Munugode By Election 2022: ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల.. అని ప్రజాస్వామ్యాన్ని అబ్రహం లింకన్ మహాశయుడు నిర్వచించాడు గానీ.. ఒకవేళ ఈ కాలంలో పుట్టి గనక ఉంటే, అదికూడా మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఓటర్ అయి ఉంటే.. ప్రజాస్వామ్యానికి తాను ఇచ్చిన నిర్వచనాన్ని మార్చుకునేవాడు.. ఎందుకంటే ఆ స్థాయిలో ధన ప్రవాహం ఇప్పుడు అక్కడ కట్టలు తెంచుకుంటున్నది. మొన్నటిదాకా హుజురాబాద్ ఉప ఎన్నిక దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ రికార్డును మునుగోడు బద్దలు కొట్టబోతోంది. మునుగోడు ఉప ఎన్నిక లో అన్ని పార్టీల అభ్యర్థులు పెడుతున్న ఖర్చు ఈశాన్య రాష్ట్రాల అభ్యర్థులు సాధారణ ఎన్నికల్లో పెట్టే ఖర్చుతో సమానం అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎలాగైనా గెలిచి తీరాలనే కసితో అన్ని పార్టీలు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నాయి. భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనను సామాన్యుల మదిలో నుంచి తుంచి వేస్తున్నాయి.. ఇకనుంచి ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఆగర్భ శ్రీమంతులు మాత్రమే అందుకు అర్హులనే నిర్వచనాన్ని ఇస్తున్నాయి.

అంతకుమించి
ఎప్పుడైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారో.. అప్పుడే మునుగోడులో రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. ఇతర పార్టీలకు నాయకులను కొనుగోలు చేయడం పరిపాటిగా మారింది. ఉదాహరణకు ఓ పార్టీలో ఉండేందుకు ఇటీవల ఎంపిటిసి కి ఆయన పార్టీ 5 లక్షలు ఇచ్చింది. మరునాడు ఇంకో పార్టీ వచ్చి 10 లక్షలు ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. ఆ ప్రజాప్రతినిధి ఆ డబ్బు తీసుకొని పార్టీ ఫిరాయించాడు. తాజాగా మూడో పార్టీ ఆయనకు 20 లక్షలు ఆఫర్ ఇచ్చిందని సమాచారం. ఇక ఆయన ఒక గ్రామానికి సర్పంచ్.. మొన్నటి వరకు కాంగ్రెస్ లో ఉన్నారు.. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆయన చేతిలో పెద్దగా ఓట్లు కూడా లేవు. మహా అయితే 50లోపే ఉంటాయేమో. కానీ ఓ పార్టీ నేత ఆయనకు ఏకంగా 30 లక్షలు ఇచ్చారు. అంతే ఆ సర్పంచ్ పార్టీ మారారు. ఇప్పుడు ఇతర పార్టీ కండువా కప్పుకున్నారు.
ఈ రెండు ఉదాహరణలు మునుగోడులో ధనస్వామ్యానికి నిదర్శనాలు. ఉప ఎన్నిక నేపథ్యంలో ముందుగానే నేతలను కొనేస్తున్నారు అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇంకా నామినేషన్ల ప్రక్రియ పూర్తికాలేదు. ప్రచారం కూడా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. అప్పుడే ఓటర్లకు డబ్బు పంపిణీ మొదలైపోయింది. గట్టుప్పల్, చౌటుప్పల్, మునుగోడు, సంస్థాన్ నారాయణపురం వంటి మండలాల్లో ఒక విడత డబ్బులు ఇప్పుడే పంపిణీ చేస్తున్నారు. ఓటర్ కు 1000 నుంచి పదివేల వరకు ఇస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటర్లకు ఒక పార్టీ 6000 చొప్పున, మరో పార్టీ 1500 చొప్పున ఇస్తే.. ఇప్పుడు మునుగోడులో కేవలం తొలి విడతలోనే వెయ్యి నుంచి పదివేల వరకు పంపిణీ చేస్తున్నారు. మొత్తంగా ఒక్క కుటుంబానికి 30 వేల వరకు ముట్ట చెప్పేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. నియోజకవర్గంలో ఉన్న వారికి కాకుండా పోలింగ్ రోజు వచ్చి ఓటు వేసేందుకు బయట ఉన్న వారికి కూడా ఇప్పటికే ఒక పార్టీ ఓటుకు 40 వేల చొప్పున ఆఫర్ చేసింది. మరో పార్టీ వారికే ఓటుకు తులం బంగారం ఇస్తామని చెప్పింది. ఆయా పార్టీలు ఇప్పటికే కొన్నిచోట్ల వాటి పంపిణీ కూడా ప్రారంభించారు. ఈ పరిణామాలతో మునుగోడు ఉప ఎన్నికల్లో ఖర్చు కొత్త శిఖరాలకు వెళుతుంది. తెలంగాణలో ఎన్నికల ఖర్చు మునుగోడుకు ముందు, మునుగోడుకు తర్వాత అనేలా ఉన్నాయి పరిణామాలు.
