YCP MLAs Graph: వచ్చే ఆరు నెలల్లో గ్రాఫ్ పెంచుకోండి. ప్రజల మధ్యే ఉండి వారి అభిమానాన్ని చూరగొనండి. గ్రాఫ్ పెంచుకోకుంటే మిమ్మల్ని పక్కన పెట్టేస్తా. మీ భారం భరించేందుకు నేను సిద్ధంగా లేను. అవసరమైతే మీ స్థానంలో వేరొకరిని తీసుకుంటా.. వైసీపీ ఎమ్మెల్యేలకు, నేతలకు పార్టీ అధినేత జగన్ ఇచ్చిన అల్టిమేటం ఇది. ఇటీవల నిర్వహించిన పార్టీ వర్క్ షాపులో సైతం స్పష్టమైన హెచ్చరికలు జారీచేశారు. అయితే… గ్రాఫ్ పెంచుకోవడం ఎలా? ప్రజల్లో మార్కులు వేయించుకోవడం ఎలా? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియక అధికార పార్టీ ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. మల్లగుల్లాలు పడుతున్నారు. ఎందుకంటే… పేరుకే ఇది వైసీపీ సర్కారు! కానీ… అందులో సర్వం జగన్మోహన్ రెడ్డే! మంత్రులూ చేస్తున్నదేమీ లేదు. పాలన, పథకాలు, విధానాలు, నిర్ణయాలు… అన్నీ తాడేపల్లి కేంద్రంగానే జరుగుతున్నాయి. పెట్టుబడులు లేవు. అభివృద్ధి లేదు. రోడ్లు వేయలేదు. ఇళ్లు కట్టలేదు. ఏం చేయాలన్నా డబ్బుల్లేవు. పల్లెల్లో పెండింగ్‌లో ఉన్న చిన్న చిన్న పనులు చేయడానికీ నిధులు అందుబాటులో లేవు. అలాంటప్పుడు… క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఏం చేయాలి? ప్రజలకు ఏం చెప్పాలి? అని వైసీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు.
గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యేలకు ప్రజలు చుక్కలు చూపించారు. కార్యక్రమంలో భాగంగా కొందరు ఎమ్మెల్యేలు ప్రజలకు జరిగిన వ్యక్తిగత లబ్ధి గురించి చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మాకు ఇస్తున్నది సరేగానీ… సమస్యల మాటేమిటి? అని జనం ఎదురు తిరుగుతున్నారు. ప్రధానంగా తాగునీరు, రహదారులు, మురుగునీటి కాలువలు, ఇసుక సమస్య, విద్యుత్తు చార్జీల పెంపుదల, చెత్త పన్ను, ఆస్తిపన్ను పెంపు, ధరల పెరుగుదల, రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం… వంటి అంశాలపై ఎమ్మెల్యేలను జనం నిలదీస్తున్నారు.
Also Read: YCP Leaders: వైసీపీ నేతల ఉసురుతీస్తున్న సర్కారు.. బిల్లులు చెల్లించకపోవడంతో బలవన్మరణాలు
ప్రత్యేక హోదా నుంచి జాబ్ క్యాలెండర్ ప్రకటన వరకూ… మాటతప్పి, మడమ తిప్పిన అంశాలను గుర్తు చేస్తున్నారు. బుధవారం ‘గడప గడపకు’ కార్యక్రమంపై వర్క్‌షాప్ పెట్టిన జగన్… ఇవేవీ పట్టించుకోలేదు. ‘మేం చేస్తున్న సంక్షేమం గురించి చెప్పండి. ఇంటింటికీ జరిగిన లబ్ధి గురించి వివరించండి’ అని ఆదేశించారు. సమస్యల గురించి అడిగితే… ‘వాటిపై ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇవ్వండి’ అని సలహా ఇచ్చారు. ఇదేమాట తాము ప్రజలకు చెబితే… ‘రియాక్షన్’ ఎలా ఉంటుందో ఊహించుకుని ఎమ్మెల్యేలు బెంబేలెత్తుతున్నారు. పాలనా లోపాలకు ఎమ్మెల్యేలు ఎలా బాధ్యత వహిస్తారు? పడిపోతున్నది మా గ్రాఫా… ముఖ్యమంత్రి గ్రాఫా? ఏ ఇంటికి వెళ్లినా సమస్యలపై నిలదీస్తున్నారు. మారాల్సింది ఎమ్మెల్యేలు కాదు. ముఖ్యమంత్రే అని పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
మీరు ఏం బాధలు పడతారో నాకు తెలియదు. ప్రజల మధ్యే ఉండాలని జగన్ ఎమ్మెల్యేలకు హితబోధ చేస్తున్నారు. తమకు నియోజకవర్గాల్లో ఎదురవుతున్న నిలదీతలు, ప్రశ్నల గురించి ఎమ్మెల్యేలు ప్రస్తావిస్తే..సీఎం జగన్ టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు. బిల్లులు రావడం లేదని.. నీళ్లు.. రోడ్ల కోసం తంటాలు పడుతున్నారని… సంక్షేమ పథకాల్లో లబ్దిదారులకు కోత విధిస్తున్నారని ఇలా అనేక రకాలుగా ఎమ్మెల్యేలు సమస్యలు చెప్తే.. అవన్నీ జగన్ తీసి పడేస్తున్నారు. వాటన్నింటికీ నవరత్నాల్లో నిధులు కేటాయిస్తున్నాముగా.. అంటూ తేలిగ్గా తీసుకుంటున్నారు.
అధినేత తీరును చూసి ఎమ్మెల్యేలు ఆశ్చర్యపోయారు. వాటిపైనే తమను నిలదీస్తూంటే.. అవేమీ సాధ్యం కాదని జగన్ చెప్పడంతో తాము ప్రజలకు ఏమి చెప్పుకోవాలన్న డైలామాలో వారు పడిపోయారు. నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు.. ఇంకా పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇలా అనేక అంశాలపై జగన్‌ది దబాయింపే కానీ.. సమస్యను పరిష్కారం చేసే ప్రయత్నం చేయలేదు. తనపై ప్రజలకు మంచి నమ్మకమే ఉందని.. మీపైనే లేదంటూ ఎమ్మెల్యేలపై నెట్టేయడంపై నేతలు మధనపడుతున్నారు. తమ వైపు నుంచి మార్చుకోవడానికి ఏముందని ప్రశ్నిస్తున్నారు.. సమస్య అంతా ప్రభుత్వం వైపు నుంచే ఉందని.. తాము ఎంత ప్రజలకు అందుబాటులో ఉన్నా.. ప్రజలు అడిగిన పనులను ప్రభుత్వం చేయకపోతే ఎలా అని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. తప్పంతా ప్రభుత్వానిది అయితే తమను నిందిస్తారేమిటని ఎమ్మెల్యే లోపల అనుకుంటున్నారు కానీ బయటపడలేకపోతున్నారు. తమను వ్యూహం ప్రకారం బలిపశువుల్ని చేస్తున్నారని అనుకుంటున్నారు.
Also Read: Venkatapalem TTD Temple: అమరావతిపై అదే అక్కసు.. శ్రీవారి విగ్రహ ప్రతిష్ఠకు సీఎం జగన్ డుమ్మా