Vangaveeti Radha: దివంగత వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా రాజకీయాల్లో రోజురోజుకు వెనుకబడి పోతున్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో ఆయన ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీకే పరిమితమవుతూ వస్తున్నారు. దీంతో ఆయన వెంట ఉండే క్యాడర్ డీలా పడిపోతుంది. ఈ పరిస్థితికి ఆయన తీసుకున్న నిర్ణయాలనే కారణమని తెలుస్తోంది. దీంతో రాధాకు ప్రజల్లో క్రేజ్ ఉన్నప్పటికీ అదృష్టంలేని నాయకుడిగా మిగిలిపోతున్నారు.
2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన అధికార పార్టీలో ఉన్నారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినపుడు రాధా ఆపార్టీకి వెళ్లేందుకు ప్రయత్నించగా వైఎస్ సర్దిచెప్పారు. అయితే ఆయన మాట వినకుండా రాధా ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే ఆపార్టీ తిరిగి కాంగ్రెస్ లో విలీనమైంది.
Also Read: అటు మరీ తక్కువ, ఇటు మరీ ఎక్కువ.. చిన్న సినిమాలకు దారేది ?
ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీలో రాధా చేరారు. ఇక 2014 ఎన్నికల్లో వైసీపీ ప్రతిపక్షానికే పరిమితమైంది. ఆ ఐదేళ్లు రాధా వైసీపీ బలోపేతం కోసం బాగానే కష్టపడి పని చేశారు. అయితే సెంట్రల్ నియోజకవర్గం నుంచి మల్లాది విష్ణును వైసీపీలో చేర్చుకోవడం.. అదే నియోజకవర్గంలో గౌతమ్ రెడ్డికి ప్రాధాన్యం పెరగడంతో రాధా వైసీపీని వీడి ఎన్నికల ముందు టీడీపీలో చేరారు.
ఎన్నికలకు చివరి నిమిషంలో రాధా టీడీపీలో చేరడంతో ఆయనకు టీడీపీ నుంచి ఎమ్మెల్యే సీటు ఖరారు కాలేదు. అయితే అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాగా మళ్లీ సీన్స్ రివర్స్ అయింది. ఈసారి టీడీపీ ప్రతిపక్షానికి పరిమితం కాగా వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో రాధా రెంటికి చెడ్డ రేవడిలా మారిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన టీడీపీ ఉన్నారా? లేదా అనే సందిగ్ధత మాత్రం నెలకొంది.
టీడీపీ కార్యక్రమాల్లోనే రాధా పెద్దగా యాక్టివ్ గా కన్పించడం లేదు. వైసీపీలో ఉన్న తన స్నేహితులు కొడాలి నాని, వల్లభనేని వంశీలతో నిత్యం మంతనాలు చేస్తూ కన్పిస్తుంటారు. ఈక్రమంలోనే కొడాలి నాని రాధాను తిరిగి వైసీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాధా టీడీపీని వదిలి వైసీపీలోకి వస్తే త్వరలోనే భర్తీ చేయబోయే ఎమ్మెల్సీల్లో స్థానాల్లో ఒక సీటు ఇస్తామని ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది.
టీడీపీ ఇచ్చిన ఆఫర్ నే అధికారంలో ఉన్న వైసీపీ ఇవ్వడంతో రాధా ఎటూ తేల్చుకోలేక పోతున్నారట. ఇప్పటికే దశాబ్దంన్నరపాటు అధికారానికి దూరంగా ఉంటున్న రాధా ఈసారైనా సరైన నిర్ణయం తీసుకుంటారా? లేదా మళ్లీ తప్పడుగు వేస్తారా? అనేది ఆయన వెంట ఉండే క్యాడర్ చర్చించుకుంటోంది. ఏదిఏమైనా రాధా తీసుకోబోయే నిర్ణయంపైనే అతడి రాజకీయ భవిష్యత్ ఉందనేది మాత్రం స్పష్టమవుతోంది.
Also Read: న్యూ ఇయర్ సందర్భంగా.. మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..