Pawan Kalyan- BJP: ఏపీలో 2014 ఎన్నికల పొత్తును రిపీట్ చేయాలని పవన్ భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని పదే పదే చెబుతున్నారు. టీడీపీ, బీజేపీతో కలిసి నడిచేందుకు సిద్ధపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అందుకు బీజేపీ నుంచి మాత్రం అంత సానుకూలత వ్యక్తం కావడం లేదు. ఆ పార్టీ జనసేన వరకూ ఓకే చెబుతున్నా టీడీపీ విషయంలో అభ్యంతరాలు తెలుపుతోంది. వైసీపీ, టీడీపీకి సమదూరం పాటించాలని రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏకంగా రాజకీయ తీర్మానం చేశారు. అయితే అదే సమయంలో బీజేపీ ఒక ప్రకటన నుంచి వెనక్కి తగ్గడం చర్చనీయాంశంగా మారింది. పవన్ వ్యూహంలో భాగంగానే రాష్ట్ర బీజేపీ నాయకులు ఆ ప్రకటన చేయలేకపోతున్నారన్న టాక్ వినిపిస్తోంది.

పవన్ నాలుగు వ్యూహాలతో ముందుకు సాగుతున్నట్టు విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఒకటి ఒంటరిపోరు, రెండూ బీజేపీ, టీడీపీతో అలయెన్స్ ఏర్పాటుచేయడం, మూడు కేవలం బీజేపీతో కలిసి నడవడం, లేకుంటే టీడీపీతో మాత్రమే పొత్తు పెట్టుకోవడం. అందుకే పవన్ విభిన్న స్టేట్ మెంట్లు ఇస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైసీపీ విముక్త ఏపీయే తన ధ్యేయమని.. అందు కోసం అన్నిపక్షాలను ఏకం చేస్తానని ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలినివ్వనని చెప్పడం ద్వారా పొత్తు సంకేతాలిచ్చారు. ఇచ్చిపుచ్చుకున్నప్పుడు ‘గౌరవం’ దక్కితేనే అని వ్యాఖ్యానించి సీట్లు డిమాండ్ తెరపైకి తెచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతదాకైనా వెళతానని చెప్పి కేంద్రానికి అల్టిమేటం ఇచ్చారు. అయితే ఇవన్నీ వ్యూహంలో భాగంగానే చేసిన వ్యాఖ్యలుగా తెలుస్తోంది. అటు బీజేపీని, ఇటు టీడీపీని తన గ్రిప్ నుంచి జారుకోకుండా.. అవి వేరుపడలేక ఉంచేందుకేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ ఎన్నికల్లో బీజేపీతో మాత్రమే కలిసి వెళితే జగన్ మరోసారి లబ్ధి పొందుతారని పవన్ కు తెలుసు. అందుకే ఆయన టీడీపీతో కలిసి నడిస్తేనే.. అది బీజేపీతో తమతో వస్తే ఏకపక్ష విజయం సొంతమవుతుందని భావిస్తున్నారు. ఓట్లు, సీట్లు పరంగా గౌరవమైన స్థానానికి చేరుకుంటానని అంచనాకు వస్తున్నారు. బీజేపీ మాత్రం అందుకు ససేమిరా అంటోంది. ఏకంగా రాష్ట్ర కార్యవర్గ తీర్మానంలో వైసీపీ, టీడీపీకి సమదూరమని రాజకీయ తీర్మానం చేసింది. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీచేస్తామని ప్రకటించేందుకు సిద్ధపడింది. ఇంతలో జనసేన 57 స్థానాల్లో బలంగా ఉందన్న సంకేతం పవన్ అండ్ కో నుంచి బీజేపీకి వెళ్లింది. దీంతో 175 సీట్ల ప్రకటన పక్కకు వెళ్లిపోయింది. అదే ప్రకటన చేస్తే పవన్ ను తాము చేజేతులా దూరం చేసుకున్నామన్న అపవాదును మూటగట్టుకోవాల్సి వస్తుందని బీజేపీ నేతలు భావించి ఆ ప్రకటనను వాయిదా వేసుకున్నారు.

పవన్ చివరి వరకూ బీజేపీ కోసం వేచిచూసే ధోరణితో ఉన్నారు. అలా అనే దానికంటే చివరి వరకూ బీజేపీ ఎటూ తేల్చుకోకపోవమే శ్రేయస్కరంగా భావిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీ ఏపీలో బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అదే జరిగితే ఫస్ట్ మైనస్ పవన్ కే. బీజేపీ భావజాలానికి దగ్గరగా ఉన్నందునే ఎక్కువ మంది పవన్ వైపు కన్వెర్ట్ అయ్యారు. గత ఎనిమిదేళ్లుగా బీజేపీ ఎటువంటి ప్రభావం చూపకపోవడంతో వారంతా పవన్ నే నమ్ముకున్నారు. ఇప్పుడు కానీ బీజేపీ తన నుంచి దూరమైతే.. తన నుంచి కొంత ఓటు షేర్ దూరమవుతుందని కూడా పవన్ అంచనాకు వచ్చినట్టు విశ్లేషణలు వస్తున్నాయి. అందుకే బీజేపీకి ఆ చాన్స్ ఇవ్వకూడదని.. చివరి వరకూ అలానే కొనసాగాలన్నది పవన్ వ్యూహంగా తెలుస్తోంది.