మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కి సొంతంగా భవనం కూడా కరువైంది. మహామహ నటులైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున, నాగబాబు, మురళీమోహన్ లాంటి వారున్నా ఇది వాగ్దానంగానే మారుతోంది. దశాబ్దాలైన సొంత భవనం కల నెరవేరడం లేదు. మా ఎన్నికలప్పుడు హామీ ఇవ్వడం ఆ తరువాత ముఖం చాటేయడం షరా మామూలైపోయింది. మా కు బిల్డింగ్ కావాలని అందరికి ఉన్నా అది ఆశగానే మిగిలిపోతోంది.
గత ఎన్నికల్లో సైతం మా కు సొంత భవనం నిర్మిస్తామని చెప్పి వాగ్గానాలు చేసి పదవుల్లోకి వచ్చారు. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ కూడా ఇదే మాట ఇస్తూ విజయం సాధించాలని చూస్తున్నారు. అత్యాధునిక సదుపాయాలతో జిమ్, స్విమ్మింగ్ ఫూల్, ఆటస్థలం, ఫంక్షన్ హాల్ తదితర సౌకర్యాలతో నిర్మిస్తామని చెప్పడంతో మాట నిలబెట్టుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.
దశాబ్దాలుగా తీరని కల ఇప్పుడు నెరవేరుతుందని భావన ఎవరికి కలగనట్లు కనిపిస్తోంది. దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయకులున్న పరిశ్రమలో మాకు బిల్డింగ్ లేకపోవడం దురదృష్టకరం. చిరు, పవన్, మోహన్ బాబు, నాగార్జున, ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్, బన్ని లాంటి వాళ్లున్నా భవనం కోసం స్థలం సంపాదించడం కష్టంగానే మారింది.
ఫిల్మ్ చాంబర్ కు దగ్గరలోనే స్థలం ఇవ్వాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మా అధ్యక్షుడిగా గెలిచిన వారంతా కొత్తలో ప్రయత్నించినా తరువాత వదిలేశారు. దీంతో మా కోసం భవన నిర్మాణం కలగానే మిగిలిపోతోంది. ఇన్నేళ్లయినా పాత వాగ్దానం పట్టుకుని వేలాడుతున్నారు. ఈసారైనా వాగ్దానం నెరవేరుస్తారో లేదో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.