YCP Leaders Protest: ‘మా అక్క మనసు మంచిది. మేలిమి బంగారం. అధికార పక్షం ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా నా వెంటే నడిచింది. దేవుడు కరుణించి మనం అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తానని సభా ముఖంగా ప్రకటిస్తున్నాను’..2019 ఎన్నికల సమయంలో అప్పటి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో విపక్ష నేతగా సీఎం జగన్ చేసిన ప్రకటన ఇది. ‘మా అన్న నా వెంటే నడిచాడు. కష్టకాలంలో కూడా తోడూ నీడగా నిలిచాడు. భగవంతుడు దయతలచి అధికారంలోకి వస్తే అన్నకు మంత్రి పదవి ఇచ్చి గౌరవిస్తా’..విశాఖ జిల్లా చోడవరంలో కరణం ధర్మశ్రీని ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలివి. ఇలా ఏ జిల్లాకు వెళ్తే ఆ జిల్లా నాయకుల పేర్లను జగన్ మంత్రులుగా ప్రకటించేశారు. ఇప్పుడవే జగన్ మెడకు చుట్టుకుంటున్నాయి. తొలి మంత్రివర్గంలో అప్పుడే అధికారంలోకి వచ్చాము కదా.
అధినేతకు చిక్కులు తేవడం మంచిది కాదని చాలా మంది ఎమ్మెల్యేలు సర్థుకున్నారు. తామ భుజాన్ని తామే తడుముకొని సర్థి చెప్పుకున్నారు. మంత్రివర్గ విస్తరణ చేపడితే తప్పకుండా పదవి దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. తీరా పదవి దక్కపోయే సరికి నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. ఇన్నాళ్లూ అధినేత పట్ల ప్రదర్శించిన వీరవిధేయత కట్టుదాటింది. తమలో ఉన్న అసంత్రుప్తిని నేతలు వెల్లడించడం ప్రారంభించారు. మలి విడత మంత్రివర్గ విస్తరణలో చోటిస్తామని మాటిచ్చి తప్పారని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. 2019 జూన్ 8న జరిగిన తొలి మంత్రివర్గ కూర్పులో చోటు దక్కనివారికి రెండున్నరేళ్ల తర్వాత మలి విడతలో పదవులు వస్తాయని హామీ ఇచ్చి చేయిచ్చారని మండిపడుతున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రెండోదఫాలో చోటిస్తామంటూ అధిష్ఠానం హామీ ఇచ్చిం ది. దీంతో.. ఆయన గంపెడాశలు పెట్టుకున్నారు. తీరా ఇప్పుడు అవకాశం ఇవ్వకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆదివారం నుంచి ఫోన్ స్విచాఫ్ చేసుకుని కూర్చున్నారు. ఏకంగా పార్టీకే గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read: AP New Cabinet Ministers: అమాత్యులు.. ఊరికే కాలేదు.. అందలం వెనుక సుదీర్ఘ పోరాటం
కోటరీపై నేతల గుస్సా
ఎన్‌టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా ఇదే తరహాలో జగన్ తనకు హ్యాండిచ్చారని ఆక్రోశిస్తున్నారు. పాత మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని.. కోటరీగా ఏర్పడి తనకు పదవి దక్కకుండా అడ్డుపడ్డారని ఆరోపిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు సీనియర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కొరుముట్ల శ్రీనివాసులు మళ్లీ ఆశాభంగంతో తీవ్ర నిరాశలో మునిగిపోయారు. తనకు తొలి విడతలోనే ఇస్తానని అధిష్ఠానం హామీ ఇచ్చి మాట తప్పిందని.. రెండో దఫా కూడా ఇవ్వకపోవడంతో కృష్ణాజిల్లా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి భోరుమన్నారు. తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. అధిష్ఠానం దూతగా ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు రాయబారం నెరిపారు. ఉదయభాను, పార్థసారథితో ఆయన జరిపిన మంతనాలు ఫలించలేదు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిదీ ఇదే పరిస్థితి. జిల్లాలో తొలినుంచీ తాను వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి, అనంతరం జగన్‌కు తోడుగా ఉంటూ వచ్చానని.. తనకు మంత్రి పదవి ఇస్తానని రెండుసార్లూ చేయిచ్చారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అనకాపల్లిజిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా తనకు రెండోదశలో మంత్రి పదవిని ఇస్తామంటూ ఎంపీ విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారని.. కానీ నెరవేర్చలేదని వాపోతున్నారు. నిజానికి వీరందరూ మొన్నటిదాకా జగన్‌కు వీర విధేయులుగా మెలిగారు. కానీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో చోటు దక్కకపోయేసరికి వీరావేశంతో ఊగిపోతున్నారు. మంత్రి పదవులు దక్కని ఎమ్మెల్యేలు.. వారి అనుచరులూ ఆగ్రహావేశాలతో రాస్తారోకోలు దిగడమే కాకుండా.. మొన్నటి వరకూ జగన్‌కు పాలాభిషేకాలు చేసిన చేతులతోనే ఆయన దిష్టిబొమ్మలు దహనం చేసేందుకు వెనుకాడటంలేదు.
సీఎం సొంత సామాజికవర్గంలో గుర్రు
రాయలసీమలో అందునా సీఎం సొంత సామాజికవర్గంలో ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. నంద్యాల జిల్లా నుంచి మంత్రి పదవిని ఆశించిన శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి వర్గీయులు ఇప్పుడు జగన్ పేరెత్తితేనే ఆవేశంతో చెలరేగిపోతున్నారు. మంత్రి పదవి మీకేనంటూ చివరిదాకా ఊరించిన తిప్పేస్వామికి చేయివవ్వడంపై ఆయన అనుచరులు మండిపడుతున్నారు.హోం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మహిళ ఎమ్మెల్యే మేకతోటి సుచరితను అర్ధాంతరంగా తొలగించడాన్ని ఆమె అనుచరులు అవమానంగా భావిస్తున్నారు.
