YS Vijayamma: వైఎస్ విజయమ్మ మరోసారి హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటున్న వేళ.. ఆమె కూతురు వైపు ఉంటారా? కొడుకు వైపు నిలుస్తారా? అన్న ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఎటు మొగ్గు చూపుతారన్నది చర్చనీయాంశంగా మారింది. వైఎస్ అకాల మరణంతో ఆమె రాజకీయాలపై దృష్టి పెట్టాల్సి వచ్చింది. భర్త మరణానంతరం కొడుకు జగన్ కు సీఎం పదవి ఇవ్వాలని కోరుతూ అప్పటి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. సానుకూల స్పందన రాకపోవడంతో జగన్ తో పాటు తాను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్ స్థాపించారు. దానికి గౌరవ అధ్యక్షురాలుగా వైఎస్ విజయమ్మ కొనసాగారు.ఇటీవల ఆ పదవికి రాజీనామా చేసి షర్మిల వెంట నడుస్తున్నారు.
రాజశేఖర్ రెడ్డి బతికున్న సమయంలో రాజకీయ వేదికలు పంచుకోవడం తక్కువ. కానీ కుమారుడు జగన్ రాజకీయ ఉన్నతి కోసం విజయమ్మ చేయని ప్రయత్నం అంటూ లేదు. జగన్ జైల్లో ఉన్న సమయంలో పార్టీ బాధ్యతలు నిర్వహించారు. ఉప ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. 2014 ఎన్నికల్లో విశాఖ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. కానీ ఓటమి ఎదురైంది. అయినా సరే ఎక్కడా వెనక్కి తగ్గలేదు. గత ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. కుమారుడు జగన్కు ఒక్క అవకాశం ఇవ్వాలని ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఊరూ వాడా ప్రచారం చేశారు. కానీ ఎన్నికల అనంతరం సీన్ మారింది. జగన్ తో సోదరి షర్మిలకు విభేదాలు వచ్చాయి. దీంతో షర్మిల తన దారి తాను చూసుకున్నారు. తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశించారు. దీంతో వైసిపి గౌరవ అధ్యక్షురాలు పదవికి రాజీనామా చేసిన విజయమ్మ కుమార్తె వెంట నడిచారు.
తెలంగాణ రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి షర్మిల ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నో రకాలుగా అవాంతరాలు ఎదురయ్యాయి. ఒకటి రెండు సార్లు జైలుకు కూడా వెళ్లారు. అయితే ఆ సందర్భంలో కనీసం జగన్ పలకరించిన పాపాన పోలేదు. ఒకానొక దశలో విజయమ్మ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపాల్సి వచ్చింది. కానీ జగన్ కనీసం స్పందించలేదు. మాట మర్యాద కైనా పలకరించలేదు. పైగా బాబాయ్ వివేక హత్య కేసులో జగన్ వ్యవహార శైలితో కుటుంబం అడ్డగోలుగా చీలిపోయింది. వివేక కుమార్తె సునీత న్యాయపోరాటం చేస్తున్నారు. ఆమెకు విజయమ్మతో పాటు షర్మిల మద్దతు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటువంటి సమయంలో షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు తీసుకుంటే.. విజయమ్మ అనుసరించే వైఖరిపై అందరి దృష్టి ఉంది. ఆమె వైసీపీలో ఉంటారా? లేకుంటే షర్మిల తో పాటు కాంగ్రెస్ లో చేరతారా? అన్న బలమైన చర్చ నడుస్తోంది. మరి విజయమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.