YCP
YCP: వచ్చే ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం. గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వైసిపి ప్రయత్నిస్తోంది. గెలుపు పై నమ్మకంగా ఉంది. సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్న ధీమా అధికార పార్టీలో కనిపిస్తోంది. అయితే అభివృద్ధి లేదన్న అపవాదును ఎదుర్కొంటోంది. విపక్షాలకు సైతం అదే ఆయుధంగా మారింది. దీంతో అధికార పార్టీలో ఒక రకమైన కలవరం ఏర్పడింది. దానిని అధిగమించేందుకు ఏం చేయాలన్న ఆలోచనలో వైసిపి సర్కారు ఉంది.
ఎన్నికలకు పట్టుమని పది నెలల వ్యవధి కూడా లేదు. దీంతో అధికార పక్షం పునరాలోచనలో పడింది. వీలున్నంత వరకు సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధి పనులను పట్టాలెక్కించాలని భావిస్తోంది. అయితే విపక్షాలు రాజకీయంగా దూకుడు పెంచాయి. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రజల్లో ఉంటున్నారు. యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేపడుతున్నారు. మరోవైపు పవన్ వారాహి యాత్ర నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండు విడతలు పూర్తయింది. అటు విపక్షాలకు ప్రజాదరణ పెరుగుతుండడంతో అధికార పార్టీలో ఆందోళన నెలకొంది. అందుకే ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే పనిలో పడింది.
వై నాట్ 175 అన్న నినాదంతో వైసిపి ముందుకెళ్తోంది. అయితే క్షేత్రస్థాయిలో చాలా నియోజకవర్గాల్లో లోటుపాట్లు ఉన్నాయి. వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. నేతల మధ్య టిక్కెట్లు పంచాయితీ నడుస్తోంది. కొన్నిచోట్ల తరచూ వివాదాలు జరుగుతున్నాయి. ఒకరికి సీటు ఇస్తే మరొకరు సహాయ నిరాకరణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు 70 నుంచి 80 నియోజకవర్గాల వరకు వర్గ పోరు తీవ్రంగా ఉన్నట్లు నివేదికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా పార్టీ బలోపేతంపై హై కమాండ్ ఫోకస్ పెంచింది. అందులో భాగంగా పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి రివ్యూలకు సిద్ధపడుతున్నారు.
నియోజకవర్గాల పరిశీలకులతో సజ్జల భేటీ కానున్నారు. తాడేపల్లి లోని ఫార్చ్యూన్ హోటల్ లో సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల పరిశీలకులకు ఆహ్వానాలను పంపారు. అయితే ఈపాటికే అన్ని నియోజకవర్గాల నివేదిక హైకమాండ్ కు అందింది. దీంతో పాటు పరిశీల కుల అభిప్రాయాలను సేకరించనున్నారు. ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులో పరిశీలకుల అభిప్రాయాలు కీలకం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.