X Ban: జమ్మూ కాశ్మీర్‌తో సహా పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ దాడులకు తెగబడుతుంది. దీంతో భారత్ డిజిటల్ రంగంలోనూ గట్టి చర్యలు చేపట్టింది. సోషల్ మీడియా వేదిక X (గతంలో ట్విట్టర్) భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశంలో 8,000 కంటే ఎక్కువ ఖాతాలను బ్లాక్ చేయడం మొదలు పెట్టింది. ఈ విషయాన్ని స్వయంగా కంపెనీ గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ టీమ్ వెల్లడించింది. ఇంతకీ భారత్ ఎందుకు ఈ చర్య తీసుకుంది? బ్లాక్ చేసిన ఖాతాల్లో ఎవరెవరు ఉన్నారు? దీనిపై ఎలాన్ మస్క్ స్పందన ఏమిటి? వివరంగా ఈ కథనంలో తెలసుకుందాం.
Also Read: నిన్న మరిది.. నేడు పీఏ..నెక్ట్స్ విడదల రజనీనేనా?
X వేదికగా కంపెనీ సమాచారాన్ని పంచుకుంది. ఈ ఖాతాలను బ్లాక్ చేయకపోతే తమపై భారీ జరిమానా విధించవచ్చని.. భారతదేశంలో ఉన్న తమ ఉద్యోగులు జైలుకు కూడా వెళ్లాల్సి రావచ్చని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశించిందని తెలిపింది. బ్లాక్ చేసిన ఖాతాల్లో అంతర్జాతీయ మీడియా సంస్థలు, కొంతమంది ప్రముఖుల ప్రొఫైల్‌లు కూడా ఉన్నాయి. చాలా సందర్భాలలో ఈ ఖాతాలు ఏ చట్టాన్ని ఉల్లంఘించాయో ప్రభుత్వం చెప్పలేదని X పేర్కొంది. కొన్నిసార్లు కారణం కూడా చెప్పలేదని, ఆధారాలు కూడా పంచుకోలేదని తెలిపింది.
ప్లాట్‌ఫారమ్ సర్వీసులు దేశంలో కొనసాగడానికి ఈ అకౌంట్లను కేవలం భారతదేశంలో మాత్రమే బ్లాక్ చేస్తున్నట్లు X తెలిపింది. “మేము ప్రభుత్వ ఆదేశాలతో ఏకీభవించం, కానీ భారతదేశంలో ప్రజలు సమాచారంతో అనుసంధానమై ఉండటానికి ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవలసి వచ్చింది” అని కంపెనీ పేర్కొంది.
ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని ఈ కంపెనీ ప్రభుత్వ ఆదేశాల మీద పారదర్శకత పాటించాలని తాము కోరుకుంటున్నామని తెలిపింది. అయితే ప్రస్తుత చట్టపరమైన నియమాలు దానిని అనుమతించవని స్పష్టం చేసింది.
భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న సమయంలో ఈ చర్య చోటుచేసుకుంది. గురువారం రాత్రి జమ్మూ విమానాశ్రయంపై పాకిస్తాన్ దాడికి ప్రయత్నించిన తర్వాత దేశంలోని అనేక ప్రాంతాల్లో బ్లాక్‌అవుట్ విధించారు. గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని భుజ్‌లో రాత్రంతా చీకటి నెలకొనగా, పంజాబ్‌లోని జలంధర్, గుర్దాస్‌పూర్, పఠాన్‌కోట్, అమృత్‌సర్‌లో కూడా భద్రతా కారణాల దృష్ట్యా విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్, ఉరి, పూంచ్, రాజౌరి, కిష్త్వార్, అఖ్నూర్, సాంబా వంటి అనేక ప్రాంతాల్లో సైరన్‌లు మోగడంతో అత్యవసర సన్నద్ధత సూచనలు వెలువడ్డాయి. ఈ సంఘటనల మధ్య X ఖాతాలపై తీసుకున్న చర్య సోషల్ మీడియా సెన్సార్‌షిప్‌పై కొత్త చర్చకు దారితీసింది.
X has received executive orders from the Indian government requiring X to block over 8,000 accounts in India, subject to potential penalties including significant fines and imprisonment of the company’s local employees. The orders include demands to block access in India to…
— Global Government Affairs (@GlobalAffairs) May 8, 2025