సుచరిత ఏకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. వీటన్నింటికంటే ముఖ్యంగా జగన్‌కు సమీప బంధువు కూడా అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి అలక పాన్పు ఎక్కడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామాతో పాటు ఏకంగా రాజకీయాలకే గుడ్‌బై చెబుతానని ప్రకటించడం జగన్ శిబిరాన్ని దిగ్ర్భాంతికి గురిచేసింది. సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే కరణం బలరాం పలు సార్లు బుజ్జగించినా ఆయన దిగిరాలేదు. చివరకు సీఎంను కలిశాక మెత్తబడ్డారు. సుచరిత వర్గీయుల మూకుమ్మడి రాజీనామాలు కొత్త మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడంపై మాజీ హోంమంత్రి సుచరిత వర్గీయుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అనుచరులు మూకుమ్మడిగా రాజీనామా అస్త్రాలు ప్రకటించారు. తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు వైసీపీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఐదుగురు కార్పొరేటర్లు ప్రకటించారు. పాత కేబినెట్‌లో ఐదుగురు ఎస్సీ మంత్రుల్లో నలుగురిని కొనసాగించి సుచరితను తొలగించడం ఏం న్యాయమంటూ ప్రశ్నించారు. సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని, తమకూ పదవులు అవసరం లేదన్నారు.
నిరసనలతో ప్రజానీకానికి అసౌకర్యం
ఉదయభాను, పార్థసారథికి మంత్రివర్గంలో చోటివ్వనందుకు నిరసనగా వారి అనుచరుల నిరసన సోమవారం కూడా కొనసాగింది. జగ్గయ్యపేట ప్రధాన వీధుల్లో నినాదాలు చేస్తూ కూడళ్లలో టైర్లు దహనం చేశారు. ప్రధాన రహదారులపై పెట్రోలు పోసి నిప్పుపెట్టడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ఉదయభానుకు సముచిత గౌరవం ఇవ్వాలని, లేని పక్షంలో తమకు పదవులు వద్దని, రాజీనామాలను ఆమోదించాలని వైసీపీ స్థానిక ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. విజయవాడ బందరు రోడ్డు డీవీ మేనర్ వద్ద కూడా ఉదయభాను అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. పార్థసారథి అనుచరులు నల్లబ్యాడ్జీలు ధరించి ఉయ్యూరులో నిరసన తెలిపారు. ఆయనకు సముచిత స్థానం కల్పించకపోతే పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని ప్రకటించారు. మంత్రి పదవి దక్కించుకున్న జోగి రమేశ్‌పై నిప్పులు చెరిగారు. తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధికి మంత్రివర్గంలో స్థానం దక్కనందుకు ఆయన అనుచరులు నిరసనలకు దిగారు. తిరువూరు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, సర్పంచులు, జడ్పీటీసీ, వివిధ హోదాల్లో ఉన్న డైరెక్టర్లు తమ రాజీనామాలను మండల పార్టీ కన్వీనర్ నాగ నర్సిరెడ్డికి అందజేశారు.
అన్ని చోట్ల ఉద్రిక్తతలు
అనకాపల్లి జిల్లాకు చెందిన కరణం ధర్మశ్రీకి మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడాన్ని నిరసిస్తూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు వడ్డాది కూడలిలో మానవహారం నిర్వహించి, రాస్తారోకో చేశారు. పదవి ఇవ్వకుంటే స్థానిక సంస్థలు, పార్టీ పదవులకు రాజీనామా చేస్తామని హెచ్చరించారు. కాగా, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికి మంత్రివర్గంలో చోటివ్వకపోవడాన్ని నిరసిస్తూ మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యులు శ్రీదేవి, ఖాదర్ బాషా పదవులకు రాజీనామా చేశారు. సోమవారం కమిషనర్ కు రాజీనామా లేఖలు అందజేశారు. వైఎస్ కుటుంబానికి విధేయుడిగా, విలక్షణ రాజకీయ నేతగా పేరుతెచ్చుకున్న భూమనకు పదవి ఇవ్వకపోవడంతో కలత చెందామన్నారు.
ఒంగోలులో రాస్తారోకో… బైక్ దహనం ప్రకాశం జిల్లాలో సోమవారం కూడా పెద్దఎత్తున వైసీపీ శ్రేణుల నిరసనలు కొనసాగాయి. బాలినేనికి మద్దతుగా ఒంగోలులో ఆయన అనుచరులు ర్యాలీ నిర్వహించి మంగమూరు రోడ్డు జంక్షన్‌లో రాస్తారోకో చేశారు. కొన్ని వస్తువులను దహనం చేసేందుకు సిద్ధం కాగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయం ఎదుట బైక్ తగులబెట్టి చేసి నిరసన తెలిపారు. పలు నియోజకవర్గాలకు చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఒంగోలు మేయర్ గంగాడ సుజాత తనతోపాటు పార్టీకి చెందిన అందరు కార్పొరేటర్లు సంతకాలు చేసిన రాజీనామా లేఖను విడుదల చేశారు. కంభంలో ఆర్యవైశ్యులు షాపులు మూసివేసి ర్యాలీ, రాస్తారోకో చేశారు. ఎమ్మెల్యే అన్నా రాంబాబుకి మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడాన్ని నిరసిస్తూ ఆయన అనుచరులు మార్కాపురంలో నిరసన తెలిపారు.
Also Read:CM KCR- Cabinet Extension: వైసీపీ విస్తరణ చూసి కేసీఆర్ పునరాలోచనలో పడ్డారా?