Mudragada strategy: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. అయితే ఇప్పటి నుంచే అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. తెలంగాణ మాదిరిగానే ఏపీలోనూ సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ప్రజల్లో వ్యతిరేకత రాకముందే ఎన్నికలకు వెళితే మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని జగన్ భావిస్తున్నారు.

ఈనేపథ్యంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో తీసుకున్న కీలక నిర్ణయాలను వెనక్కి తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో అనేక దూకుడు నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో కొన్ని వర్గాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతలు వచ్చాయి. అలాంటి వాటిని జగన్ సర్కారు ఇటీవల కాలంలో పునః సమీక్షిస్తోంది.
ఈక్రమంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన కేబినేట్ సమావేశంలోనూ మంత్రులకు ఈమేరకు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ప్రత్యర్థి పార్టీలు సైతం అలర్ట్ అవుతున్నారు. ఇదే సమయంలో టీడీపీ, వైసీపీలకు ధీటుగా మూడో కూటమి ఏపీలో అవతరించనుందనే టాక్ విన్పిస్తోంది.
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించేందుకు కసరత్తులు చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. ఇటీవల ఆయన వరుసగా రాష్ట్రంలోని ముఖ్య నేతలతో భేటి అవుతుండటం ఈ ప్రచారంలో నిజమేననే వాదనలు విన్పిస్తున్నాయి. ఆదివారం ముద్రగడ పద్మనాభం తన స్వగ్రామమైన కిర్లంపూడిలో బీసీ, ఎస్.సి నేతల భేటీకావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ కన్వీనర్ కుడిపూడి సూర్యనారాయణ, మాలమహానాడు నేత ఆర్.ఎస్.రత్నాకర్ లతో ముద్రగడ భేటి అయ్యారు. కొద్దిరోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ ఉద్యమాలకే పరిమితమైన ముద్రగడను వీరందరు కలుకోవడం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. వీరిని ముద్రగడను ఆప్యాయంగా అక్కున చేర్చుకొని పలు కీలక విషయాలను చర్చించినట్లు తెలుస్తోంది.
కాపు, బీసీ, దళిత కులాలకు ఐక్యం చేసి రాజ్యాధికారమే లక్ష్యంగా వీరంతా కలిసి కొత్త పార్టీ పెట్టేందుకు సిద్దమవుతున్నారని తెలుస్తోంది. ఈ కొత్త పార్టీని ముద్రగడ ముందుండి నడిపిస్తారనే టాక్ విన్పిస్తోంది. అలాగే తమతో కలిసి వచ్చే పార్టీలతో ముందుకెళ్లేందుకు సిద్దమనే సంకేతాలను వారంతా పంపిస్తున్నారు. దీంతో జనసేనతో కలిసి వీరంతా కూడా ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉందనే ప్రచారం జరుగుతోంది.
రాజకీయంగా అపారమైన అనుభవం కలిగిన ముద్రగడకు కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో తెలుసు. అందుకు తగ్గట్టుగానే ఆయన ముందుగానే అన్నిరకాల వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో ఆమేరకు ఏర్పాట్లను చేసుకుంటున్నారని తెలుస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో వైసీపీ, టీడీపీలకు ప్రత్యామ్నాయంగా ముద్రగడ పార్టీ మారబోతుందా? అనే చర్చ నడుస్తోంది.