Pawan Kalyan- YCP: మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్ర ప్రజల నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో ప్రాంతీయ విద్వేషాలను రగిల్చేందుకు అధికార పార్టీ రెడీ అవుతోంది. ఈ నెల 15న విశాఖ గర్జన పేరిట భారీ కార్యక్రమానికి సన్నాహాలు చేస్తోంది. అయితే దీనిపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. దాదాపు పాతిక ట్విట్లతో అధికార వైసీపీపై విరుచుకుపడ్డారు. ఎందుకీ గర్జనలు పేరిట కడిగి పారేశారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి మాట తప్పిన అంశాల వరకూ ప్రస్తావించి ఉతికి ఆరేశారు. కానీ దీనికి వైసీపీ నుంచి సరైన రిప్లయ్ రాలేదు. షరా మామ్మూలుగా వ్యక్తిగత దాడితోనే వైసీపీ నేతలు సరిపెట్టుకున్నారు. గతంలో ఇంతలా ఎప్పుడు పవన్ రియాక్టు కాలేదు. కానీ ప్రజల్లో ప్రాంతీయ వాదాన్ని రగిల్చి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నించడాన్నిపవన్ సహించలేకపోయారు. అందులో భాగంగా వరసు ట్విట్లు సంధించారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి వైసీపీ విశాఖ గర్జనకు పిలుపునిచ్చిన రోజునే సాగర నగరానికి చేరుకోనున్నారు.

అయితే పవన్ ఇంతలా కౌంటర్ ఇస్తారని వైసీపీ నాయకులు కూడా ఊహించలేదు. ఏదో ఉత్తరాంధ్ర ప్రజల్లో భావోద్వేగాలు రగుల్చుతామన్నవారి ఆశలపై పవన్ నీరు పోశారు. అదే రోజు పవన్ విశాఖ చేరుకుంటారని తెలియడంతో వారికి చెమటలు పడుతున్నాయి. అయితే ఈ విషయంలో అధికార పార్టీ నేతలకు ఎటూ పాలుపోవడం లేదు. కార్యక్రమాలు చేయమని అధిష్టానం.. చేస్తే జనసేనాని కౌంటర్లతో వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వారికి ఎటూ పాలుపోవడం లేదు. ఒక వేళ పవన్ పోటీ కార్యక్రమం నిర్వహిస్తే మాత్రంమాటలు తూటాలు పేలే అవకాశముంది. ఇప్పటికే రుషికొండ, దసపల్లా భూముల ప్రస్తావన తెచ్చిన పవన్ అధికార పార్టీ నాయకులకు గట్టి సంకేతాలే పంపారు. దీంతో పవన్ తమ జోలికి వస్తే ఎక్కడ తమ బండారం బయటపడుతుందోనని వైసీపీ నేతలు భయపడుతున్నారు. వైసీపీ నేతల గర్జన మరసటి రోజునే విశాఖలో జనసేన జనవాణి కార్యక్రమ నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది, పవన్ తో పాటు ఆ పార్టీ ముఖ్య నాయకులు ముందు రోజు చేరే అవకాశముంది. అటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా జనసేన శ్రేణులు తరలివచ్చే అవకాశాలున్నాయి.

ఉత్తరాంధ్రలో వైసీపీ నేతల కబ్జాలు, దందాలు పెరిగినట్టు మీడియాలో పతాక శీర్షికన కథనాలు వస్తున్నాయి. భయపెట్టి మరీ ఆస్తులను, భూములను స్వాధీనం చేసుకుంటున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు మూడు రాజధానులకు మద్దతు పేరిట ప్రాంతీయ వాదాన్ని రగిల్చేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో వీరి ఆగడాలను అడ్డుకునేందుకు పవన్ ప్రజాసమస్యలే అజెండాగా ముందుకొస్తున్నారు. వాటిని ప్రస్తావిస్తూనే వైసీపీ నేతల దురాగతాలను ఎండగడుతున్నారు. అటు పవన్ ను ఎలా ఎదుర్కొవాలో తెలియక అధికార పార్టీ నేతలు బిక్క ముఖం వేస్తున్నారు. మొత్తానికైతే అటు వైసీపీ నేతల కవ్వింపు.. దానికి పవన్ కౌంటర్ అటాక్ తో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కుతున్నాయి.