Homeఆంధ్రప్రదేశ్‌YCP Gadapa Gadapa Program: వైసీపీ సర్కారుకు వరుస కష్టాలు.. నేతలకు నిపుణులతో పాఠాలట

YCP Gadapa Gadapa Program: వైసీపీ సర్కారుకు వరుస కష్టాలు.. నేతలకు నిపుణులతో పాఠాలట

YCP Gadapa Gadapa Program: వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందా? అందుకే ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఫెయిలవుతున్నాయా? మంత్రులు, ప్రజా ప్రతినిధులకు ప్రజలకు ముఖం చాటేస్తున్నారా? ప్రమాద ఘంటికలు మోగుతున్నాయా? సీఎం జగన్ కు నిఘా వర్గాలు ఇవే నివేదించాయా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అందుకే సీఎం జగన్ అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. అందులో భాగంగా మరోసారి పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, సమన్వయకర్తలతో భేటీ అవుతున్నారు. బుధవారం ఆకస్మికంగా వారితో వర్క్‌షాప్‌ ఏర్పాటు చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి మూడేళ్లు… జగన్‌ వారిని పట్టించుకున్నదే లేదు. మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తుండటం, జనంలో నిలదీతలు ఎక్కువ అవుతుండటంతో మార్చి 25న తొలిసారిగా జగన్‌ వారితో సమావేశమయ్యారు. ‘ప్రజల్లో ఉండాల్సిందే’ అని స్పష్టం చేశారు. ‘ఓడిపోయే వారి భారం మోసేందుకు సిద్ధంగా లేం’ అని తేల్చి చెప్పారు. ‘గడపగడపకూ’ వెళ్లాలని నిర్దేశించారు. అరకొరగా, అన్యమనస్కంగా, అయిష్టంగానే జనంలోకి వెళ్తున్న ఎమ్మెల్యేలకు…. చుక్కలు కనిపిస్తున్నాయి. ‘మూడేళ్లలో ఇంత చేశాం’ అని గొప్పగా చెప్పుకోవాలన్నది ఈ కార్యక్రమం ఉద్దేశం. కానీ… ‘మూడేళ్లలో మీరేం చేశారు’ అంటూ జనం నిలదీస్తున్నారు. వెరసి… ‘గడపగడపకూ’ కార్యక్రమం ఘోరంగా విఫలమైంది. అదే సమయంలో… మంత్రులతో చేపట్టిన ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర కూడా తుస్సుమంది.

YCP Gadapa Gadapa Program
Y S Jagan

సీఎం కలవరపాటు
తాజా పరిణామాలు సీఎం జగన్ కు కలవరపాటుకు గురిచేశాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తలతో అకస్మాత్తుగా వర్క్‌షాప్‌ ఏర్పాటు చేయడానికి కారణం కూడా అదే. ‘గడపగడప’కు అత్యధికులు దూరంగా ఉన్నారు. అసలు… ఈ కార్యక్రమంలో ఏం జరిగింది? మెజారిటీ శాసనసభ్యులు ఎందుకు గైర్హాజరయ్యారు? మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తలు ఈ కార్యక్రమంపై ఎందుకు నిర్లక్ష్యం వహించారు? ప్రజల నుంచి ఏయే అంశాలపై నిలదీతలు ఎదురయ్యాయి? ఎమ్మెల్యేలు దీటుగా ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు? అన్న అంశాలపై జగన్‌ దృష్టి సారించారు. తాడేపల్లిలో బుధవారం ఉదయం 10.30 గంటలకు వర్క్‌షాప్‌ ఏర్పాటు చేశారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రతి కుటుంబానికీ ఎంతెంత లబ్ధి చేకూరుస్తున్నామో వివరించడమే గడప గడపకు కార్యక్రమ ఉద్దేశమని.. దీనిపై ఎమ్మెల్యేలకు, సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులకు ముందుగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం భావిస్తున్నారు. భవిష్యత్‌లో ఈ కార్యక్రమాన్ని ఎలా చేపట్టాలో ఈ వర్క్‌షాప్ లో దిశానిర్దేశం చేయనున్నారు.

