https://oktelugu.com/

జగన్ వ్యూహంలో దిగ్గజాలకు చోటు లేదా?

ఒకప్పటి జగన్‌ వేరు.. ఇప్పటి జగన్‌ వేరు. ఎన్నికలకు ముందు జగన్‌కు తెలిసింది వేరు.. ఇప్పుడు ఆయనకు నేర్చుకుంది వేరు. ఒకవిధంగా చెప్పాలంటే జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక పూర్తి రాజకీయ పరిపక్వత సాధించినట్లుగా చెప్పాలి. ఆ తేడా స్పష్టంగా కనిపిస్తోంది కూడా. సాధారణంగా ప్రాంతీయ పార్టీ అంటే ఆ పార్టీ అధినేతదే ఫైనల్‌ నిర్ణయం. దీనిని ఎవరూ కాదనేది లేదు కూడా. అలా అనీ ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటే కూడా క్యాడర్‌‌ దూరం అయ్యే ప్రమాదం […]

Written By: , Updated On : April 1, 2021 / 10:39 AM IST
Follow us on

Jagan
ఒకప్పటి జగన్‌ వేరు.. ఇప్పటి జగన్‌ వేరు. ఎన్నికలకు ముందు జగన్‌కు తెలిసింది వేరు.. ఇప్పుడు ఆయనకు నేర్చుకుంది వేరు. ఒకవిధంగా చెప్పాలంటే జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక పూర్తి రాజకీయ పరిపక్వత సాధించినట్లుగా చెప్పాలి. ఆ తేడా స్పష్టంగా కనిపిస్తోంది కూడా. సాధారణంగా ప్రాంతీయ పార్టీ అంటే ఆ పార్టీ అధినేతదే ఫైనల్‌ నిర్ణయం. దీనిని ఎవరూ కాదనేది లేదు కూడా. అలా అనీ ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటే కూడా క్యాడర్‌‌ దూరం అయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. అధినేత నిర్ణయాలపైనే ఒకవిధంగా పార్టీ మనుగడ ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అయితే.. పార్టీ అన్నప్పుడు ఆ పార్టీలోని సీనియర్లు తమ అనుభవాలతో కొన్ని సలహాలు, సూచనలు అధినేతకు చెబుతుంటారు. ఏపీలో వైసీపీలో చాలామంది సీనియర్ నేతలే ఉన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వద్ద పనిచేసిన వారూ అందులో ఉన్నారు. వయసు రీత్యా కూడా వారు జగన్ కంటే పెద్దవారు. రాజకీయంగా అనుభవంలోనూ సీనియర్లు. సహజంగా తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ వీరిపైనే ఎక్కువ ఆధారపడతారని అందరూ భావించారు. సీనియర్ నేతలు సైతం తాము చక్రం తిప్పొచ్చని కలలు కన్నారు. కానీ.. వారి అంచనాలన్నీ జగన్ తలకిందులు చేస్తున్నారు.

ఇందుకు ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికలే నిదర్శనమని అంటున్నారు నిపుణులు. మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను జగన్ అందరి నేతలకు అప్పగించారు. కొన్ని జిల్లాలను సీనియర్ నేతలకు, మంత్రులకు అప్పగించారు. సహజంగా ఇన్‌చార్జి మంత్రులు, సీనియర్ల వద్దకు నేతలు క్యూ కడతారు. తమకు పదవులపై హామీ ఇవ్వాలని పట్టుబడతారు. ఏ పార్టీలోనైనా సహజంగా జరిగేది ఇదే. వైసీపీలో కూడా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సీనియర్ నేతలు, మంత్రులు అనేక మందికి హామీలు ఇచ్చారు. మేయర్లు, చైర్మన్లు చేస్తామని చెప్పారు. అయితే.. వారు తమ వర్గాన్ని కాపాడుకునేందుకే ఇలాంటి హామీలు ఇచ్చి ఉండొచ్చు.

కానీ.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రం జగన్ సీనియర్ నేతలను, మంత్రులను దూరం పెట్టారు. వారు చేసిన సిఫార్సులను లెక్కలోకి తీసుకోలేదు. జగన్ సామాజికవర్గాల ఆధారంగానే కొత్త వారికి అవకాశమివ్వడంతో సీనియర్ నేతలు సైతం అవాక్కయ్యారు. దీంతో మంత్రులకు సైతం కొన్ని చోట్ల భంగపాటు తప్పలేదు. తాము మాటిచ్చిన వారికి సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. ఇక ఎమ్మెల్యేలకు కూడా జగన్ షాకిచ్చారు. వారి నియోజకవర్గాల్లో జరిగిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కూడా మేయర్, చైర్మన్లను స్వతహాగా తానే ఎంపికచేశారు. దీంతో సీనియర్ నేతలు, మంత్రులు ఇంకా జగన్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారట.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్