Homeజాతీయ వార్తలుGO 59 : జీవో 59.. బీఆర్ఎస్ నేతలు ఇంతలా దోచుకున్నారా?

GO 59 : జీవో 59.. బీఆర్ఎస్ నేతలు ఇంతలా దోచుకున్నారా?

GO 59 : ఉదయాన్నే పేపర్ చూడగానే భారత రాష్ట్ర సమితి నేతల భూకబ్జాలపై యాక్షన్ షురూ అని వెలుగు పత్రికలో ఒక కథనం కనిపించింది. జిల్లాలో రంగంలోకి ఆఫీసర్లు దిగారని, కూల్చివేతలు ప్రారంభించారని, ఖమ్మం జిల్లాలో భారత రాష్ట్ర సమితి కార్పొరేటర్ పై కేసు నమోదు చేశారని, సూర్యాపేటలో 14 మంది గులాబీ నేతల కబ్జాలపై విచారణకు ఆదేశించారని, నిర్మల్, సిద్దిపేట జిల్లాల్లోనూ ఇదే వ్యవహారం కొనసాగుతోందని.. ప్రభుత్వం మారిపోయిన నేపథ్యంలో ప్రజల నుంచి అధికారులకు ఫిర్యాదులు ఎక్కువయ్యాయని వెలుగు పత్రిక రాసుకొచ్చింది. వాస్తవానికి అంతకంటే రెండు రోజుల ముందే ఖమ్మం జిల్లాలో భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఓ మహిళ కార్పొరేటర్ గొల్లగూడెంలోని మమత ఆసుపత్రి రోడ్డులో 415 చదరపు గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడం.. దానిని క్రమబద్ధీకరించుకునేందుకు జీవో 59ని అడ్డం పెట్టుకోవడం.. దానికోసం ప్రభుత్వ అధికారులకు తప్పుడు వివరాలు అందజేయడం.. వంటి విషయాలు వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా ఈ జీవో 59 వెనుక ఉన్న మతలబేమిటో చూడాలని ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులకు దిమ్మతిరిగే వాస్తవాలు కనిపిస్తున్నాయి.

కెసిఆర్ ప్రభుత్వ హయాంలో జీవో 59ని ఆగమేఘాల మీద తెరపైకి తీసుకొచ్చారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేకపోవడంతో సరికొత్త ఆదాయం మార్గానికి అప్పట్లో రంగం సిద్ధం చేశారు. దాని కోసం జీవో 59 ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం సంవత్సరాలుగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్న వారికి మార్కెట్ రేటు కంటే తక్కువ ఫీజు చెల్లిస్తే క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది. కానీ ఈ జీవో 59లో విధానాలు చాలావరకు లోపభూయిష్టంగా ఉండడంతో గులాబీ నేతలు అడ్డగోలుగా పందేరానికి తెర తీశారు. ఎలాగూ అధికారులు కూడా తమ అడుగులకు మడుగులు వత్తేవారు కావడంతో ఎక్కడికక్కడ స్థలాలను ఆక్రమించుకున్నారు. తర్వాత క్రమబద్దీకరించుకున్నారు. అయితే ఈ క్రమబద్ధీకరణకు సంబంధించి అడ్డగోలుగా నిబంధనలను అతిక్రమించడంతో.. ఇప్పుడు ఆ విషయాలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి.

ఉదాహరణకు ఖమ్మం జిల్లా చూసుకుంటే ఈ జిల్లాకు చెందిన అప్పటి మంత్రి అనుచరులు అడ్డగోలుగా భూ దందాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ మంత్రి హయాంలో అధికార పార్టీ నగర అధ్యక్షుడు తన సతీమణిని కార్పొరేటర్ గా గెలిపించుకున్నాడు. ఆ తర్వాత భూ దందాలకు తెరలేపాడని.. అడ్డగోలుగా భూములు ఆక్రమించుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. పైగా అప్పటి మంత్రి సహకారంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు అనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇందులో భాగంగా ఖరీదైన ప్రాంతంలో ప్రభుత్వ స్థలాలను తన భార్య పేరుతో క్రమబద్ధీకరించుకున్నాడని.. దీనికోసం ఖమ్మం మున్సిపల్ అధికారులకు కూడా తప్పుడు వివరాలు సమర్పించాడని ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీంతో ఖమ్మం జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించడంతో అసలు విషయాలు వెలుగు చూశాయి. ఫలితంగా అతని భార్య పేరు మీద చేసిన రిజిస్ట్రేషన్ కూడా ఖమ్మం జిల్లా కలెక్టర్ రద్దు చేశారు.. ప్రస్తుతం ఇలాంటి వ్యవహారాలపై విచారణ కొనసాగుతోంది.

ఇక ఈ జీవో 59కి సంబంధించి గతంలో జరిపిన రిజిస్ట్రేషన్ లను తన వద్దకు తీసుకురావాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా అధికారులను ఆదేశించారు. ఏమాత్రం వివరాలు లేకున్నా కూడా రెండవ మాటకు తావు లేకుండా ఆ రిజిస్ట్రేషన్ లను రద్దు చేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. కాగా కేసీఆర్ ప్రభుత్వం జీవో 59ని పేదల కోసం తీసుకొచ్చామని అప్పట్లో చెప్పింది. క్షేత్ర స్థాయిలో పూర్తిగా లబ్ధి పొందింది మాత్రం భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు, నాయకులు మాత్రమే.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జీవో 59 సంబంధించిన భూ కేటాయింపులను నిశితంగా పరిశీలిస్తోంది. ఇందులో అవకతవకలు ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆ స్థలంలో ఉన్న నిర్మాణాలను కూల్చేస్తుంది. ముఖ్యమంత్రి నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలు రావడంతో అధికారులు క్షేత్రస్థాయిలో చాలా వేగంగా అడుగులు వేస్తున్నారు. అయితే రాష్ట్రం మొత్తం ఈ జీవో 59ని అడ్డం పెట్టుకొని అప్పటి అధికార భారత రాష్ట్ర సమితి నాయకులు అడ్డగోలుగా దందాలు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు అధికారులకు కూడా అదే స్థాయిలో ఫిర్యాదులు అందుతున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular