలేదు. దీంతో ఎప్పటికప్పుడు అనేక అంశాలకు చుక్కెదురు తగిలేది వైయస్సార్ ప్రభుత్వానికి శాసనమండలిలో. అయితే దీనిని ఎంత మాత్రం జీర్ణించుకోలేకపోయారు జగన్మోహన్ రెడ్డి. శాసనమండలితో అనవసర ఖర్చు అని.. దానిని రద్దు చేయాలని కోరుతూ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. కానీ అనేక రకాలైన టెక్నికల్ అంశాలతో అప్పట్లో కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అదే శాసనమండలి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక వేదిక అయింది.
టిడిపి ఆలోచన అది కాదు…
అయితే వైయస్సార్ కాంగ్రెస్ లా ఆలోచన చేయలేదు కూటమి ప్రభుత్వం. తక్కువమంది, పరిమిత సంఖ్యలో ఎమ్మెల్సీలు ఉన్నా.. తమ వాదనలను గట్టిగానే వినిపిస్తోంది ప్రభుత్వం. వైసీపీ మాదిరిగా శాసనమండలిని రద్దు చేయాలన్న ఆలోచన చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో సైతం తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి. టిడిపి కోరుకున్న రాజకీయ ప్రయోజనాలను కల్పిస్తోంది కేంద్రం. ఇప్పుడు చంద్రబాబు గట్టిగా కోరుకుంటే శాసనమండలిని రద్దు చేసేందుకు కేంద్రం కూడా సహకరిస్తుంది. అయితే అంతటి సాహసం చేయరు చంద్రబాబు. ఎందుకంటే రాజకీయాలు ఎలా మారుతాయి? ఏ వేదిక ఎప్పుడు అవసరమో? చంద్రబాబుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. రాజకీయం అంటే అదే..