Jagan New Cabinet: సామాజిక న్యాయం పాటించాం. వెనుకబడినవర్గాలకు, తెగలకు అవకాశమిచ్చాం. ఏ ప్రభుత్వం చేయలేని విధంగా కాపు సామాజికవర్గానికి ప్రాధాన్యమిచ్చాం.. మంత్రివర్గ విస్తరణపై ప్రభుత్వ పెద్దల మాట ఇది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, కూర్పు, ఏరివేత అనేది ఆయా ప్రభుత్వాల ఇష్టం. పార్టీ ప్రయోజనాలను ద్రుష్టిలో పెట్టుకొని చేసుకోవడం వారి సొంత విషయం. ఈ విషయంలో ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రిదే నిర్ణయాధికారం. ఇది ఎవరూ తోసిపుచ్చలేని నిర్వివాదాంశం. అయితే చేసే మార్పుచేర్పులకు కనీస ప్రమాణ్యత అయినా ఉండాలి.. కులాల ప్రాతిపదికన సామాజిక సమీకరణ పేరిట అకారణంగా మంత్రులను తొలగించడమే ఇప్పుడు విమర్శలకు కారణమవుతోంది. ఇంటా బయటా ప్రశ్నల వర్షం ఉత్పన్నమవుతోంది.
మంత్రులందరితో జగన్ రాజీనామా చేయించడం వెనుక తన ఆధిపత్య ప్రదర్శన తప్ప మరో కారణం లేదన్న విమర్శలు చుట్టుముడుతున్నాయి. ఒక సామాజిక వర్గానికి చెందిన నేతను మంత్రిగా తొలగించి.. తిరిగి అదే వర్గం నాయకుడికి మంత్రి పదవి ఇవ్వడంలో సామాజిక న్యాయం ఏముందని ప్రశ్నిస్తున్నారు. వేటుపడినవారు అసమర్థులని నేరుగానే చెప్పినట్లయిందని బాధిత తాజా మాజీలే మనస్తాపంతో ఉన్నారు. 14 మంది మంత్రులను ఎందుకు తొలగించారు.. 11 మంది మంత్రులను ఎందుకు కొనసాగించారు.. కొత్తగా 14 మందిని ఎందుకు తీసుకున్నారన్న ప్రశ్నలకు సరైన సమాధానం దొరకడం లేదు. పైగా మంత్రివర్గంలో బ్రహ్మణ, వైశ్య వంటి అగ్రవర్ణాలకు ఒక్క పదవి కేటాయించకపోవడం ఆయా వర్గాల్లో ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. ముమ్మాటికీ ఇది దుశ్చర్యగా వారు అభివర్ణిస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయంగా అభివర్ణిస్తున్నారు. తాను మంచివాడిని అనిపించుకోవడానికి తన సొంత సామాజికవర్గం ప్రయోజనాలను పక్కన పెట్టిన సీఎం జగన్ పై రెడ్డి సామాజికవర్గం కారాలు మిరియాలు నూరుతోంది.
నేతలను మార్చి సమతూకమా?
అసలు మంత్రివర్గంలో సామాజిక సమతూకం ఎక్కడుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రాష్ట్రంలో శివారు జిల్లా సిక్కోలు నుంచి లెక్కలు వేసుకుంటే ధర్మాన కృష్ణదా్‌సను తప్పించి ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి కట్టబెట్టారు. దీనివల్ల రాష్ట్రానికి గానీ, వారి సామాజిక వర్గమైన పోలినాటి వెలమలకు గానీ అదనంగా కలిగిన లబ్ధి ఏమిటో తెలియదు. అదే జిల్లాకు చెందిన సీదిరి అప్పలరాజుకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా మత్స్యకార వర్గానికి మేలు చేసినట్లు గతంలో ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన్నే కొనసాగించారు. ఇదే సామాజివర్గానికి చెందిన ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్‌కు గతంలో మంత్రి పదవి ఇస్తానని జగన్ మాటిచ్చారు. ఇప్పుడు రిక్తహస్తం చూపించారు. పొన్నాడకు పదవి కట్టబెట్టకపోవడం మత్స్యకార కుటుంబాలకు అన్యాయం చేసినట్లు కాదా అన్నది ఇప్పుడు ప్రశ్న. పార్వతీపురంమన్యం జిల్లాలో ఎస్టీ సామాజికవర్గానికి చెందిన పాముల పుష్పశ్రీవాణిని డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించి.. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొరకు అప్పగించారు. విశాఖ జిల్లాలో కాపు సామాజికవర్గానికి చెందిన అవంతి శ్రీనివాస్ ను తొలగించి.. అనకాపల్లి నుంచి అదే సామాజికవర్గానికి చెందిన గుడివాడ అమర్నాథ్‌కు మంత్రి పదవి ఇచ్చారు.
