https://oktelugu.com/

HYDRA: సీఎం హీరో.. రియల్టర్‌ పైసా వసూల్‌.. అసలు బాధితులు సామాన్య ప్రజలే.. హైడ్రాకు వచ్చిన చిక్కు అదే..!

హైడ్రా.. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా మర్మోగుతున్న పేరు ఇదే. ప్రస్తుం హైదరాబాద్‌కే హైడ్రా పరిమితమైనా.. అది తమ జిల్లాకు కూడా వస్తే బాగుండు అన్న అభిప్రాయం దాదాపు అన్ని జిల్లాల ప్రజల్లో వ్యక్తమవుతోంది. అంతలా హైడ్రా రెండు నెలల్లోనే సామాన్యులను ఆకట్టుకుంటోంది. ఇక హైడ్రా పేరు వింటే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 27, 2024 / 01:29 PM IST

    HYDRA(1)

    Follow us on

    HYDRA: హైడ్రా.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. ఏ ఇద్దరు కలిసి కాసేపు మాట్లాడుకున్నా హైడ్రాకు సంబంధించిన ప్రస్తావన వస్తోంది. దూసుకొస్తున్న బూల్డోజర్లు, నేల మట్ట మవుతోన్న భవనాలు పేపర్లలో, టీవీల్లో ఇప్పుడివే వార్తలు. తాజాగా నటుడు నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ కూల్చివేతతో ఈ అంశం పీక్స్‌కి చేరింది. రాజకీయంగా ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.. ‘హైదరాబాద్‌ డిజాస్టర్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌’ అంటే ఎవరికీ తెలియదు. హైడ్రా అనగానే అందరికీ ఆక్రమణల కూల్చివేతలే గుర్తొస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆలోచనల నుంచి ఇది ఏర్పాటైంది. ఒకప్పుడు చెరువులు, కుంటలతో కళకళలాడిన హైదరాబాద్‌ మహా నగరం నేడు కాంక్రీట్‌ జంగిల్‌గా మారింది. చినుకు పడితే చాలు రోడ్లు చెరువులను తలపించేలా మారుతున్నాయి. ఈ సమస్యకు ప్రధాన కారణం చెరువులను ఆక్రమించి, నాలాలాను మూసేసి నిర్మాణాలు చేపట్టడమే అని ప్రభుత్వం అంటోంది. హైదరాబాద్‌ వరదలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగానే హైడ్రాను ఏర్పాటు చేశామని రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు ఈ హైడ్రాను విస్తరించారు. హైడ్రా పనితీరుతో తెలంగాణ ప్రజల్లో రేవంత్‌రెడ్డి హీరో అయ్యారు. తమ తర బేధం లేకుండా.. సెలబ్రిటీలు, రాజకీయ నేతలు అనే తేడా చూపకుండా హైడ్రా బుల్లోజర్లకు స్వేచ్ఛ ఇవ్వడంతో సీఎంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక ఏళ్లుగా ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్‌లలో స్థలం కొనుగోలు చేసి ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్న వారు మాత్రం ఇబ్బంది పడుతున్నారు.

    బాధితులు వారే…
    ఇప్పుడు హైడ్రాతో సీఎం హీరో అయ్యారు. ఆక్రమణలదారుల పాటిట యముడయ్యాడు. ఇక గతంలో ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్‌లలోని భూములను ఆక్రమించి ప్లాట్లుగా మార్చి విక్రయించిన రియల్టర్లు సొమ్ము చేసుకుని సైలెంట్‌ అయ్యారు. ఇక ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చిన అధికారులు నోరు మెదపడం లేదు. ఇప్పుడు వచ్చిన చిక్కు మిడిల్‌ క్లాస్‌ ప్రజలే. సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు రూపాయి రూపాయి పోగుచేసి స్థలం కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకున్నారు. వారికి ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్‌ గురించి తెలియదు. అందరూ ప్లాట్లు కొంటున్నారని వారు కొనేశారు. కానీ, ఇప్పుడు తాము ఉంటున్న ఇల్లు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో లేదా బఫర్‌ జోన్‌ పరిదిలో ఉందని తెలుసుకుని ఆందోళన చెందుతున్నారు. ౖహె డ్రా బుల్డోజర్లు ఎప్పుడు తమ ఇళ్లపైకి వస్తాయోనని భయపడుతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని డబ్బులు కూడబెట్టుకుని కట్టుకున్న ఇళ్లను కూల్చితే తమ బతుకు ఏంటన్ని ప్రశ్నిస్తున్నారు.

    హైడ్రాకు చిక్కులు..
    సంపన్నులు, నేతల ఆస్తులు, భవనాలు కూల్చడాన్ని ఎవరూ తప్పు పట్టడం లేదు. కానీ, మిడిల్‌ క్లాస్‌ ప్రజల ఇళ్లపైకి బుల్డోజర్లు రావడంపైనే అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాట్లు అమ్మిన రియల్టర్‌ను, నిర్మాణ అనుమతులు ఇచ్చిన అధికారులను ఏమీ అనకుండా.. సామాన్యుల ఇళ్లను కూల్చడాన్ని చాలా మంది తప్పు పడుతున్నారు. ఎఫ్‌టీఎల్, బఫర్‌ పరిధిని క్లియర్‌ చేయాలనుకుంటే… సామాన్యులకు ముందుగా పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. అదే సమయంలో ప్లాట్లు విక్రయించిన రియట్లర్‌ నుంచి ఆమోత్తాని వసూలు చేయాలని, బిడ్డింగ్‌ పర్మిషన్‌ ఇచ్చిన జీహెచ్‌ఎంసీ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కానీ, సామాన్యులకు అన్యాయం చేయద్దని విన్నవిస్తున్నారు. ఈ విషయంలో హైడ్రా కూడా పునరాలోచన చేస్తోందని తెలిసింది. సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లి మిడిల్‌ క్లాస్‌ ప్రజలు నష్టపోకుండా చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి సీఎం నిర్ణయం ఎలా ఉంటుంది.. హైడ్రా తర్వాతి స్టెప్‌ ఏంటి అన్నది తెలియాల్సి ఉంది.