మూడో ఫ్రంట్ తో.. మూడోస్సారి..?

జాతీయ రాజ‌కీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం థ‌ర్డ్ ఫ్రంట్‌. బీజేపీ, కాంగ్రెస్ ల‌కు ప్ర‌త్యామ్నాయంగా దేశంలో మ‌రో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని ఎప్ప‌ట్నుంచో ప్రాంతీయ పార్టీలు ప్ర‌య‌త్నాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రోసారి అలాంటి ప్ర‌య‌త్నం చేసేందుకు ప‌లువురు నేత‌లు సిద్ధ‌మ‌వుతున్నారు. మ‌రి, ఈ నిర్ణ‌యం వ‌ల్ల మూడో ప్ర‌త్యామ్నాయ ప్ర‌భుత్వం కేంద్రంలో కొలువుదీరే అవ‌కాశం ఎంత వ‌ర‌కు ఉంది? అనే చ‌ర్చ ఒక‌టైతే.. బెడిసికొడితే ప్ర‌యోజ‌నం ఎవ‌రికి అన్న‌ది మ‌రో […]

Written By: Bhaskar, Updated On : June 24, 2021 4:09 pm
Follow us on

జాతీయ రాజ‌కీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం థ‌ర్డ్ ఫ్రంట్‌. బీజేపీ, కాంగ్రెస్ ల‌కు ప్ర‌త్యామ్నాయంగా దేశంలో మ‌రో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని ఎప్ప‌ట్నుంచో ప్రాంతీయ పార్టీలు ప్ర‌య‌త్నాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రోసారి అలాంటి ప్ర‌య‌త్నం చేసేందుకు ప‌లువురు నేత‌లు సిద్ధ‌మ‌వుతున్నారు. మ‌రి, ఈ నిర్ణ‌యం వ‌ల్ల మూడో ప్ర‌త్యామ్నాయ ప్ర‌భుత్వం కేంద్రంలో కొలువుదీరే అవ‌కాశం ఎంత వ‌ర‌కు ఉంది? అనే చ‌ర్చ ఒక‌టైతే.. బెడిసికొడితే ప్ర‌యోజ‌నం ఎవ‌రికి అన్న‌ది మ‌రో చ‌ర్చ‌.

దేశంలో బీజేపీ స‌ర్కారు వ‌రుస‌గా రెండుసార్లు గ‌ద్దెనెక్కింది. 2024లో మూడో ద‌ఫా గెలిచి హ్యాట్రిక్ సాధించాల‌ని ఉవ్విళ్లూరుతోంది. అయితే.. ప్ర‌త్య‌ర్థుల ప‌రిస్థితి ఏంట‌న్న‌ప్పుడు లెక్క‌లు స‌వాల‌క్ష‌ ఉన్నాయి. రెండు సార్లు అధికారం కోల్పోవ‌డంతో కాంగ్రెస్ మ‌రింత డీలా ప‌డిపోయింది. బీజేపీకి వ‌చ్చే స‌హ‌జ వ్య‌తిరేక‌త‌ను సైతం క్యాష్ చేసుకునే ప‌రిస్థితిలో కాంగ్రెస్ ఉన్న‌ట్టు క‌నిపించ‌ట్లేదు. క‌మ్యూనిస్టుల ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టు అన్న‌చందంగానే త‌యారైంది. మిగిలిన‌వ‌న్నీ ప్రాంతీయ పార్టీలే. ఇలాంటి ప‌రిస్థితుల్లో మూడో ఫ్రంట్ ద్వారా మోడీని ఎదుర్కోవాల‌ని చూస్తున్నారు ప్రాంతీయ నేతలు.

తృణ‌మూల్‌, ఎన్సీపీ, ఆప్‌ వంటి పార్టీలు థ‌ర్డ్ ఫ్రంట్ కోసం ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తున్నాయి. ఇప్ప‌టికే ద‌శ‌ల‌వారీ స‌మావేశాలు మొద‌లు పెట్టాయి. ఆర్జేడీ, జేడీఎస్‌, లెఫ్ట్ వంటి పార్టీలు కూడా సానుకూలంగానే ఉన్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. అయితే.. ఇవ‌న్నీ వేర్వేరు అభిప్రాయాల‌తో ముందుకుసాగే పార్టీలు అన్న సంగ‌తి తెలిసిందే. ఇలాంటి వ‌న్నీ కుంప‌టి పెట్టినా.. అధికారంలోకి రాగ‌ల‌వా? అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌. వ‌చ్చినా.. ఆ అధికారం ఎంత కాలం ఉంటుంద‌న్న‌ది స‌మాధానం లేని ప్ర‌శ్న‌. నేష‌న‌ల్ ఫ్రంట్ వంటి మూడో కూట‌ములు ఎన్నాళ్లూ కొన‌సాగాయో తెలిసిందే.

మ‌రో స‌మ‌స్య కూడా ఉంది. దేశ‌వ్యాప్తంగా ఉన్న పార్ల‌మెంట్ స్థానాల్లో దాదాపు స‌గం స్థానాల్లో పోరు బీజేపీ – కాంగ్రెస్ మ‌ధ్య‌నే కొన‌సాగే ప‌రిస్థితి. ఈ థ‌ర్డ్ ఫ్రంట్ కూట‌మిలో ఉండే పార్టీల‌న్నీ.. త‌మ రాష్ట్రాలో త‌ప్ప‌, మిగిలిన చోట్ల ప్రాతినిథ్యం కూడా లేదు. మ‌రి, కాంగ్రెస్ ను కాద‌ని ఈ పార్టీలు అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం ఉందా? అంటే.. అవును అని ఎవ్వ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి.

బీజేపీపై వ్య‌తిరేక‌త ఉంద‌ని ప్ర‌చారం సాగుతున్న నేప‌థ్యంలో.. దాన్ని క్యాష్ చేసుకోవాల‌ని థ‌ర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తే.. అది ఖ‌చ్చితంగా క‌మ‌లం పార్టీకే మేలు జ‌రుగుతుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఖ‌చ్చితంగా ఓట్ల చీలిక జ‌రుగుతుంద‌ని, ఇది కాంగ్రెస్ కు కాకుండా.. అంతిమంగా బీజేపీకి ప్ల‌స్ పాయింట్ అవుతుంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. అదే జ‌రిగితే.. మూడో సారి బీజేపీ అధికారం చేప‌ట్టినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు. మ‌రి, ఏం జ‌రుగుతుంది? థ‌ర్డ్ ఫ్రంట్ ఏర్ప‌డుతుందా? రాబోయే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉండబోతోంది? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే.. మ‌రికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.