Visakhapatnam
Visakhapatnam: విశాఖ నగరం రద్దీగా మారుతోంది. బుగ్గ కార్లు రయ్ రయ్ మంటూ నగరంలో హోరెత్తిస్తున్నాయి. అప్పుడే విశాఖకు రాజధాని శోభ వచ్చేసిందా? అన్నంత రీతిలో వాహన శ్రేణి సందడి చేస్తున్నాయి. కాన్వాయ్ తో మంత్రులు, కీలక నేతలు హల్చల్ చేస్తున్నారు. విజయదశమి నుంచి విశాఖ నుంచి పాలన ఉంటుందని సీఎం జగన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మరి సీఎం ఎక్కడుంటే. మంత్రులు సైతం అక్కడే ఉండాలి. ఈ తరుణంలో సాగర నగరానికి మంత్రుల తాకిడి పెరిగింది. విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు కాన్వాయ్లు తిరుగుతూనే ఉన్నాయి.
ప్రస్తుతం ఏపీ క్యాబినెట్లో పాతిక మంది మంత్రులు ఉన్నారు. ఇందులో ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు ఆరుగురు. వీరు తమ స్వస్థలాల నుంచి రాకపోకలు సాగించే అవకాశాలు ఉన్నాయి. మిగతా మంత్రులు మాత్రం విశాఖలో నివాసం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే దాదాపు మంత్రులంతా విశాఖలో ఇళ్లను కొనుగోలు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సొంతిల్లు లేని వారు మాత్రం అద్దె ఇళ్ల కోసం అన్వేషిస్తున్నారు. ప్రధానంగా బీచ్ రోడ్ లో ఇళ్ల కోసం ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు.
విశాఖ సిటీ ఆఫ్ డెస్టినీ గా పేరుగాంచింది. పర్యాటకంగా చూడముచ్చటైన నగరం. అందుకే ఇక్కడ నివాసం ఉండేందుకు ఎలాంటి వారైనా మొగ్గు చూపుతారు. దీంతో ఒక ఇల్లు ఉంటే ఏముందన్న భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇప్పుడు మంత్రులకు అవకాశం రావడంతో సొంత ఇంటి కల సాకారం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం మాత్రం వివిధ మంత్రిత్వ శాఖలకు విశాఖలో ఉన్న ప్రభుత్వ ఖాళీ భవనాలను సేకరించే పనిలో ఉంది. తొలుత సీఎం జగన్ తో పాటు కీలక మంత్రిత్వ శాఖల యంత్రాంగం విశాఖ రానున్నట్లు తెలుస్తోంది. దీంతో నగరంలో ప్రభుత్వ భవనాలకు ముందే రిజర్వ్ చేసి పెట్టేశారు.
మరోవైపు రుషికొండలో నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. భవనాల నిర్మాణం తో పాటు రహదారులను ఏర్పాటు చేస్తున్నారు. ఓ ఆరు భవనాల్లో సీఎం క్యాంప్ ఆఫీస్ తో పాటు ఆయన నివాసం, కొన్ని కీలక శాఖలకు కూడా కేటాయింపులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. మరోవైపు నగరానికి అధికారుల తాకిడి కూడా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఇటీవల నగరానికి వచ్చారు. ఏర్పాట్లను సమీక్షించి వెళ్లారు. పట్టుమని నెలరోజులు కూడా లేకపోవడంతో.. రేయింబవళ్లు పనులు చేపడుతున్నట్లు తెలుస్తోంది.