తద్వారా కాపులకు జరిగిన ప్రత్యేక న్యాయం ఏమిటి.. అవంతి అసమర్థుడా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అదేవిధంగా పశ్చిమ గోదావరిలో కాపు వర్గానికి చెందిన ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) స్థానంలో అదే సామాజిక వర్గ నేత, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణను ఉప ముఖ్యమంత్రి చేయడం వల్ల లాభమేంటి? మేకతోటి సుచరితను మంత్రివర్గం నుంచి తొలగించి అదే సామాజికవర్గానికి చెందిన తానేటి వనితకు హోం శాఖ బాధ్యతలు అప్పగించడం వల్ల కలిగే ప్రత్యేక ప్రయోజనమేదీ లేదంటున్నారు. నెల్లూరు జిల్లాలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణంతో ఆయన స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టారు. నెల్లూరు అర్బన్‌కు చెందిన పి.అనిల్‌కుమార్ యాదవ్ స్థానంలో అదే వర్గానికి చెందిన తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావును మంత్రివర్గంలోనికి తీసుకున్నారు.
కృష్ణా జిల్లాలో కాపు సామాజికవర్గానికి చెందిన పేర్ని వెంకట్రామయ్య స్థానాన్ని పల్నాడు జిల్లా నుంచి అంబటి రాంబాబుతో భర్తీ చేశారు. కాకినాడ జిల్లాలో అదే సామాజిక వర్గానికి చెందిన కురసాల కన్నబాబును తప్పించి.. అదే జిల్లా, అదే వర్గం నేత, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కన్నబాబులో సామర్థ్యం కొరవడిందో.. విధేయత తక్కువైందో మరీ ఈ మార్పు ఏమిటో? ఒక ఒరలో ఒక సామాజికవర్గమే ఉండాలన్నట్లుగా వ్యవహరించడమే తప్ప.. మంత్రుల పనితీరు.. వ్యవహారశైలి.. సామర్థ్యం ఆధారంగా మార్పు చేర్పులు జరగలేదని తేటతెల్లమవుతోంది.అకారణంగా మంత్రులను తొలగించి.. వారి స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన కొత్తవారితో నింపడం వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఏమిటో జగనే చెప్పాల్సి ఉందని పేర్కొంటున్నాయి.
శాఖల మార్పు వెనుక మర్మమేమిటి?
సీనియర్ మంత్రుల శాఖల్లో మార్పు కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శాఖలను సీఎం జగన్ మార్చారు. బొత్స ఇప్పటిదాకా నిర్వహించిన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖను ఆదిమూలపు సురేశ్‌కు అప్పగించారు. సురేశ్ వద్ద ఉన్న విద్యాశాఖను బొత్సకు ఇచ్చారు. రాయలసీమలో సీనియర్ నేతగా పేరొందిన పెద్దిరెడ్డి ఇప్పటిదాకా చూసిన పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖను.. కొత్తగా కేబినెట్‌లోకి వచ్చిన బూడి ముత్యాలనాయుడికి అప్పగించారు. గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి వద్ద ఉన్న విద్యుత్, అటవీ పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పెద్దిరెడ్డికి కట్టబెట్టారు. మూడు రాజధానులు, రాజధాని అమరావతి విషయంలో ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని అమలు చేసేందుకు బొత్స సంపూర్ణ సహకారం అందిస్తూ వచ్చారు. ఇదే సమయంలో విధానపరమైన లోపాలు తలెత్తకుండా నివారించే ప్రయత్నమూ చేశారు. ఈ కారణంగానే ఆయన శాఖను మార్చారేమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read:AP New Cabinet Ministers: అమాత్యులు.. ఊరికే కాలేదు.. అందలం వెనుక సుదీర్ఘ పోరాటం