Also Read: Pawan Kalyan CM Candidate Issue: పవన్ సీఎం క్యాండిడేట్ లొల్లి: జనసేన, బీజేపీ మధ్య దూరం పెరుగుతుందా?

నిర్లక్ష్యంగా ప్రజాప్రతినిధులు
వైసీపీ నేతల్లో సమన్వయం కొరవడడం.. ప్రజల్లో నానాటికీ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత వల్లే గడప గడపకు, బస్సు యాత్ర విఫలమయ్యాయని వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. క్షేత్ర స్థాయిలో ప్రజానాడిని గుర్తించే పలువురు ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నారని భావిస్తున్నాయి. చాలా మంది శాసనసభ్యులు ఉద్దేశపూర్వకంగానే గడప గడపకు కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేశారని.. కొందరు దీనిని వదిలేసి బంధుమిత్రులతో విదేశాలకు వెళ్లారని.. పాల్గొన్నవారు కూడా మొక్కుబడిగా భాగస్వాములయ్యారని సీఎంకు నివేదికలు అందినట్లు తెలిసింది. పైగా ఆయన దావోస్‌ పర్యటనకు వెళ్లడంతో కార్యక్రమం మరింత నీరసపడిందని.. దానిని అధిగమించడానికి 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మంత్రులతో చేపట్టిన ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర ఘోరంగా విఫలమైందని.. ఇది వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో నెలకొందని వైసీపీ ముఖ్య నేతలు నివేదించినట్లు సమాచారం. దాంతో ఆయన సీరియస్‌ అయ్యారని.. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోని ఎమ్మెల్యేలు, నేతలపై తీవ్ర అసహనంతో ఉన్నారని.. ఈ నేపథ్యంలోనే బుధవారం వర్క్‌షాప్‌ ఏర్పాటు చేశారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

YCP Gadapa Gadapa Program
Y S Jagan

వాయిదాల మీద వాయిదా..
ఈ ఏడాది ఏప్రిల్‌ రెండో తేదీన ఉగాది నుంచి గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, పార్టీ సమన్వయకర్తలను గత మార్చి 15న జగన్‌ ఆదేశించారు. అయితే పండుగ సమయంలో వద్దని.. ఆ తర్వాత వెళ్తామని వారంతా ప్రతిపాదించారు. పైగా లబ్ధిదారుల సమాచారం తమ వద్ద లేదన్నారు. దీంతో వారడిగిన వివరాలను గ్రామ/వార్డు సచివాలయాల వారీగా పంపించారు. అయినా ఇదిగో అదిగో అంటూ వాయిదాలు వేస్తూ.. చివరకు మే 10 తేదీన కదిలారు. అయితే, వారికి ఎక్కడికక్కడ నిరసన గళాలు ఎదురయ్యాయి. రోడ్లు, పింఛన్లు, కరెంటు కోతలు, ఇళ్ల పట్టాలు, స్థానిక సమస్యలపై ఎమ్మెల్యేలను గడప గడపనా నిలదీశారు. దీంతో యాత్రలు, సభలు పెడితే ఇబ్బంది ఉండదని భావించిన ప్రభుత్వ పెద్దలు.. సామాజిక న్యాయభేరి పేరిట బస్సుయాత్ర తలపెట్టారు. బహిరంగ సభలూ నిర్వహించారు. ఉపాధి కూలీలను, డ్వాక్రా సంఘాలను బతిమాలి, బెదిరించి, డబ్బులిచ్చీ మరీ తీసుకొచ్చినా.. సభలు పూర్తికాకముందే వారు వెళ్లిపోవడం గమనార్హం. దీని ప్రభావం 2024 ఎన్నికలపై పడుతుందన్న భయం పార్టీ శ్రేణుల్లోనూ కనిపిస్తోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకే సీఎం వర్క్‌షాప్‌ తలపెట్టారని ప్రచారం జరుగుతోంది.

Also Read:BJP Alliance With Janasena: జనసేనతో పొత్తుపై బీజేపీ పీచేముడ్.. అసలు స్టాండ్ ఏంటి? ఏం చేయనుంది?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular