ఏపీలో ప్రతిపక్షం వీక్ అయ్యింది. ప్రజల ఇచ్చిన తీర్పుతో విజయగర్వంతో ఉన్న జగన్ ను కలిసి ‘ఇది తప్పు’ అని చెప్పే ధైర్యం ఇప్పుడు ఎవరికి లేవు. మరి ఎలా? అప్రతిహతంగా దూసుకుపోతున్న ఆ పిల్లి మెడలో గంట ఎవరు కట్టారు.? కానీ జగన్ సన్నిహితుడే కట్టాడు. అదే ఆశ్చర్యం ఇప్పుడు?
సాధారణంగా జగన్ అంటే ప్రాణమిచ్చే ఎమ్మెల్యేలు వైసీపీ కేబినెట్ లో కొందరు ఉన్నారు. వారికి జగన్ మంత్రి పదవి సామాజికకోణంలో ఇవ్వకపోయినా.. వేరే ఇతర నామినేటెడ్ పదవులు ఇచ్చి సంతృప్తి పరిచాడు. అలాంటి వారే చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. జగన్ పై విమర్శలకు మొదట స్పందించి ప్రత్యర్థులను ఉతికి ఆరేసే ఈయన తాజాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేఖ రాయడం పెను సంచలనమైంది.
తాజాగా ఏపీలో సచివాలయవ్యవస్థలో కీలక మార్పులు చేశారు జగన్. పంచాయతీ రాజ్ శాఖ పరిధిలోని ఈ వ్యవస్థలో ఇన్నాళ్లు పంచాయతీ కార్యదర్శులు అన్నింటిని నిర్వహించేవారు. ఇప్పుడు వారిని తొలగించి జీవో నంబర్ 2 జారీ చేసి ఆ బాధ్యతలను వీఆర్వోలకు అప్పగించారు.
అయితే వీఆర్వోలన్నా.. రెవెన్యూ వ్యవస్థ అన్నా అవినీతిమయం అన్న సంగతి అందరికీ తెలిసిందే. సీఎం కేసీఆర్ ఏకంగా వీఆర్వోల వ్యవస్థనే రద్దు చేసేశారు. అలాంటి వీఆర్వోల చేతికి కీలకమైన గొప్ప సంస్కరణ అయిన సచివాలయ వ్యవస్థల బాధ్యతలు అప్పగించడంపై పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు.
అయితే జగన్ తీసుకున్న ఈ నిర్ణయం శుద్ధ తప్పు అని.. మంచి వ్యవస్థను అవినీతిమయంగా మారుస్తోందన్న ఆవేదన, ఆక్రోషణ అందరిలో ఉంది. కానీ జగన్ కు వ్యతిరేకంగా ఏ మంత్రి, ఎమ్మెల్యే స్పందించలేదు. కానీ తొలి సారి జగన్ కు అత్యంత సన్నిహితుడైన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దీనిపై ఏకంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డికి లేఖ రాశారు. పంచాయతీ రాజ్ కార్యదర్శుల హక్కులు కాలరాయడం తప్పు అని.. వీఆర్వోలను ఈ వ్యవస్థలోకి దించడం అవినీతికి ఆస్కారంగా ఉంటుందని.. జీవోనంబర్ 2ను రద్దు చేయాలని వైసీపీ ఎమ్మెల్యేనే ప్రభుత్వానికి లేఖ రాయడం సంచలనమైంది. ఇప్పుడీ పరిణామం ఏపీ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.