Nayanthara Twin Boys: వివాహమైన నాలుగు నెలలకే నయనతార దంపతులు పిల్లల్ని కన్నట్లు ప్రకటించారు. నయనతార స్వయంగా గర్భం దాల్చని క్రమంలో ఆమె సరోగసీని ఆశ్రయించారని స్పష్టంగా అర్థం అవుతుంది. అద్దె గర్భంతో తల్లి కావడంతో నయనతారపై సాంప్రదాయవాదులు మండిపడుతున్నారు. నటి కస్తూరి నయనతారపై పరోక్షంగా సెటైర్లు వేసింది. పురుటి నొప్పులకు భయపడి, శరీరం ఫిట్నెస్ కోల్పోతుందని కొందరు హీరోయిన్స్ సరోగసీ పద్దతిని వాడుకుంటున్నారు. ఇండియాలో సరోగసిని రద్దు చేయాలని ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

నయనతార దంపతులపై సర్వత్రా విమర్శలు తలెత్తుతుండగా తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. హెల్త్ మినిస్టర్ ఎంఏ సుబ్రమణ్యన్ నయనతార-విగ్నేష్ శివన్ లపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సరోగసీ చట్టంలోనే కొన్ని లోపాలు ఉన్నాయి. ప్రాధమికంగా 21 నుండి 35 సంవత్సరాల మహిళలు కుటుంబ సభ్యుల అనుమతితో సరోగసీ పద్దతిలో పిల్లల్ని కనవచ్చు. సరోగసి చట్టం నయనతార దంపతులకు వర్తిస్తుందా? లేక వారు నిబంధనలు ఉల్లగించారా? అనేది తెలియాల్సి ఉంది. దీని కోసం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ కౌన్సిల్ విచారణ చేపట్టనుందని మంత్రి వివరణ ఇచ్చారు.
2015 నుండి నయనతార-విగ్నేష్ డేటింగ్ చేస్తున్నారు. 2022 జూన్ 9న మహాబలేశ్వరంలో నయనతార వివాహం జరిగింది. ఈ వివాహానికి బాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. నయనతార వివాహాన్ని డాక్యూమెంటరీ గా చిత్రీకరించారు. ఈ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం నయనతార పెళ్ళికి సంబంధించిన డాక్యూమెంటరీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. పెళ్ళి ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో లీక్ కావడంతో హక్కులు సొంతం చేసుకున్న నెట్ఫ్లిక్స్ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేశారు.

నయనతార కవల అబ్బాయిలకు జన్మనిచ్చారని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆమె సరోగసీ పద్దతిలో పిల్లల్ని కనడం విమర్శల పాలవుతుంది. ఇండియాలో ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు సరోగసి పద్దతిలో పిల్లలు కన్నారు. మంచు లక్ష్మి, ప్రీతి జింటా, శిల్పా శెట్టి, సన్నీ లియోన్, ప్రియాంక చోప్రా అద్దెగర్భంతో తల్లులయ్యారు. విదేశాల్లో సరోగసీకి పూర్తి స్వేచ్ఛ ఉంది. ఇండియాలో కూడా కొన్ని పరిమితులతో సరోగసీని చట్టబద్దం చేయడం జరిగింది. ఈ మధ్య సరోగసీ ఆశ్రయించే వారి సంఖ్య ఎక్కువైంది.