ఆపరేషన్ ఆకర్ష్
గెలుపు మూడు పార్టీలకు అనివార్యం కావడంతో ఆపరేషన్ ఆకర్ష్ కు తెరదీశాయి. కండువా కప్పుకుంటే చాలు 30 వేల వరకు ఇస్తున్నాయి. ఇదంతా కూడా కేవలం ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్నాయి. ఇటీవల గట్టుప్పల్ మండలంలో ఓ పార్టీలో చేరేందుకు వచ్చిన నాయకుడితోపాటు అనుచరులకు ఒక్కొక్కరికి 30 వేల చొప్పున బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. నాయకుల కొనుగోలును కొన్ని నెలల కిందనే ప్రారంభించినా . ఇప్పుడు అది తారాస్థాయికి చేరింది. కొన్ని వారాల కిందట జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, సర్పంచులకు సగటున రెండు లక్షల చొప్పున కొన్ని పార్టీలు పంపిణీ చేశాయి. రోజులు గడిచే కొద్దీ రెండు లక్షలు అన్నది కాస్త ఇప్పుడు చిన్న మొత్తం అయిపోయింది. తాజాగా వీరి ధర పది లక్షల నుంచి 30 లక్షల వరకు పలుకుతోంది. గతంలో ఒక పార్టీ డబ్బు ఇచ్చినా.. ఇప్పుడు మరో పార్టీ కూడా డబ్బు ఇస్తున్నది. అయితే తమ పార్టీ తరఫున పనిచేయాలని చెబుతోంది. కుదరకపోతే ఎదుటి పార్టీ తరఫున పనిచేయకుండా గమ్మున ఉండాలని చెబుతోంది. అయితే ఎన్ని పార్టీలు డబ్బులు ఇచ్చినా నేతలు మాత్రం సిగ్గు లేకుండా తీసుకుంటూనే ఉంటున్నారు. ఇక ఎన్నికల ఖర్చులు చూస్తుంటే సంపన్నులు కూడా రాజకీయాల్లోకి రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది.

ఇక సామాన్యులు దాని గురించి ఆలోచించే పరిస్థితి కూడా లేదు. ఇది రాబోయే రోజుల్లో మరింత తీవ్ర పరిణామాలకు దారి తీసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం కుబేరులకే రాజకీయాలు అడ్డగా మారే ప్రమాదం ఉంది అని చెబుతున్నారు. వందల కోట్లు ఉన్న కుబేరులు పోటీ చేయాలి. లేకపోతే కార్పొరేట్ శక్తులు, బడా కాంట్రాక్టర్లు, పేరు మోసిన వ్యాపారస్తులకు మాత్రమే పోటీ చేయాలన్న తీరుగా ఎన్నికలను మార్చుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు నామినేషన్ల ఘట్టం పూర్తయ్యాక పోలింగ్ తేదీ వరకు ఒక రాజకీయ పార్టీ 50 కోట్లు ఖర్చు చేస్తే అది అత్యధికం అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు దానికి పది రెట్ల వరకు ఒక రాజకీయ పార్టీ ఖర్చుపెడుతోంది. దీంతో పర్యవసానాలు ఆలోచించిందుకే భయం వేస్తోంది అని ఓ రాజకీయ విశ్లేషకుడు వాపోయాడు. రాజకీయాలు ఇలానే ఉంటే డబ్బు ఖర్చు చేయడం పెట్టుబడిగా మారిపోతుందని, రాజకీయం ఫక్తు వ్యాపారంలా మారుతుందని పలువురు సీనియర్ నాయకులు అంటున్నారు. ఎవరు ఏమనుకుంటున్నా విషయంలో తగ్గేదే అన్నట్టుగా మూడు పార్టీలు వ్యవహరిస్తున్నాయి. మునుముందు ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.